ప‌రిస్థితుల‌న్నీ అనుకూలంగా ఉంటే గ‌డ్డిపోచ కూడా ఒడ్డు చేరుస్తుంది. అవే ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా మారితే గ‌డ్డిపోచే పామై కాటేస్తుంది. ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి ఇలాగే ఉంది. 2019 ఎన్నిక‌ల‌కి ముందు రాంగోపాల్ వ‌ర్మ‌తో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తీసి కొంత టిడిపిని డ్యామేజ్ చేయించ‌గ‌లిగారు. యాత్ర తీయించి కొంత మైలేజ్ తెచ్చుకున్నారు. కోడిక‌త్తి డ్రామా అని తెలిసినా సానుభూతి క‌లిసి వ‌చ్చింది. బాబాయ్‌పై గొడ్డ‌లిపోటు వేయించి నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అని చేసిన ప్ర‌చారం సీట్లు తెచ్చి పెట్టింది. ప‌న్నిన కుతంత్రాల‌న్నీ ఫ‌లించి సీఎం ప‌ద‌వి ద‌క్కింది. అయితే పాల‌న ప‌డ‌కేసింది. ప్ర‌జావ్య‌తిరేక‌త వెల్లువెత్తుతోంది. అభివృద్ధి అథఃపాతాళంలోకి చేరింది. ఒక్క‌చాన్స్ ఇచ్చిన ప్ర‌జ‌లు ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతాయా దింపేద్దామా అన్నంత కోపంలో ఉన్నారు. ఇటువంటి స‌మ‌యంలో మ‌ళ్లీ గ‌త ఎన్నిక‌లకి ప‌న్నిన కుతంత్రాలలో ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కి తీస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిశోర్ టీముతోపాటు రాంగోపాల్ వ‌ర్మ కూడా ప్యాకేజీకి వైసీపీ కోసం ప‌నిచేశారు. మ‌ళ్లీ ఇప్పుడు కూడా త‌మ ప‌ని మొద‌లుపెట్టారు ఈ ప్యాకేజీ డైరెక్ట‌ర్‌. జ‌గ‌న్ రెడ్డికి ఎన్నిక‌ల్లో ల‌బ్ధి చేకూరేలా  'వ్యూహం' పేరుతో రాజకీయ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. ఆలోచనకు, అహంకారానికి మధ్య జరిగే యుద్ధం అంటూ క్యాప్షన్ కూడా చెప్పారు. దీని ఫ‌స్ట్ లుక్ షూట్ ఫోటోలు విడుద‌ల చేశారు. జగన్‌ పాత్రలో అజ్మల్‌, భారతి పాత్రలో మానస నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాత‌కి కూడా జ‌గ‌న్ స‌ర్కారు తాయిలం టిటిడి బోర్డు స‌భ్య‌త్వం ఆల్రెడీ క‌ట్టబెట్టేశారు. జ‌గ‌న్ రెడ్డికి చుట్టూ ఉన్న ప‌రిస్థితుల‌న్నీ అన‌నుకూలంగా ఉన్నాయి. జ‌నంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. చేయించిన అరాచ‌కాలు, బాధితులు ఆర్త‌నాదాల నేప‌థ్యంలో రియ‌ల్ విల‌న్ జ‌గ‌న్‌ని రీల్  హీరోగా రాంగోపాల్ వ‌ర్మ చేసే ప్ర‌య‌త్నం ఎదురు త‌న్నేస్తుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా పోస్ట‌ర్లు రిలీజ్ చేసిన వెంట‌నే ట్రోల్స్, మీమ్స్ హోరెత్తిపోయాయి. వాటి రీచ్ కూడా విప‌రీతంగా ఉండ‌డం వ్యూహం బెడిసికొట్ట‌డం ఖాయ‌మంటున్నారు సినీ విశ్లేష‌కులు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read