ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో 25 మంది మంత్రులతో ఈరోజు ఏపీ కేబినెట్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ధర్మాన కృష్ణ ప్రసాద్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, , చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీరికి కొత్తగా ఇన్నోవా కార్లను కేటాయించింది. ఒకేసారి ఏడుగురు సభ్యులు ప్రయాణించగల టయోటా ఇన్నోవా కార్ల ప్రారంభ ధర మార్కెట్ లో రూ.14.93 లక్షల నుంచి రూ.23.24 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో మార్కెట్ లో లభ్యమవుతోంది.

innova 08062019 1

ఈ 25 మంది మంత్రులకు జగన్ ఏయే బాధ్యతలు అప్పగించబోతున్నారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు సాయంత్రం నాటికి సీఎం జగన్ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెులిపాయి. మొత్తం 25 మంది మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రులుగా వరుస క్రమంలో మొదట శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ప్రమాణం చేశారు. ఆతర్వాత మిగిలిన మంత్రులు ప్రమాణం చేసి జగన్‌, గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌, నెల్లూరు జిల్లాకు చెందిన గౌతంరెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం రోజే జనసేన అధినేతకు ఊహించని షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. టీడీపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రావెల లేఖలో పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి రావెల ఓడిపోయారు.ఈ స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు...బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

raela 08062019

ఆయన బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన రావెల 2014 ఎన్నికల్లో ప్రతిప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొంది, మంత్రివర్గంలో చోటు దక్కించుకుని, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే పార్టీలో అంతర్గత విబేధాలు, వివాదాలతో పాటు కేబినెట్‌ విస్తరణ సందర్భంగా ఆయన మంత్రి పదవి కోల్పోయారు. ఆ తర్వాత నుంచి టీడీపీకి దూరంగా ఉన్న ఆయన...ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సీటుతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

ఎప్పుడు వార్తల్లో ఉండే వైసీపీ నేత రోజాకు దక్కే పదవి ఏంటి? సీఎం జగన్ ఆలోచన ఏంటి? జగన్ ఇచ్చిన ఆఫర్‌ను రోజా కాదన్నారా. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి కేబినెట్ బెర్తు ఖాయమైంది. అదే సామాజిక వర్గం... అదే జిల్లాకు చెందిన రోజాకు అవకాశం లేనట్లేనా? రోజాకు జగన్ ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండగలరా. నిజానికి కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్న టైంలో సీఎం జగన్ తన పార్టీ కీలక నేత రోజాకు ఒక ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో రోజా జుగుబ్సాకరమైన ప్రవర్తనకు ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సభలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటంతో రోజాని సస్పండ్ చేసారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అందువల్ల అదే చంద్రబాబు ద్వారా అధ్యక్షా అని పిలిపించుకునేందుకు రోజాకు స్వీకర్ పదవి ఇస్తున్నారనే చర్చ సాగింది. చంద్రబాబుని మరింత బాధపడాలి అంటే, రోజాకు స్పీకర్ పదవి ఇవ్వాలని భావించి ఆ విషయమై ఆమెతో చర్చించారు. అయితే రోజా మాత్రం, తనకు స్పీకర్ పదవి వద్దని, మంత్రి పదవి కావాలని, జగన్ కు చెప్పి వచ్చినట్టు సమాచారం,

roja 08062019

చిత్తూరు జిల్లా నుంచీ సీనియర్ ఎమ్మెల్యే... తొలి నుంచీ వైసీపీకి ఆర్థికంగా... రాజకీయంగా అండగా నిలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవితో పాటూ... కీలక శాఖ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. అదే చిత్తూరు జిల్లాకు... అదే సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి ఇవ్వటానికి ఈ సమీకరణలు అడ్డుగా మారాయి. దీనికి తోడు జిల్లాలో తన ప్రాధాన్యం ఉండాలని పెద్దిరెడ్డి కోరుకుంటున్నారు. జగన్ సైతం పెద్దిరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో రోజాకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. దీంతో... ఆమెకు గుర్తింపు ఇస్తూ నే కొత్త ఫార్ములా తెర మీదకు తెచ్చారు. అదే సమయంలో చిత్తూరు నుంచీ ఎస్సీ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రోజా విషయంలో మాత్రం జగన్ సానుకూలంగా ఉన్నారు.

roja 08062019

జగన్ రాజీ ఫార్ములా ఏంటి? : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి... ఆయన కొడుకు మిధున్ రెడ్డికి లోకసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా అవకావం ఇవ్వడం ద్వారా వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చిందీ స్పష్టం చేసారు. ఇదే సమయంలో మంత్రి పదవి కావాలని ఇంతవరకూ తాను అడగలేదనీ... పార్టీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో జగన్‌కి తెలుసని రోజా అన్నారు. జగన్ సైతం రోజాకు కీలక పదవి అప్పగించే అవకాశం ఉందని తాజా సమాచారం. ఇందులో భాగంగానే.. ఈ రోజు రోజాకు ఇవ్వబోయే పదవి గురించి జగన్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు.

అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్, విజయసాయి రెడ్డి, ప్రతి శుక్రవారం కోర్ట్ విచారణకు వెళ్ళాల్సిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు కోర్ట్ సెలవులు కావటంతో, విచారణ జరగలేదు. అయితే ఇప్పుడు కోర్ట్ కి సెలవలు అయిపోవటంతో, ఇకనుంచి మళ్ళీ ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. అయితే, ఎన్నికల్లో గెలుపొంది ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, విధి నిర్వహణలో నిమగ్నమైన నేపథ్యంలో కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు నేర న్యాయ స్మృతి (సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 317కింద ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదేకేసులో రెండో నిందితుడిగా ఉన్న వి.విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, విజయవాడ/తాడేపల్లిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం ఉన్నందున కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు.

cbi 08062019

వీరిద్దరి పిటిషన్లను న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు అనుమతించారు. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు. ఆ ఆరు చార్జిషీట్లనూ కలిపి విచారించండి... సీబీఐ 11చార్జిషీట్లు దాఖలు చేసిందని, ఇందులో మొదటి 5 చార్జిషీట్లలో దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్లను కలిపి విచారించేందుకు ఈ కోర్టు అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసిందని జగన్‌ తరఫు న్యాయవాది నివేదించారు. అన్ని చార్జిషీట్లలో పేర్కొన్న ఆరోపణలు ఒకేవిధంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో మిగిలిన 6 చార్జిషీట్లకు సంబంధించిన డిశ్చార్జ్‌ పిటిషన్లను కలిపి విచారించాలని తాము దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. దీనిపై పూర్తిగా విచారించాక నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, ఈడీ దాఖలుచేసిన కేసులో ఇండియా సిమెంట్స్‌ అధినేత, బీసీసీఐ మాజీ చైర్మన్‌ శ్రీనివాసన్‌తోపాటు ఇతర నిందితులు ఈడీ కోర్టుకు హాజరయ్యారు.

Advertisements

Latest Articles

Most Read