ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రధాని మోదీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారంటూ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కడపలో చెప్పటం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసీరెడ్డి శనివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. మోదీ ఇచ్చింది స్పెషల్ ట్రీట్‌మెంట్ కాదు... స్పెషల్ పనిష్‌మెంట్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన రాజధాని నగరం హైదరాబాద్ తెలంగాణకు దక్కినందున ఆ మేరకు సీమాంధ్ర నష్టపోకుండా నాటి మన్మోహన్‌సింగ్ మూడు వరాలు ప్రకటించిందన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో అవి అమలయి ఉంటే సీమాంధ్ర ఈ పాటికి స్వర్ణాంధ్ర అయి ఉండేదన్నారు. దురదృష్టవశాత్తు కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడంతో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రానికి సంజీవని లాంటి మొదటి వరం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయమని చెప్పిన మోదీ ఈ రాష్ట్రానికి స్పెషల్ పనిష్‌మెంట్ ఇచ్చారని అన్నారు.

modi 200102019

రెండో వరం వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద రావాల్సిన రూ. 24,350 కోట్లకు పిల్లికి భిక్షం వేసినట్లు కేవలం రూ. 1050 కోట్లిచ్చి స్పెషల్ పనిష్‌మెంట్ ఇచ్చారన్నారు. ఇక మూడో వరం కింద రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం, రాజధాని పన్ను రాయితీలు, 11 కేంద్ర సంస్థలు, కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ, కొత్త ఓడరేవు, కొత్త రైల్వేజోన్, వీటన్నింటికీ దాదాపు రూ. 5 లక్షలకోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎంగిలి మెతుకులు విదిల్చినట్లు కేవలం రూ. 14,500 కోట్లు (రెండు శాతం) ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. తాము అడిగిన సమాచారం ఇవ్వనందునే కడపలో ఉక్కు కర్మాగారం స్థాపనలో జాప్యం జరుగుతున్నదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పటం కేవలం సాకు మాత్రమేనని తులసీరెడ్డి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మోదీని గద్దె దించి కాంగ్రెస్‌కు అధికారం అప్పచెప్పటమే ఏకైక పరిష్కారన్నారు.

modi 200102019

రాష్ట్రానికి కేంద్రం స్పెషల్ ట్రీట్‌మెంట్ అవసరం లేదని, ప్రత్యేక హదా కావాలని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తో కలిసి రాష్ట్రాన్ని విభజించిన బీజేపీ, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎన్నికల ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా హామీలు గుప్పించిన నరేంద్రమోదీ గెలిచిన తరువాత రాష్ట్ర ప్రజలను నిలువునా వంచించారన్నారు. తాజాగా కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి రాష్ట్రం అసలు సమాచారమే ఇవ్వలేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పటం వాస్తవ విరుద్ధమన్నారు. కేంద్రం చెప్పే మాయమాటలు నమ్మేందుకు రాష్ట్రంలో ఎవరూ చెవుల్లో క్యాలిఫ్లవర్ పూలు పెట్టుకోలేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read