మన అమరావతి - మన రాజధాని అంటూ, అమరావతి అనే మాటకు ఎమోషనల్ గా ఆంధ్రుడు కనెక్ట్ అయిపోయాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీ అవుతుందని కలలు కన్నాడు. పనులు కూడా అలాగే సాగాయి. ఎటుచూసినా యంత్రధ్వనులు.. మహాసౌధాలను నిలబెట్టడానికి చీమలబారుల్లా కదులుతున్న శ్రామికజీవులు.. నేలమాళిగల్లోంచి కలల రాజధానిని ఆవిష్కరిస్తున్న ఇంజనీరింగ్‌ పనితనం.. పరుగులు తీస్తున్న ప్రణాళికలు.. ఇలా రాజధాని అమరావతిలో సందడి చేసిన జాడలు ఇప్పుడు కనిపించడం లేదు. రాజధాని విషయంలో కొత్త ప్రభుత్వం వైఖరి ప్రభావం అడుగడుగునా కనిపిస్తోంది. పనులు దాదాపుగా నిలిచిపోయాయి. కార్మికులు స్వస్థలాలకు పోతున్నారు. తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయం కళతప్పింది. గ్రీవెన్సులు, రాజధాని గ్రామాలలో కల్పించాల్సిన వసతులపై నిత్యం సమీక్షలుండేవి. ఇప్పుడా కోలాహలమే కనిపించడం లేదు.

amaravati 03062019

రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ నిర్మాణాలు నిధుల కొరత కారణంగా కొంతకాలం నిలిపివేసే పరిస్థితి వచ్చిందని అధికార వర్గాలు అంటున్నాయి. అమరావతిలో వివిధ నిర్మాణాల కొనసాగింపు పై జగన్ సమీక్ష తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కొన్ని పనులను కొంతకాలం నిలిపివేసేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నారు. రాజధాని అమరావతిని ఐదు ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక రూపొందించడం తెలిసిందే. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, రహదారులు, ఐకానిక్ వంతెన డిజైన్లు ఇప్పటికే ఖరారు చేయగా, అనేక పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

amaravati 03062019

రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటి వరకూ 1500 కోట్ల రూపాయలే కేటాయించగా, మరో 1000 కోట్లు మంజారు చేసినా, ఇంకా విడుదల కాలేదు. రాజధాని పరిధిలో 39,875 కోట్ల రూపాయల మేర పనులు జరుగుతుండగా, మరో 4,214 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయి. మరో 7600 కోట్ల రూపాయల పనులు ప్రతిపాదన దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం తదితర నిర్మాణాల పనులు కొద్ది రోజులు నిలిపివేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే వివిధ సందర్భాల్లో జగన్, అమరావతి పై చూపించిన అనాసక్తి ఇప్పుడు తెర మీదకు వస్తుంది. చూద్దాం చంద్రబాబు లేని అమరావతి, ఏమవుతుందో..

కేంద్ర మంత్రివర్గంలో తమకు కోరిన స్థానాలు ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్న బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ అందుకు తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించి అందులో తమ పార్టీకి చెందిన 8 మంది నేతలకు మంత్రి పదవులను కట్టబెట్టారు. ఇదే ప్రభుత్వంలో భాగంగా ఉన్న భాజపాకు మాత్రం ఒక్క స్థానాన్ని కేటాయించారు. ఈ పదవిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని భాజపా నేతలు తెలిపారు. ఇటీవల భాజపా నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. బిహార్‌లో చెరో 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. భాజపా 17, జేడీయూ 16 స్థానాల్లో గెలుపొందాయి. కొత్తగా ఏర్పడిన కేంద్ర కేబినెట్‌లో తమకు ఒక్క పదవినే కేటాయించడంపై నీతీశ్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తంచేస్తూ మంత్రివర్గంలో చేరేందుకు నిరాకరించారు.

bjp 03062019

దీనికి ప్రతీకారంగానే రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించి తమ పార్టీ నేతలకు అధిక స్థానాలను కేటాయించారని తెలుస్తోంది. బహిరంగంగా విమర్శించనప్పటికీ పలువురు భాజపా నేతలు సైతం ప్రతీకారంలో భాగంగానే మంత్రివర్గ విస్తరణ చేపట్టారని పేర్కొంటున్నారు. అయితే, తాజా మంత్రివర్గ విస్తరణపై నీతీశ్‌ కుమార్‌ స్పందిస్తూ.. తమకు ఎన్డీయేతో ఎలాంటి విభేదాలూ లేవని మీడియాకు తెలిపారు. ముందుగా అనుకున్నట్లుగానే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను తమ పార్టీ నేతలకు కేటాయించామని చెప్పారు. బీహార్‌లో పోటీ చేసిన 17 లోక్‌సభ స్థానాల్లో 16 స్థానాలు కైవసం చేసుకుని తమ పార్టీ సత్తా చాటితే.. కేంద్రం మాత్రం సరైన ప్రాధాన్యం కల్పించలేదని నితీష్ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది.

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఏపీ సచివాలయ భవనాలు, ఇతర హెచ్‌వోడీ భవనాలపై చర్చించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ఉపయోగించని భవనాలను తెలంగాణకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు కేసీఆర్ విన్నవించారు. గతంలో చేసిన కేబినెట్ తీర్మానం, ఏపీకి ఇచ్చే ప్రతిపాదనల గురించి కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. ఏపీలో ప్రభుత్వం మారడం, జగన్ సీఎం కావడంతో మరోమారు ఈ అంశం తెరపెకొచ్చింది. ఏపీ ప్రభుత్వం వినియోగించని భవనాలను వెనక్కి ఇవ్వాలని కేసీఆర్ గవర్నర్‌ను కోరారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలను ఉమ్మడిగా వినియోగించుకోవాలనే నిబంధన ఉంది.

kcr 02062019

అయితే.. అమరావతి నుంచే పూర్తి స్థాయి పరిపాలన సాగుతుండటంతో హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించే అంశం మరోసారి చర్చకొచ్చింది. ఏపీ విభజన అనంతరం సచివాలయ భవనాన్ని ఏపీ, తెలంగాణకు పంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ఏ,బీ,సీ,డీ బ్లాకులను కేంద్రం కేటాయించింది. ఏపీకి హెచ్, నార్త్ హెచ్,జె,కె,ఎల్ బ్లాకులను కేటాయించారు. అయితే.. ఏపీ పాలన అమరావతి నుంచే జరుగుతుండటంతో సచివాలయంలో అధికారులు, ఉద్యోగులు వెలగపూడికి తరలివెళ్లారు. కొంతమంది సిబ్బంది మాత్రమే హైదరాబాద్‌లోని ఏపీ సెక్రటేరియట్‌కు పరిమితయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నవ్యాంధ్రకు కేటాయించిన భవనాలన్నిటినీ తిరిగి తెలంగాణకు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవం కూడా అయిన ఆదివారం రాత్రి గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ అధీనంలో ఉన్న భవనాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని తిరిగి తమకు అప్పగించాలంటూ తెలంగాణ కేబినెట్‌ చేసిన తీర్మానంపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. నవ్యాంధ్ర పాలనకు వీలుగా సచివాలయంలోని సగం బ్లాకులతోపాటు ప్రభుత్వ భవనాలను చెరి సగం కేటాయిస్తూ అప్పట్లో గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు.

narasimhan 03062019

అయితే, వాటిలో ఎల్‌ బ్లాకులోని కొన్ని గదులను మినహా మిగిలిన వాటిని ఏపీ ప్రభుత్వం ఉపయోగించడం లేదు. దాంతో, మీరు ఉపయోగించుకునే వాటిని ఉంచుకుని, మిగిలిన వాటిని తమకు ఇచ్చేయాలని ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. భవనాల అప్పగింతపై గతంలో కూడా తెలంగాణ మంత్రివర్గం తీర్మానం చేసి, గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే, ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భవనాల అప్పగింతకు సానుకూలత వ్యక్తమైంది. శనివారం రాజ్‌భవన్లో ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు ముందు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్‌ సమావేశమైన విషయం తెలిసిందే. విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ తర్వాత 15 నిమిషాలపాటు ఇరువురు సీఎంలు ముఖాముఖి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా భవనాల అప్పగింతకు ఏపీ సీఎం జగన్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

narasimhan 03062019

‘ఏపీ అధీనంలో ఉన్న భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని తిరిగి తెలంగాణకు అప్పగించండి’ అని తెలంగాణ మంత్రివర్గం ఆదివారం గవర్నర్‌ను కోరింది. ఈ మేరకు అందుబాటులో ఉన్న మంత్రులతో తీర్మానంపై సంతకం చేయించారు. అనంతరం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. తీర్మానం ప్రతిని అందజేశారు. సచివాలయంతోపాటు మరికొన్ని భవనాలు ఏపీ అధీనంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఖాళీగా ఉండడం వల్ల ఎలుకలు వైరింగ్‌ను కత్తిరించడం.. చెత్తాచెదారం పెరిగి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని నివేదించారు. అనంతరం గవర్నర్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ తీర్మానంపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. అయితే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వద్దకు, ఇది రాగా, ముందుగా ఉమ్మడి ఆస్తులు, కరంట్ బకాయులు విషయం తేలిస్తే కాని, ఈ భవనాలు ఇవ్వం అంటూ ఏపి ప్రభుత్వం తరుపున చెప్పారు. కాని, ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, జగన్, కేసిఆర్ విజ్ఞప్తి మేరకు తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవాక్కయ్యారు.

 

Advertisements

Latest Articles

Most Read