ప్ర‌భుత్వంలో భాగ‌మైన ఉద్యోగుల‌పై న‌మ్మ‌కం లేకే వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ని న‌మ్ముకున్నారా అంటూ ఏపీ స‌ర్కారుపై హైకోర్టు మండిప‌డింది. వ‌లంటీర్ల వ్య‌వస్థపై దాఖ‌లైన పిటిష‌న్ల విచార‌ణ సంద‌ర్భంగ‌గా కోర్టు మ‌రోసారి వైసీపీ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. లబ్దిదారుల ఎంపిక బాధ్యతను వ‌లంటీర్ల‌కు ఎలా అప్పగిస్తారంటూ ప్ర‌శ్నించింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ప్ర‌భుత్వంలోనైనా లబ్దిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా? ఇప్పుడు ఎందుకు వ‌లంటీర్ల‌ను వినియోగిస్తున్నార‌ని కోర్టు సూటిగా నిల‌దీసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను స‌మాంత‌రంగా వాడుతున్నార‌నే అర్థంలో హైకోర్టు వ్యాఖ్య‌లతో స‌ర్కారు ఉలిక్కిప‌డింది. రాజకీయ కారణాలతో తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారని హైకోర్టును ఆశ్రయించిన గారపాడు గ్రామానికి చెందిన 26 మంది లబ్దిదారులు ఆశ్ర‌యించ‌గా దీనిపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ అంశంపై కోర్టుకు హాజరైన సెర్ప్‌ సిఈఓ ఏఎండీ ఇంతియాజ్ ని వ‌లంటీర్ల‌కు జవాబుదారీతనం  ఏముంటుందని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలకు కోర్టు వ్యతిరేకం కాద‌ని, వాటి అమలుకు ఎంచుకున్న విధానమే చట్టవిరుద్దమైనది అని కోర్టు వ్యాఖ్యానించింది. వ‌లంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారని, చట్టం అనుమతిస్తే వ‌లంటీర్ల సర్వీసును రెగ్యులరైజ్ చేసి శాశ్వత ఉద్యోగులుగా నియమించి సర్వీస్ రూల్స్ రూపొందించాల‌ని జ‌డ్జి పేర్కొన్నారు. న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఇంతియాజ్ ను ఆదేశించిన న్యాయమూర్తి కేసు విచారణ మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు.

ఏపీ స‌ర్కారుతో హ‌నీమూన్ టైమ్ ముగిసిపోయిందంటున్నాయి ఉద్యోగ సంఘాలు. మొన్న‌టివ‌ర‌కూ మా ప్ర‌భుత్వం, అనుకున్నా ఆడుకున్నా మేమంతా ఒక్క‌టేనంటూ గారాలు పోయినా ఉద్యోగసంఘ నాయ‌కులు బాగానే బాగుప‌డ్డారు. అయితే ఉద్యోగుల్లో స‌ర్కారు తీరుప‌ట్ల ఆగ్ర‌హం పెల్లుబుకుతోంది. స‌ర్కారుతో లాలూచీ కోసం ఎంత మేనేజ్ చేసినా, ఆగేలా లేరు ఉద్యోగులు. దీంతో స‌ర్కారు ఉద్యోగ‌సంఘాలైన కాక‌ర్ల వెంక‌ట‌రామిరెడ్డి, ఎన్జీవో సంఘం బండి శ్రీనివాస‌రావు త‌ప్పించి మిగిలిన ఉద్యోగ సంఘాల‌న్నీ క‌లిపి ఉద్య‌మ కార్యాచర‌ణ ప్ర‌క‌టించాయి. రాజ‌శేఖ‌ర్ రెడ్డి బిడ్డా, నీపై మోజు తీరిపోయిందంటున్నాయి. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల అమ‌లు కోసం ప్ర‌శ్నిస్తే ఇబ్బందుల పాలు జేస్తున్నార‌ని, అందుకే ఉద్యమంలోకి దిగుతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు. సీఎస్ జవహర్ రెడ్డికి ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు. మార్చి 9 నుంచి భవిష్యత్ కార్యాచరణ చేపడతామని ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్ర‌క‌టించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే మార్చి 9 నుంచి యథావిధిగా ఉద్యమంలోకి దిగుతామని నేతలు పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న  ప్ర‌కారం మార్చి 9, 10 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన, 13, 14 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసనలు, 15, 17, 20 తేదీల్లో జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్‌ల దగ్గర ధర్నాలు, 21 నుంచి వర్క్‌టూ రూల్ అన‌గా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేయనున్నారు. మార్చ్ 21న సెల్‌డౌన్‌, యాప్‌డౌన్, 24 నుంచి అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో ధర్నాలు, 27న కరోనాతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఓదార్పు కార్యక్రమం ఉంటుంది. సరెండర్-ఎర్న్‌ లీవ్‌లు, జీపీఎఫ్‌ విషయంలో ఏప్రిల్‌ 1న పోలీసు కుటుంబాల ఇళ్ళ సంద‌ర్శ‌న ఉంటుంది.  ఏప్రిల్‌ 5న ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వ‌హించి రెండోదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారు.

వైఎస్సార్ రైతుభ‌రోసా అని భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. ముఖ్య‌మంత్రి కూడా తాను బ‌టన్ నొక్కి రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేశాను అంటూ ప్ర‌క‌టించేశారు. అయితే అస‌లు ట్విస్ట్ ఏంటంటే, వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సీఎం జ‌గ‌న్ రెడ్డి గాలి తీసేశారు. తెలిసి చేశారో, తెలియ‌క చేశారో...కావాల‌నే ఇరికిద్దామ‌నే ఆలోచ‌న‌తో చేశారో కానీ విజ‌యసాయిరెడ్డి ట్వీటు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్క‌డ జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్క‌డానికి ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన స‌మ‌యానికే ప్ర‌ధాన మంత్రి కిసాన్ ప‌థ‌కం కింద రైతుల ఖాతాల‌త్లో రూ.2000 జ‌మ అయిపోయింది. దీనిపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ విజ‌యసాయిరెడ్డి ప్ర‌ధాని మోదీ ఆలోచ‌న‌ల ప్ర‌తిరూప‌మే ఈ ప‌థ‌కం అంటూ కితాబు ఇచ్చారు. దేశ‌వ్యాప్తంగా 16800 కోట్లు విడుద‌ల చేసినందుకు రైతుల త‌ర‌ఫున ద‌న్య‌వాదాలు తెలిపారు సాయిరెడ్డి. ఇవేవో త‌న జేబులోంచి ఇస్తున్న‌ట్టు జ‌గ‌న్ రెడ్డి భారీ ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చేశారు. దీనికి పేరు కూడా ఇచ్చిన ప్ర‌ధాన మంత్రి పేరు చివ‌ర‌న క‌న‌ప‌డ‌కుండా పీఎం కిసాన్ అని వేసి తాటికాయంత అక్ష‌రాల్లో వైఎస్సార్ రైతు భ‌రోసా అని వేయించారు. అయితే విజ‌యసాయిరెడ్డిని సీఎం జ‌గ‌న్ రెడ్డి దూరం పెట్టార‌ని, ప‌ద‌వుల‌న్నీ పీకేశార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీని పొగుడుతూ వేసిన విజ‌య‌సాయిరెడ్డి ట్వీటు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో చేర‌తార‌నే ఊహాగానాల‌కు ఊత‌మిస్తోంది.

తెలంగాణ‌పై క‌మ‌లనాథులు గురిపెట్టారు. నాలుగు వైపుల నుంచీ త‌రుముతూ వ‌స్తూ ఫిక్స్ చేయాల‌ని చూస్తున్నారు. ఒక వైపు ఢిల్లీ లిక్క‌ర్ కేసు కేసీఆర్ కూతురు క‌విత మెడ‌కే చుట్టుకునేలా ఉంది. ఆమె అరెస్టు ద‌గ్గ‌ర ప‌డింద‌ని తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో బీజేపీ వాయిస్ అని పేరుప‌డిన ష‌ర్మిల రాష్ట్ర‌ప‌తి పాల‌న గ‌ళం ఎత్తుతోంది. బీఆర్ఎస్ అని ఎంత పెద్ద సౌండ్ చేసినా, క‌మ‌ల‌నాథులు క‌నిక‌రించే అవ‌కాశంలేద‌ని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ నిర్ధారిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంద‌ని, చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి పని చేయాల‌ని తెలంగాణ బీజేపీ నేత‌ల‌ని ఆదేశించారు షా. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై అమిత్‌షా సీరియస్ గా స్పందించ‌డంతో నేత‌లు అవాక్క‌య్యారు. విభేదాలు ప‌క్క‌న‌పెట్ట‌టి, నేతలంతా కలిసి కష్టపడి పనిచేయాలని అమిత్‌షా ఆదేశించారు.   అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాల‌ని, అనంత‌రం ఉమ్మడి జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించాల‌ని, చివ‌రిగా రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభ నిర్వహించాలని సూచించారు.  పార్టీలోకి చేరికలను వేగవంతం చేయాల‌న్నారు. తెలంగాణలో అధికారం ద‌క్కించుకోవ‌డం మిన‌హా నాకు వేరే పనిలేదు, నా ఫోకస్ అంతా తెలంగాణపైనే అనే అర్థం వ‌చ్చేలా అమిత్ షా చెప్ప‌డంతో టి బీజేపీ నేత‌లు విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చింది. తెలంగాణ బీజేపీలో కిష‌న్ రెడ్డి  ఒక వ‌ర్గంగా, సంజ‌య్ మ‌రో వ‌ర్గంగా,  అర్వింద్ ఇంకో వ‌ర్గంగా గ్రూపు రాజ‌కీయాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అమిత్ షా హెచ్చ‌రిక ఇటు బీజేపీ నేత‌ల‌కు, అటు బీఆర్ఎస్ నేత‌ల‌కు గుబులు రేపుతోంది.

Advertisements

Latest Articles

Most Read