రాయలసీమ ఎత్తిపోతల పధకానికి సంబంధించి ఈ రోజు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు, రాయలసీమ ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయా లేదా, అంటూ అక్కడ తనిఖీలు చేసి, నివేదిక సమర్పించాలి అంటూ, కృష్ణ రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు కు, ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు, పలు సార్లు కృష్ణ రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు అక్కడ తనిఖీలు చేయటానికి ప్రయత్నం చేసినప్పటికీ, ఏపి ప్రభుత్వం సహకరించలేదు. ఏపి ప్రభుత్వం సహకారం లేకుండానే, మీరంతట మీరే, అక్కడకు వెళ్లి తనిఖీలు చేయలి అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు, కేఆర్ఎంబి రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడ ఉన్న పరిస్థితి పై ఒక నివేదికను తయారు చేసింది. ఆ నివేదికలో చాలా స్పష్టంగా, అక్కడ పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు జరుగుతున్నాయని, చాలా వరకు పనులు కూడా పూర్తయ్యాయని నివేదించింది. గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా, పనులు ప్రారంభించి, కొనసాగించారని, పనులు కూడా ముగించారని, ఆ నివేదికలో చెప్పటం జరిగింది.

అయితే ఎన్జీటీ అనుమతి లేకుండా అక్కడ పనులు చేపడితే, కచ్చితంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు భావిస్తామని, అదే కనుక నివేదికలో నిజం అని తేలితే, ఏపి చీఫ్ సెక్రటరీని కూడా జైలుకు పంపించాల్సి ఉంటుంది అంటూ, గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో వ్యాఖ్యలు చేసింది. ఈ నేపధ్యంలో కేఆర్ఎంబీ ఇచ్చిన నివేదికను, ఈ రోజు ఎన్జీటీ పరిశీలించింది. అందులో ఉన్న అంశాలు పరిశీలించి, తమను గైడ్ చేయాల్సిందిగా ఇరు పక్షాలను కోరింది. అయితే పిటీషనర్ తరుపు లాయర్ మాత్రం, ఉల్లంఘనలు జరిగాయని, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, సీరియస్ గా ఆక్షన్ తీసుకోవాలని కోరారు. మీరు ఇప్పుడు వదిలేస్తే, ఎన్జీటీ ఆదేశాలను ఇతర రాష్ట్రాలు కూడా అలుసుగా తీసుకుంటాయని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు దిక్కరణ పై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు గైడ్ చేయాలని ఎన్జీటీ కోరింది. తదుపరి విచారణను వచ్చే నెల 8 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరి ఈ అంశంలో ఎవరు, ఎలా బుక్ అవుతారో చూడాల్సి ఉంది.



