రాష్ట్ర నీటిపారుదల శాఖా మాత్యులు అనిల్ కుమార్ ఈరోజు మాట్లాడుతూ, పోలవరానికి సంబంధించిన నిజాలు బయటపెడతానని, దమ్ముంటే సమాధానాలు చెప్పాలని తమపార్టీకి సవాల్ విసిరితే, ఆయన మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం చెప్పడానికే తాము వచ్చామని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. శనివారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. "పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏబీసీడీ లు కూడా తెలియని అనిల్ కుమార్ కి తాము సమాధానం చెప్పడమేంటి. ఆయనకు ప్రాజెక్ట్ గురించి ఏం తెలుసు? టీఎంసీ అనే పదానికి పూర్తి అర్థం ఆయనకు తెలుసా? క్యూసెక్కు అంటే ఎన్నినీళ్లు వస్తాయో తెలుసా? ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కాకపోతే, ఆయన రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రా? ఆయనకు తాము సమాధానం చెప్పడమేంటి? మార్చి 2017లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆనాడు తమపార్టీకిచెందిన మంత్రులెవరూ మాట్లాడలేదని, దానివల్లే ప్రాజెక్ట్ కు తీరని అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ ఏదేదో మాట్లాడాడు. మార్చి 2017లో ఏం జరిగింది...తరువాత ఏంజరిగిందో చెప్పడానికే తాము మీడియా ముందుకు వచ్చాం. ఘోరం, నేరం జరిగినట్లు, అనిల్ కుమార్ ఊదరగొడుతూ, తన, తనప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం తమపై బురదజల్లుతున్నాడు. మార్చి 15 - 2017లో జరిగిన కేబినెట్ మీటింగ్ నోట్ ను పరిశీలిస్తే, 01-04-2014 నుంచీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి పెట్టేఖర్చును తామే భరిస్తామని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో, దానిపైనే ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన అంచనా వ్యయం బాధ్యత పెట్టడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిధిలోకే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా వస్తుంది."

"ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కైనా ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ అక్విజేషన్ కలిపే ఉంటుంది. ఇందులో ఏముందని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అనిల్ గోల చేస్తున్నాడు? అనిల్ ఏనాడైనా ఢిల్లీ వెళ్లి, కేంద్ర జలశక్తి మంత్రితోగానీ, ఆర్థికమంత్రితో గానీ మాట్లాడాడా? అనిల్ ఒక బెట్టింగ్ ముఠా నాయకుడు. అటువంటివ్యక్తి 420కి భక్తుడు కావడంలో ఆశ్చర్యం ఏముంది? 420లంతా ఎప్పుడూ ఒకేచోట ఉంటారు. 2017 మార్చిలో కేంద్ర కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత, తమప్రభుత్వం దాదాపు లక్ష డాక్యుమెంట్లను ఢిల్లీకి తరలించింది. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ను ఎస్టిమేట్ చేయించడం కోసం లక్షడాక్యుమెంట్లను తరలించడం జరిగింది. అనేకసార్లు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన సభ్యులు పోలవరంప్రాజెక్ట్ ని సందర్శించారు. ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి ఆప్రాంతమంతా తిరిగారు. ఆ తరువాతే కేంద్ర టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రూ.55,548కోట్ల అంచనావ్యయానికి ఆమోదం తెలిపింది. ఇవన్నీ తెలిసే, అనిల్ మాట్లాడుతున్నాడా? చంద్రబాబు నాయడు ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే, పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,548కోట్లకు ఆమోదించేలా చేశారు. మీరు వచ్చాక సంవత్సరంన్నరకే ప్రాజెక్ట్ ని అటకెక్కించి. ఫిబ్రవరి 20-2014న ఆనాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్, ల్యాండ్ అక్విజేషన్ మరియు ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి రాజ్యసభలో మాట్లాడుతూ, చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనేం చెప్పారో ఏపీ ఇరిగేషన్ మంత్రికి తెలుసా? 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్ట్ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ ప్రక్రియని పూర్తిచేస్తామని నాటి ప్రధాని చెప్పారు. "

"అంతస్పష్టంగా ప్రధాని చెబితే, ఇప్పుడు ఈ మంత్రి ఏం మాట్లాడతాడు? 24-06-2019న పార్లమెంట్ లో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నాటి కేంద్రమంత్రి సమాధానమిస్తూ, పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి, రూ.55,548 కోట్లకు రివైజ్ట్ కాస్ట్ అంచనాలను అమోదించడం జరిగిందన్నారు. 11-02-2019న జరిగిన 141వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో రూ.55,548కోట్లకు ఆమోదించామని నాటి కేంద్రమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. దానిలోనే రూ.33,168కోట్లు ఆర్ అండ్ ఆర్ మరియు ల్యాండ్ అక్విజేషన్ కు కేటాయించడం జరిగిందని కూడా చెప్పారు. ఇంతా జరిగితే, ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ అక్విజేషన్ గురించి టీడీపీ పట్టించుకోలేదని ఈ మంత్రి ఎలా చెబుతారు? రూ.33,168కోట్లకు ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ కు ఆమోదం తెలిపేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదికాదా? ఆ ఘనత సాధించింది టీడీపీ ప్రభుత్వం కాదా? దీనికేం సమాధానం చెబుతాడు మంత్రి అనిల్ కుమార్? విజయసాయి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం చెప్పిన రోజునే, విజయసాయి ట్వీట్ పెట్టారు. దానిలో జగన్మోహన్ రెడ్డి ప్రధానిని కలిసి పోలవరం నిధుల గురించి అడిగినట్లు, అందుకు స్పందనగానే రూ.55,548కోట్లకు ఆమోదం తెలిపారని ట్వీట్ లో చెప్పారు. వైసీపీప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, జగన్ ఏమీ సాధించకపోయినా, టీడీపీప్రభుత్వ ఘనతను మీదిగా చెప్పుకున్నారు.. సిగ్గులేకుండా."

"ఫిబ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.55,548కోట్లకు ఆమోదం పొందేలా చేస్తే, తమనాయకుడే చేశాడని, మోదీతో మాట్లాడాడని విజయసాయి ట్వీట్లు ఎలా పెడతాడు? జగన్ అడగకపోయినా అడిగినట్లు విజయసాయి ఢంకా ఎలా భజాయించాడు. ఆ ఖ్యాతి మీదైతే, ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనావ్యయంలో రూ.20వేలకోట్లు కోత పెట్టారు కదా.. దానికి కూడా బాధ్యత మీరే తీసుకోవాలి కదా? కోత పెడితే బాధ్యత మాదికాదంటూ, ఆమోదించిన దానికి మాత్రమే బాధ్యత తీసుకుంటారా.? పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటషన్ పై విచారణ జరిగినప్పుడు కేంద్రజలవనరుల శాఖ జూన్ 2020న వేసిన పిటిషన్లో ఆర్ అండ్ ఆర్ కింద దాదాపుగా రూ.33వేలకోట్ల వరకు ఒప్పుకున్నట్లు చెప్పారు. దీనికేం సమాధానం చెబుతారో చెప్పాలి. జూన్ 2020న కూడా కేంద్రం ఆర్ అండ్ ఆర్ కి ఎంతమొత్తానికి ఒప్పుకుందో స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా తెలుగుదేశంపై నిందలేస్తారా? ఆనాడు చంద్రబాబు నాయుడు అనేకసందర్భాల్లో ఢిల్లీ వెళ్లినప్పడల్లా పోలవరం ప్రాజెక్ట్ పై శ్రధ్దచూపి, సోమవారాన్ని పోలవారం గా మార్చుకొని పనులు చేయబట్టే 70శాతం పనులు పూర్తయ్యాయి. రూ.55,548కోట్లకు అంచనాలను ఆమోదింపచేశారు. అదే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరుల మంత్రే ఒప్పుకున్నారు. ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిననివేదికలో కూడా దాన్నే సమర్థించారు. ఇంతజరిగితే, టీడీపీని, చంద్రబాబుని విమర్శిస్తారా? 70శాతం పనులు ఎక్కడ పూర్తయ్యాయో మంత్రి అనిల్ కు, ముఖ్యమంత్రికి తెలియదా? "

"ప్రాజెక్ట్ పనులు 70శాతం పూర్తయ్యాయని, వైసీపీప్రభుత్వంలోని అధికారులే ముఖ్యమంత్రి, నోటిపారుదల శాఖా మంత్రి సమక్షంలో వీడియో ప్రదర్శించి మరీ వివరణ ఇచ్చారు. హెడ్ వర్క్స్ పనులు, రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు, కాపర్ డ్యామ్ పనులు ఎంత జరిగాయో వివరిస్తూ, 70శాతం పనులు జరిగాయన్నారు. నోటి పారుదల మంత్రి ఆనాడు జరిగిన సమావేశంలో నిద్రపోతున్నాడా? ఆయన కళ్లెదురే కదా అధికారులు 69.05శాతం పనులుజరిగాయని చెప్పారు. ఆనాడే ఈ మంత్రి అధికారులను ఎందుకు అడగలేదు? ఈ విధంగా వాస్తవాలన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే, టీడీపీని ఎలా నిందిస్తారు? టీడీపీప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ కి ఆమోదించిన అంచనా వ్యయం రూ.55,548కోట్లపై కేంద్రాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు నిలదీయలేకపోతోంది? పోలవరం ప్రాజెక్ట్ ని అటకెక్కించి, పూర్తిగా నిర్వీర్యంచేసిన ఘనత వైసీపీప్రభుత్వానిదే. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు అర్థంచేసుకోవాలి. విషయపరిజ్ఞానం లేనివ్యక్తులు, ప్రాజెక్ట్ నినాశనం చేసినవ్యక్తులే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడి కృషికారణంగానే దేశంలో ఏ ప్రాజెక్టులో జరగనివిధంగా 70శాతం పనులుజరిగాయి. అదే విషయాన్ని తరువాత కేంద్రమంత్రి గడ్కరీ కూడా ఒప్పుకున్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం అటకెక్కడానికి, ఆగిపోవడానికి కారణం ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డేనని ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి." అని పట్టాభి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read