ఎప్పుడో 2015 నాటి ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ తెర మీదకు వచ్చింది. 2015లో తెలంగాణా ప్రభుత్వం, అప్పటి ఏపి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కలిసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేసారు అంటూ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం చాలా పెద్దది అయ్యింది కూడా. వివిధ మొబైల్ ఫోన్ ఆపరేటర్లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ చేసారనే ఆరోపణతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పై, వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఒక సిట్ ను నియమించింది. ఈ సిట్ కు చీఫ్ గా మహ్మద్‌ ఇక్బాల్‌ ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ కేసు తెర మీదకు తీసుకువచ్చిన ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ సిట్ కు కొత్త చీఫ్ గా శాంతిభద్రతల విభాగం డీఐజీ రాజశేఖర్‌బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం కీలకంగా మారింది. దీనికి సంబందించిన ఉత్తర్వులను జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రావీ ప్రకాష్ విడుదల చేసారు. అయితే ఇప్పుడు ఈ సిట్ పై ఎందుకు కదలిక వచ్చింది ? అప్పట్లోనే మరుగున పడిన ఈ కేసును మళ్ళీ ప్రభుత్వం ఎందుకు తిరగదొడింది అనే చర్చ మొదలైంది.

అప్పట్లో ఓటుకు నోటు అంటూ, తెలంగాణా ప్రభుత్వం చంద్రబాబుని ఇరికించే ప్రయత్నం చేసింది. అయితే ఇది ఇలా నడుస్తూ ఉండగానే, తెలంగాణా ప్రభుత్వం ఏపి ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసింది అంటూ, ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ కొన్ని ఆధారాలు ఇవ్వటంతో, కేసీఆర్, జగన్, తెలంగాణా హోం మంత్రిగా చేసిన నాయని, సాక్షి టీవీ, టీ న్యూస్ పై, ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 88 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మహ్మద్‌ ఇక్బాల్‌ ని ఈ సిట్ కు సారధ్యం వహించాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆయన తన 2018లో పదవికి రిటైర్మెంట్ ప్రకటించటంతో, అప్పటి నుంచి ఈ కేసు మరుగున పడి పోయింది. ఇందులో మరో కొస మెరుపు ఏమిటి అంటే, మహ్మద్‌ ఇక్బాల్‌ ఇప్పుడు వైసీపీలో చేరి, ఏకంగా ఎమ్మెల్సీ పదవి అనుభవిస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఈ సిట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సిట్ కు రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా మరో అధికారికి బాధ్యతలు ఇవ్వటం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read