రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులు, అలాగే ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా చికిత్సకు వినియోగించుకునే హక్కులు వచ్చేలా, ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విపత్తుగా కరోనాను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య సంస్థలను కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ఆదేశాలు వెలువరించింది. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లోని గదులు, వెంటిలేటర్లు, ప్రయోగశాలలు, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలు, డాక్టర్లు, నర్సులు, మెడికల్, నాన్ మెడికల్ సిబ్బంది సేవల వినియోగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్య నిపుణుల సేవలను అవసరమైన చోట తక్షణం వినియోగించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో లాక్ డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని మంత్రి కురసాల కన్నబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కరోనా నివారణకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. వైద్య పరమైన అంశాల్లో మరిని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులను సైతం వినియోగిస్తామని అన్నారు. ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచుతున్నామని... క్వారంటైన్ కేంద్రాల్లో పర్యవేక్షక ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో 5 వేల బెడ్స్ సామర్థ్యంతో ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలోనూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

క్షేత్రస్థాయిలోని బాధ్యతలను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు చెప్పారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపుతామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. జిల్లా జేసీలు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. విక్రేతలు బోర్డుల్లో ధరలు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి పింఛను మొత్తాన్ని డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. వృద్ధులు, అనాథ, శిశు ఆలయాల్లో ఉచిత బియ్యం, కందిపప్పు అందిస్తామని అన్నారు.

గుంటూరు జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన వారి పై అధికార వర్గాలు ఆరా తీశాయి. మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో 30 మందిని గుర్తించారు. వారందరినీ ఐదు అంబులెన్స్ ల్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు, ఓ వ్యక్తి ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో 23 మందిని కలిసినట్టు కూడా అధికారులు గుర్తించారు. వారిని కూడా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో నమోదైన 4 కరోనా కేసుల దృష్ట్యా... గుంటూరు జోన్​ను హాట్​ స్పాట్​గా ప్రకటిస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణరావు తెలిపారు.

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. వైరస్ వ్యాప్తిని నియత్రించేందుకు అధికార యంత్రాంగం నిరంతరాయంగా కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 4 కేసులు నమోదు కావటం దురదృష్టకరమన్న మంత్రి.. జిల్లా వ్యాప్తంగా 88 ఆస్పత్రులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆ ఆస్పత్రుల్లో 9,352 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రేషన్ సరఫరా 15 రోజులపాటు సాగుతుందని .. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిత్యావసరాల ధరలు పెంచితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు, ఈ విపత్తులో ప్రజలకు సహాయ, సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేయాలని కోరింది. చెక్కు రూపంలో విరాళం ఇవ్వాలనుకునేవారు 'చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్ ఫండ్‌, ఆంధ్రప్రదేశ్‌' పేరున పంపాలని సూచించింది. ఆన్‌లైన్‌లో పంపదలచినవారు ఎస్​బీఐ అకౌంట్‌ నంబర్‌ 38588079208, వెలగపూడి సెక్రటేరియట్ బ్రాంచి, IFSC కోడ్ SBIN0018884 కు పంపవచ్చని తెలిపింది. ఆంధ్రా బ్యాంకు అకౌంట్‌ నెంబరు... 110310100029039, వెలగపూడి సెక్రటేరియట్ బ్రాంచి, IFSC కోడ్ ANDB0003079 కు పంపవచ్చని పేర్కొంది. వెబ్​సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా వివరాలు పంపదలచినవారు apcmrf.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.

రాష్ట్రంలో మరింత పటిష్టంగా లాక్​డౌన్ అమలు చేయాలని జగన్​ అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే వారిని జైలుకు పంపాలని అధికారులకు నిర్దేశించారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని,ఫిర్యాదు చేయాల్సిన కాల్ సెంటర్ నంబర్ కూడా పట్టికలో పొందుపరచాలని చెప్పారు. రేషన్​ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా నిత్యావసరాలు కొనుగోలు సమయాన్ని కూడా మార్చారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి 11 వరకు, మిగతా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనుగోలుకు అనుమతినిచ్చారు. గ్రామ వాలంటీర్లు సర్వే పటిష్టంగా ఉండాలని... ప్రతి కుటుంబం వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సీఎం సూచించారు. అర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న ఆయన, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, అదనపు సిబ్బందిని నియమించాలని తెలిపారు.

వ్యవసాయం, ఆక్వా రంగాల్లో సామాజిక దూరం పాటిస్తూ.. కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. రైతులు, ఆక్వారైతులకు కనీస గిట్టుబాటు ధర అందేలా చూడాలని.. జగన్​ అధికారులను ఆదేశించారు. వలస కూలీలు, కార్మికులకు షెల్టర్లలో మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలన్నారు. అత్యవసర సర్వీసులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. జ్వరం, పొడిదగ్గుతో ఎవరైనా బాధపడుతుంటే 104, 1902 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలపాలని సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌ తెలిపారు. దీనిపై గ్రామాలు, పట్టణాల్లోని వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. వ్యాయామం చేయడం సహా పౌష్టికాహారం తీసుకోవాలని హితవు పలికారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.

రాష్ట్రంలో నిత్యావసరాల వస్తువుల కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం కుదించింది. ఉదయం ఆరు గంటల నుంచి 11 లోపు మాత్రమే ఉపశమనం కల్పించింది. ఆ తర్వాత ఎవరూ బయట తిరగొద్దని మంత్రి ఆళ్ల నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యవసరాలు, కూరగాయలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి... ధరలు తెలిపే బోర్డులను దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలని యజమానులకు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా 1902 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని... అందుకే మళ్లీ రీ సర్వే చేసి అనుమానం ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి వెల్లడించారు.

చీరాల నవాబ్ పేటకు చెందిన దంపతుల కరోనా పాజిటివ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి కాంటాక్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. వారితో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో జిల్లాకు చెందినవారు సుమారు 280 మంది ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో మరో 200 మంది, చీరాల రైల్వేస్టేషన్‌లో 80 మంది దిగినట్టు తెలుస్తోంది. వీరి గుర్తింపులో జాప్యం జరిగితే భారీ మూల్యం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో జిల్లాలో 5 వేల మందికి క్వారంటైన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. చీరాలలో ఇద్దరికి, ఒంగోలులో ఒక కేసు నిర్ధారణ కావడంతో మొత్తం జిల్లాలో మూడు కొవిడ్-19 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.

కేసులు నమోదైన ప్రాంతం నుంచి 300 మీటర్లు హై సెన్సిటివ్ జోన్​గా, మూడు కిలోమీట్లర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. చీరాల, వేటపాలెం మండల ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కొవిడ్ - 19 కేసులపై వైద్యారోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ 16 శాంపిల్స్​ను పరీక్షించగా నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. ఈ రోజు విదేశాల నుంచి ఎవరూ రాలేదని పేర్కొంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 29,367 అని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,172 మందిని హోం క్వారంటైన్​లో ఉంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 195 మంది ఆస్పత్రుల్లో ఉన్నారని తెలిపింది.

ఇప్పటి వరకు 433 శాంపిల్స్​ల్లో 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేసింది. రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ కాగా.. అతను హైదరాబాద్​లోని గాంధీ మెడికల్​ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా నిర్ధారణ కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వం... తాజాగా అనంతపురంలో మరో కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. కరోనాకు సంబంధించి శనివారం 537 ఫోన్ కాల్స్ వచ్చాయని.. వాటిపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బులెటిన్​లో ప్రస్తావించింది.

Advertisements

Latest Articles

Most Read