మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్, గుంటూరు అర్బన్ ఎస్పీ అయిన అమ్మిరెడ్డి పై ఈ రోజు శాసనమండలిలో సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ను ఆయన మండలి చైర్మెన్ కు ఇచ్చి విచారణ చేసి తగు చర్యలు తీసుకోమని కోరారు. గుంటూరు ఎస్పీ తనను సోషల్ మీడియాలో బెదిరించారని, తన హక్కులకు భంగం కలిగించారని, తప్పుడు అరెస్ట్ ను ప్రశ్నిస్తే, తనను అరెస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగారని, తన నోటీస్ లో నారా లోకేష్ పేర్కొన్నారు. దీని పై చర్యలు తీసుకోవాలని కోరారు. గత వారం పొన్నూరులో ఎమ్మెల్యే ప్రహరీ గోడ ఓపెనింగ్ అంటూ హడావిడి చేస్తుంటే, మణిరత్నం అనే వ్యక్తి అవి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో అది వైరల్ అయ్యింది. తరువాత మణిరత్నంను పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. ఈ సమయంలో, నారా లోకేష్ ఒక ట్వీట్ పెట్టారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా ? అసలు అందులో ఏముందని అరెస్ట్ చేస్తారు అంటూ ట్వీట్ చేసారు. అయితే దీని పై స్పందించిన గుంటూరు ఎస్పీ అది ఫేక్ ట్వీట్ అంటూ, లోకేష్ ఫేక్ ప్రచారం చేస్తున్నారని, ఇలా చేస్తే అరెస్ట్ చేస్తాం అని హెచ్చరించారు. దీని పై ఘాటుగా స్పందించిన లోకేష్, స్టేషన్ సిసి టీవీ ఫూటేజ్ బయట పెట్టాలని కోరుతూ, అదే విధంగా బాధితుడి వీడియో కూడా పెట్టారు. దీంతో తాము అరెస్ట్ చేయలేదని, కేవలం విచారణ కోసం పిలిచామని పోలీసులు చెప్పారు. అయితే మరి ఎందుకు ఫేక్ ట్వీట్ అని చెప్పారు, ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్పారని లోకేష్ ప్రశ్నించారు. పోలీసులు తమ హద్దుల్లో ఉండాలని, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తే ఇబ్బందులు పడతారని అన్నారు. అయితే దీని పై గుంటూరు ఎస్పీ నుంచి తదుపరి ఎలాంటి వివరణ రాకపోవటంతో, లోకేష్ మండలి చైర్మెన్ కు జరిగిన ఘటన పై ఫిర్యాదు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read