నవ్యాంధ్రప్రదేశ్ లో రెండు పెద్ద నగరాలుగా ఉన్న విజయవాడ, విశాఖపట్నంలను అనుసంధానం చేసేందుకు ఎయిర్ ఇండియా (ఏఐ) దృష్టి సారించింది. విజయవాడ నుంచి వయా విశాఖ మీదుగా బెంగళూరుకు నూతన సర్వీసును జూన్ 1వ తేదీ నుంచి ప్రారంబిస్తోంది. వారంలో నాలుగు రోజుల పాటు గురు, శుక్ర, శని, ఆదివారాలలో విమాన సర్వీసులు నడుస్తాయి.
విజయవాడ, విశాఖపట్నం నగరాలను అనుసంధానం చేస్తూ ఆపరేషన్స్ నిర్వహించటంలో ఎయిర్ ఇండియాకు ఇది రెండో సర్వీసు. ఈ రెండు నగరాలను అనుసంధానం చేయటం పక్కన పెడితే బెంగళూరుకు నడపడం మాత్రం ఎయిర్ ఇండియాకు ఇది మొదటి సర్వీసుగా చెప్పుకోవాలి. బెంగళూరుకు ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకోవటంతో పాటు రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలను అనుసంధానించటం వల్ల మరింత మార్కెట్కు అవకాశం ఉంటుందని ఎయిర్ ఇండియా భావిస్తోంది.
విశాఖకు వచ్చిన వారు రాజధాని ప్రాంతానికి రావటానికి తగిన విమాన సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ ఇండియాకు ఉదయం సమయంలో ఒక సర్వీసు ఉంది. ఈ సర్వీసు సరైన సమయంలో అందుబాటులో లేదు. తిరుపతికి వెళ్ళే యాత్రీకులను దృష్టిలో ఉంచుకుని నడుపుతున్న సర్వీసు కాబట్టి, దానికి అనుగుణంగానే ఉంది. మిగిలిన సమయాలలో విమానం లేకపోవటం వల్ల రోడ్డు, రైలు మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఈ కొత్త సర్వీస్, విశాఖ నుంచి మధ్యాహ్నం 14.25కు బయలుదేరి, విజయవాడకు 15.25కు చేరు కుంటుంది. విజయవాడ నుంచి ఈ విమానం 15.50కు బెంగళూరు బయలుదేరి 17.05 గంటలకు చేరుకుంటుంది. తిరిగి బెంగళూరు నుంచి 17.35 గంటలకు విశాఖ బయలుదేరి 18.55కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 19.55కు విజయవాడ బయలుదేరి 20.55 గంటలకు చేరుకుంటుంది. ఈ సర్వీసుతో విశాఖ వాసులకు మధ్యాహ్నం, రాత్రి కూడా విజయవాడ రావటానికి అందుబాటులో విమానాలు ఉంటాయి.

