ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా దెబ్బకు తల పండిన శాస్త్రవేత్తలు కూడా కరోనాకు విరుగుడు కనిపెట్టలేని పరిస్థితుల్లో ఇక అందరికీ ఆ దేవుడే దిక్కయ్యాడు. ఎవరో ఒక రూపంలో దేవుడు విరుగుడు మందును కనిపెట్టి, పంపిస్తే తప్పా, కరోనా బారి నుండి బయట పడే పరిస్థితి కనిపించటం లేదు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ముందు చూపుతో తీసుకుంటున్న జనతా కర్ఫ్యూ , లాక్ డౌన్ వంటి కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా మేలు చేసేవే. అయితే ఇటువంటి ముందస్తు నిర్ణయాలు మంచిదే అయినప్పటికీ బడుగులకు మాత్రం చీకటి రోజులే. రెక్కాడితే కానీ డొక్కా డనీ దినసరి కూలీలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో నిత్యం రోజువారీ కూలీపనులు చేసే వారితో పాటు రిక్షా, ఆటో కార్మికులు, వివిధ వ్యాపార సంస్థల్లో అనుబంధ కార్మికులుగా సుమారు 80 లక్షల మంది పని చేస్తున్నారు. వారంతా రోజువారీ, వారంతపు కూలీ సొమ్ముపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారే.

వారంలో ఒకటి రెండు రోజులు కూలీ పనులు దొరక్కపోయినా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలు లక్షల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు వారాలు లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలెవ్వరూ రోడ్ల మీదకు రావొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఆయా సంస్థలు ఇంటి నుంచే విధులు నిర్వహించుకునేలా అవకాశం ఇచ్చింది. అయితే రోజువారీ కూలీలకు మాత్రం ఎటువంటి ఆర్థిక వెసులుబాటు లేకపోవటం, పని చేస్తే కాని పూటగడవని ఆ నిరుపేద బడుగుల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. చిరు వ్యాపారులకు.. చీకటి రోజులు రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారులు లక్షల్లో ఉన్నారు.

ప్రతి జిల్లాలోనూ లక్ష నుంచి రెండు లక్షల వరకు రోడ్డు మార్జిన్, హాకర్స్, వీధి చివర్లో ప్రజలకు అందు బాటులో వివిధ రకాల చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వ్యాపారులు న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదివారం నుంచి లాక్ డౌన్ ప్రకటించటంతో వీరంతా వ్యాపారాలకు దూరమై, ఇళ్లకే పరిమితం కావాల్సివచ్చింది. తమ వద్ద ఉన్న కొద్దీ గొప్ప సొమ్ముతో పెట్టుబడి పెట్టి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసి, వచ్చిన ఆదాయంలో కొంత ఇంటి ఖర్చులకు ఉంచుకుని, మిగిలినది మరుసటి రోజు వ్యాపారాని పెట్టుబడిగా పెట్టి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై కరోనా ప్రభావం తీవ్రంగా పడుతోంది. గడిచిన రెండు రోజుల్లోనే వీరు వ్యాపారాలకు దూరం కావటంతో రానున్న 21 రోజుల్లో ఎలా బతకాలి దేవుడా అంటూ వేడుకుంటున్నారు.

కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముందు చూపుతో రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేసింది. ఇందులో భాగంగానే రిక్షా, ఆటోలు కూడా రోడెక్కటానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో రిక్షా, ఆటో కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తోంది. రోజువారీ వడ్డీల కు డబ్బు అప్పుగా తీసుకుని, పెట్టుబడి పెట్టి, ఆటోలు కొనుగోలు చేసిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆటోలు నిలిపివేయటంతో వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తోంది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో వివిధ దినసర కూలీలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఆదుకోవలసిన పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రంలో అన్నపూర్ణ క్యాంటీన్లు ద్వారా పేదలకు అన్నం పెడుతుంటే, మనకు మాత్రం అన్న క్యాంటీన్లు ఎత్తేయటంతో, తిండి తినటానికి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కనీసం వీరిని రెండు పూటలా అన్నం అయినా పెట్టే ఏర్పాటు చెయ్యాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read