కరోనాపై పోరులో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్-19 కట్టడి, గడచిన 2 రోజుల్లో కేసుల సంఖ్య పెరిగినందుకు గల కారణాలను సీఎం జగన్ వివరించారు. ప్రధాని మోదీతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను, గడచిన 2 రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను ప్రధానికి వివరించారు. కేసుల్లో 111 మంది జమాత్‌కు వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారేనని పేర్కొన్నారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను చర్చించారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా, క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని కోరారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని తగిన విధంగా ఆదుకోవాలని ప్రధానికి, ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక ప్రధాని మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో టెస్టులు నిర్వహించడం సహా బాధితుల్ని గుర్తించడం, ఐసోలేషన్​, క్వారంటైన్​పైనే ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు.

9 రోజులుగా దేశంలో లాక్​డౌన్​ కొనసాగుతున్నప్పటికీ, కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపైనా ఆరా తీశారు. కరోనా నియంత్రణకు రాష్ట్రాలన్నీ ఏకమై పోరాడటం ప్రశంసనీయమన్నారు మోదీ. లాక్​డౌన్​ ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎంలతో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలన్నారు. కొవిడ్​-19 బాధితుల కోసం, ప్రత్యేకంగా ఆసుపత్రుల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కోరారు ప్రధాని. అత్యవసర వైద్య ఉత్పత్తి పరికరాల సరఫరా, ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల లభ్యతకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. చివరగా కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్న అందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

సంక్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభను చూపారని మోదీని కొనియాడారు ముఖ్యమంత్రులు. దిల్లీ మర్కజ్​ వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఇంకా ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను మోదీకి వివరించారు. కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, అమిత్​ షా కూడా ఈ దూరదృశ్య సమీక్షలో పాల్గొన్నారు. కరోనా సంక్షోభంపై రెండు వారాల వ్యవధిలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది రెండోసారి. మార్చి 20న తొలిసారి సీఎంలతో సమావేశమైన మోదీ, 24న దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది ఇలా ఉంటే, ఏప్రిల్ 14 తో, లాక్ డౌన్ ముగుస్తు ఉండటంతో, ఆ తరువాత, ఒకేసారి కాకుండా, విడతల వారీగా లాక్ డౌన్ ఎత్తి వేసే అవకాశం ఉందని, ప్రధాని చెప్పినట్టు తెలుస్తుంది. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కూడా ఇదే విషయంతో ట్వీట్ చేసారు. లాక్ డౌన్ తరువాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధాని కోరారని ఆయన ట్వీట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read