ప్రధాని నరేంద్ర మోదీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో మోదీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం మోదీ నేరుగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రజాధన్యవాద సభలో పాల్గొంటారు. సభ తర్వాత ప్రధాని మోదీ తిరుమలకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు జగన్, నరసింహన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇది ఇలా ఉంటె, ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విమానంలో నుంచి మోడీ దిగిన తర్వాత ముందుగా గవర్నర్ నరసింహన్ ఓ పువ్వు ఉన్న బోకే ఇచ్చి మోదీకి స్వాగతం చెప్పారు. గవర్నర్ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఓ చిన్న పువ్వు ఉన్న బోకే ఇచ్చి వెల్కం చెప్పారు.

renigunta 09062019 1

ఈ సందర్భంగా ప్రధాని కాళ్లకు నమస్కారం పెట్టడానికి జగన్ ప్రయత్నించారు. అయితే, జగన్ చేతులు పట్టుకుని ఉన్న మోదీ వద్దని వారించారు. వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగానే జగన్ మరోసారి మోదీ కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా మోదీ.. జగన్‌ను వారించారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి .. మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన వైసీపీ నాయకులను ప్రధానికి పరిచయం చేశారు. అయితే గతంలో చంద్రబాబు గౌరవంగా కొంచెం వంగితేనే గోల గోల చేసిన వైసిపీ, ఇప్పుడు ఏకంగా జగన్ మోడీ కాళ్ళ మొక్కుతుంటే, ఏమంటారో మరి. ఇది ఇలా ఉంటే, తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ప్రజాధన్యవాద సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఓట్లు వేసినా, వేయకపోయినా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి ప్రధాని అయ్యాక తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ‘మా వరకు ఎన్నికల అధ్యాయం ముగిసిపోయింది.

renigunta 09062019 1

130 కోట్ల మందికి సేవ చేసే అధ్యాయం ప్రారంభమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ రెడ్డికి శుభాకాంక్షలు. జగన్ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నా. ఏపీ అభివృద్ధికి, ప్రజలకు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇస్తున్నా.’ అని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో అంశాల్లో ముందుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. వ్యవసాయం నుంచి విజ్ఞానం వరకు, ఇన్నొవేషన్ నుంచి స్టార్టప్స్ వరకు ఏపీ.. కొత్త మార్గంలో పయనిస్తుందని మోదీ అన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే నవభారతం నిర్మాణం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మే-30న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి డీఎంకే అధినేత స్టాలిన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, స్పీకర్ పోచారం హాజరయ్యారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలంగాణకు అవమానం జరిగిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని మూడో వరుసలో కూర్చోబెట్టి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రోటోకాల్ అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. "అసలు స్పీకర్‌కు ఆహ్వానం ఉందా..? పోచారంకు స్పీకర్‌గా కొనసాగే హక్కు లేదు..? వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి. ప్రతిపక్షనేత స్టాలిన్‌కు ఉన్న గౌరవం స్పీకర్‌కు లేదా..?" అని జీవన్ రెడ్డి కన్నెర్రజేశారు.

jagan 09062019

అంతటితో ఆగని ఆయన టీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బరి తెగించాడన్నారు. స్పీకర్‌కి శాసన వ్యవస్థ అంటే ఏంటో తెలియదని వ్యాఖ్యానించారు. ఒక కుటుంబం కోసమే తెలంగాణ సాధించినట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా ఎమ్మెల్యేల విలీనంపై నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికారు. పోచారానికి స్పీకర్‌గా కొనసాగే హక్కు లేదని ధ్వజమెత్తారు. ఎంఐఎం మిత్ర పక్షమేనని ప్రతిపక్షం కాదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. టీఆరెస్- ఎంఐఎం పార్టీలది క్విడ్ ప్రోకో అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ, టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

కడప జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డులేకుండా పోతోంది. అడ్డు వచ్చినవారిని చంపేందుకు కూడా వెనకడటం లేదు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మాఫియా ముఠా వీఆర్వో, వీఆర్ఏను ట్రాక్టర్‌తో ఢీకొట్టించారు. కడప జిల్లాలోని సిద్ధవటం మండలం ఎస్. రాజంపేటలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రెవెన్యూ సిబ్బంది గాయపడ్డారు. వీఆర్వో ఆరిఫ్, వీర్‌ఏ వెంకటపతికి గాయాలు కావడంతో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెన్నానది నుంచి ఇసుక మాఫియా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. ఇసుక ట్రాక్టర్‌తో వారిని డ్రైవర్‌ ఢీకొట్టాడు. 

isuka 09062019 1

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ట్రాక్టర్‌ బోల్తా పడటంతో డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. బైక్ నుంచి ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించిన వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అనంతరం ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్‌ను వదిలేసి డ్రైవర్, మరో వ్యక్తి పరారయ్యారు. గాయపడిన రెవెన్యూ సిబ్బందిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భూమా కుటుంబం ప్రజా సేవకే అంకితమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. శనివారం చాగలమర్రి గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌కే ఓటు వేయాలన్న సంకల్పంతో ప్రజలు పట్టం కట్టారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీకి పెద్దఎత్తున అత్యధిక స్థానాలు వస్తాయని ఎవరూ ఊహించలేదని అన్నారు. ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటామని అన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని అన్నారు. దివంగత భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఆశయాలతో ప్రజలకు సేవ చేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడం తథ్యమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కొనసాగిన వైసీపీ హవా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండదని అన్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాము అండగా ఉండి ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తామని అన్నారు.

akhila priya 09062019 1

తాము ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా నియో జకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఓడిపోయినా ప్రజలకు ఏ కష్టం రాకుండా సేవ చేస్తానని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం అహోబిలం పుణ్యక్షేత్రంలో చాగలమర్రికి చెందిన టీడీపీ నాయకులు గంగుల ప్రతాప్‌ ఏర్పాటు చేసిన శుభకార్యక్రమానికి మాజీ మంత్రి అఖిలప్రియ, ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ బీవీ రామిరెడ్డి, పుట్టాలమ్మ చైర్మన్‌ అంబటి మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు రమేష్‌ దంపతులు షష్టిపూర్తి చేసుకున్నందుకు మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

Advertisements

Latest Articles

Most Read