కరోనా మన దేశంలో వస్తుంది అంటే, అదే విదేశీ ప్రయాణికులు వల్ల. మన దేశంలో, గత రెండు నెలల్లో, 15 లక్షల మంది, విదేశాల నుంచి వచ్చారని కేంద్రం చెప్పింది. ఇక మన రాష్ట్రానికి వస్తే, ఇప్పటికీ ఎంత మంది వచ్చారు అనే దాని పై క్లారిటీ లేదు. ఈ సమస్య గురించి ఏపి ప్రభుత్వం స్పందించటం మొదలు పెట్టిన సమయంలో, 11 వేల మంది విదేశాల నుంచి వచ్చారని ప్రభుత్వం చెప్పింది. తరువాత వాలంటీర్లు ద్వారా సర్వే చేసామని, ఈ సంఖ్య 12 వేలు అని అన్నారు. ఇక ఆ తరువాత, ప్రెస్ మీట్లలో, 13 వేలు అని, 14 వేలు అని, ఇలా రోజుకి ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. ఇక తాజాగా, మొన్న జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో, ఆ సంఖ్యను అమాంతం పెంచేసి, 26 వేలు చేసారు. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ బులిటెన్ లో, ఈ సంఖ్య, 29 వేలుకి పెరిగిపోయింది.

అయితే, ఈ సంఖ్య ఎందుకు ఇలా పెరిగిపోతూ వస్తుంది ? వీళ్ళు ఏమైనా చొరబాటుదారులా, వారి మీద ట్రాకింగ్ లేకుండా ఉండటానికి ? కాదు కదా. వీరు ఎయిర్ పోర్ట్ లు లో నుంచే వస్తారు. ఎంత మంది వచ్చారు, వారు ఏ రాష్ట్రం వారు అనేది, కచ్చితమైన సమాచారం కేంద్రం వద్ద ఉంటుంది. కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అడిగితే, పాస్ పోర్ట్ నెంబర్లు, అడ్డ్రెస్లతో సహా ఇస్తారు. ఇచ్చాం అని కూడా కేంద్రం చెప్తుంది. మరి, ఇంకా ఎందుకు ఈ కన్ఫ్యూషన్ ? ప్రతిపక్షాలు కాని, ప్రజలు కాని, ఇదే విషయం పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఎందుకుంటే, వీరి వల్లే కరోనా వ్యాప్తి చెందేది.

ఈ రోజు కూడా డీజీపీ మాట్లాడుతూ, ఇంకా కొంత మంది విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రేస్ చెయ్యలేదు అని, వారు వెంటనే మా ముందుకు రావాలి అంటున్నారు. ఇంత కన్ఫ్యూషన్ మధ్యన, ప్రభుత్వం ఈ విషయం పై స్పందించింది. మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, ఈ విషయం పై క్లారిటీ ఇచ్చినా, అది సంతృప్తిగా లేదు అని చెప్పాలి. మంత్రిగారు మాట్లాడుతూ, మొదటి విడతలో చేసిన సర్వేలో, 12 వేలు వచ్చారని, తరువాత, లాక్ డౌన్ ప్రకటించటంతో, విమానాలు ఆగిపోవటంతో, అందరూ ఒకేసారి విదేశాల నుంచి రావటంతో, రెండో సారి వాలంటీర్లు చేసిన సర్వేలో ఆ సంఖ్య పెరిగింది అని చెప్పారు. అయితే, మంత్రి కాని, ప్రభుత్వం కాని, వాలంటీర్ల సర్వే పై కాకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, ఇమిగ్రేషన్ నుంచి, కచ్చితమైన సమాచారం వస్తుంది కదా ? మరి ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు మాట్లాడటం లేదు, అనేది మాత్రం అర్ధం కావటం లేదు. కేవలం వాలంటీర్ల సర్వే ప్రతాపదికిన, విదేశాల నుంచి వచ్చే వారిని ట్రేస్ చేస్తున్నారు.

విశాఖపట్నంలో, 70 వేల కోట్లతో, వచ్చే డేటా సెంటర్ పై ఆదానీ వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో, భారీ ప్రాజెక్ట్ నుంచి కూడా అదనీ వైదొలిగింది. శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలంలో నిర్మించతలపెట్టిన భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనుల నుంచి కూడా అదానీ తప్పుకున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం, టెండర్లు రద్దు చేసుకుంది. 2300 ఎకరాల్లో భావనపాడు పోర్టు నిర్మాణానికి అదానీ కంపెనీ, సెజ్ లిమిటెడ్ గతంలో టెండర్లు దక్కించుకున్నాయి. షేర్ల పై 2018 మార్చి 27న లెటర్ ఆఫ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాయి. పీపీపీ ద్వారా 33 ఏళ్లు కలిసి పనిచేసేందుకు ఈ రెండూ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం, అవసరమైన భూ సేకరణ చేపట్టాలని గత ప్రభుత్వం కలెక్టర్‌కు ఆదేశించింది. ఒప్పందం ప్రకారం, మర్రిపాడు, భావనపాడు, దేవునళ్తాడ గ్రామాల పరిధిలోని భూ సేకరణకు చర్యలు చేపట్టారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన 2300 ఎకరాల భూమికి రూ.1202 కోట్లు అవసరమని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

అయితే ప్రభుత్వం మారటంతో, కాకినాడ డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ గత ఏడాది సెప్టెంబర్‌ 27న తాము రూ.500 కోట్లు మాత్రమే భూములకు చెల్లించగలమని, మిగిలిన రూ.702 కోట్లు తము సాధ్యం కాదని ప్రకటించింది. అయితే దీనికి అదానీ కంపెనీ ఏకీభవించలేదు. తాము అగ్రిమెంట్ రద్దు చేసుకుంటామని, ఇప్పటి వరకు చెల్లించిన ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫీజు, బ్యాంక్ గ్యారెంటీ తిరిగి చెల్లించాలని కోరింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఈవో పోర్టు ట్రస్ట్ ఈ విషయాన్ని పరిశీలించి అదానీ కంపెనీ టెండర్ల రద్దుకే మెగ్గుచూపింది. ఈ మేరకు ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తూ, జిఒ నంబరు 17ని విడుదల చేసింది. పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి అదానీ పోర్ట్సు తప్పుకోవడంతో కొత్త సంస్థకు అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచనకు, ఇప్పుడు మార్గం సుగుమం అయ్యింది.

విశాఖలో కరోనా బాధితుల సంఖ్య 4కు పెరిగింది. ఇప్పటికే కరోనా వచ్చిన వ్యక్తి బంధువుకే తాజాగా వైరస్‌ సోకినట్లు తేల్చారు. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారినిపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు 112 అనుమానితులకు పరీక్షలు చేయగా 4 గురికి పాజిటివ్.. 96 మందికి నెగటివ్ వచ్చింది. మరో 12 మంది ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. విమ్స్ ను కోవిడ్ -19ఆస్పత్రిగా మార్చి తూర్పుగోదావరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చిన పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. పెద్ద వాల్తేరులోని ఛాతి ఆసుపత్రి , గీతం వైద్య కళాశాల ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రులుగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే 3 వేల 500 క్వారంటైన్ పడకలు సిద్ధం చేశారు. వేరే రాష్ట్రాలనుంచి రాష్ట్ర వాసులు వస్తే నిర్బంధ కేంద్రాన్ని వేపగుంటలో సిద్ధం చేశారు.

విశాఖకు 2 వేల 795 మంది విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. జీవీఎంసీ పరిధిలో 2 వేల 224 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 571 మంది ఉన్నట్లు గుర్తించారు. సీతమ్మధార, అల్లిపురం, గాజువాక, అనకాపల్లి గ్రామీణ పరిధిలో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. 97 బృందాలు నిరంతరం పనిచేసి... అనుమానితులను పరీక్షలకు తరలించే పని చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులపై ప్రత్యేక నిఘా పెట్టారు. 21 మందితో జిల్లా కమిటీ వివిధ చర్యలు తీసుకుంటోంది. విశాఖలోని కరోనా కేసుల పరీక్షలకోసం నిర్దేశించిన ఛాతీ ఆసుపత్రిలో సౌకర్యాల లేమిపై ఒక వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ వీడియోపై స్పందించిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌... లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు.

సీతమ్మధార, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లిని హైరిస్క్ ప్రాంతాలుగా ప్రకటించినందున... విశాఖలో కరోనా పరీక్షా కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. విశాఖలో ఐసోలేషన్ వార్డులను మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య సిబ్బందిని మరింత పెంచాలన్నారు. కనీసం ఒక వైద్య బృందాన్ని ప్రతి వార్డులోనూ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్తు బిల్లులు, మున్సిపల్​ పన్నులు, నీటి బిల్లులు రద్దు చేయాలని సీఎంని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోరింది. ఈమేరకు లేఖ రాసింది.

కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తులు పూర్తిగా అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల కదలికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఇంటింటి సర్వే ద్వారా కరోనా ఇతరులకు వ్యాపించకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకునట్టు ప్రభుత్వం చెప్పిందని అన్నారు. కరోనా వ్యాప్తికి సంబంధించి భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శుక్రవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్న సమావేశంలో రాష్ట్రపతి కోవింద్ ఎంపిక చేసిన రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడుతూ సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా గవర్నర్లు వ్యవహరించాలని పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా దేశం యావత్ తగిన సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని, ఇదే సమయంలో ఒంటరిగా సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు తమకున్న అనుభవంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రార్ధనల పేరిట సమావేశాల నిర్వహణకు దూరంగా ఉండేందుక సమతపెద్దలు ప్రజల్లో అవగాహన కలిపించాలన్నారు. వ్యాధి నియంత్రణకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్ ట్రేస్, ఐసోలేట్ అండ్ టీ అనే మంత్రం అన్ని రాష్ట్రాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరా, విద్యార్థులకు ఆహార లభ్యత, వలస కూలీలకు ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వివిధ సంస్థలు, ప్రైవేటు రంగం సేవలను విరివిగా వినియోగించుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ తదుపరి రాజ్ భవన్ నుంచి జారీ చేసిన ప్రకటనలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర స్వచ్చంధ సంస్థల పాత్రను సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ పేర్కొన్నారు. యాచకులు, నిరాశ్రయులకు ఆహారం, ఆశ్రయం కల్పించడంలో ప్రభుత్వం తగిన సహాయం అందించాలన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్ట్ నెంట్ గవర్నర్లతో అనుభవాలను పంచుకోవడం ఉపయోగంగా ఉందన్నారు. ఈ తరహా సమావేశాల వలన అందరి అనుభవాలను క్రోడీకరించి మెరుగైన సాయం అందించేందుకు సహకరిస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read