ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ డబ్బు తీసుకొని రాజకీయ పార్టీలకు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు పెట్టేందుకు అంగీకరిస్తూ 36 మంది బాలీవుడ్‌ ప్రముఖులు కెమెరా కంటికి చిక్కారు. వీరిలో జాకీ ష్రాఫ్‌, కైలాశ్‌ ఖేర్‌, సోనూ సూద్‌, వివేక్‌ ఒబెరాయ్‌ తదితరులు ఉన్నారు. ‘కోబ్రాపోస్ట్‌’ అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ నిర్వహించిన ఒక శూలశోధన ఆపరేషన్‌లో వీరు దొరికిపోయారు. ప్రజా సంబంధాల సంస్థ ప్రతినిధులుగా చెప్పుకుంటూ కోబ్రాపోస్ట్‌ విలేకరులు నకిలీ పేర్లతో పలువురు సినీ, టీవీ నటులు, గాయకులు, డ్యాన్సర్లను వారి మేనేజర్ల ద్వారా సంప్రదించారు. లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తాము సూచించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తారా అని వారిని అడిగారు. సదరు సందేశాలను తామే అందిస్తామని, వాటిని వారివారి సామాజిక మాధ్యమ ఖాతాలో పెడితే చాలని ప్రతిపాదించారు. తద్వారా ఎన్నికలకు ముందు సదరు రాజకీయ పార్టీలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని వివరించారు.

bollywoods 21022019

దీనికి 36 మంది ప్రముఖులు అంగీకరించారు. ‘‘అత్యాచారం, వంతెనలు కూలడం వంటి వివాదాస్పద అంశాల్లో వీరు ప్రభుత్వాన్ని సమర్థించడానికి అంగీకరించారు. ఈ ప్రచారాన్ని కప్పి పుచ్చడానికి ఏదో ఉత్పత్తులకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు ఒక డమ్మీ కాంట్రాక్టుపై సంతకం చేయడానికి కూడా వారు సిద్ధపడ్డారు’’ అని కోబ్రాపోస్ట్‌ ముఖ్య సంపాదకుడు అనిరుద్ధ బహల్‌ చెప్పారు. సదరు ప్రముఖులు వరుసగా పెట్టిన ట్వీట్లు, శూలశోధన ఆపరేషన్‌లో దొరికిన వీడియోలను ఈ మీడియా పోర్టల్‌ వెలువరించింది. ఈ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎక్కువ కేసుల్లో భాజపా, ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున, కొన్ని కేసుల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకు సెలబ్రిటీలు సిద్ధపడ్డారు. పాన్‌ నెంబర్‌, బ్యాంకు వివరాలు చెప్పేందుకు ఎక్కువ మంది సమ్మతించారు. అత్యధికులు నగదు రూపంలోనే తీసుకునేందుకు అంగీకరించారు. ఒక్కో సందేశానికి రూ.2 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

bollywoods 21022019

8 నెలల కాంట్రాక్టు కోసం రూ.20 కోట్ల రుసుమును అడిగినవారూ వీరిలో ఉన్నారు. రుసుముల్లో సింహభాగం నగదు రూపంలోనే చెల్లిస్తామని చెప్పినప్పటికీ, ఎవరూ నల్లధనాన్ని కాదనలేదు. అయితే విద్యాబాలన్‌, అర్షద్‌ వార్సి, రజా మురాద్‌, సౌమ్య టాండన్‌ వంటివారు మాత్రం ఈ ఒప్పందం తమకు సమ్మతం కాదని సూటిగా చెప్పేశారు. డబ్బు తీసుకొని ట్వీట్లు చేయడానికి అంగీకరించినవారిలో శ్రేయస్‌ తల్పడే, సన్నీ లియోన్‌, శక్తి కపూర్‌, అమీషా పటేల్‌, టిస్కా చోప్రా, రాఖీ సావంత్‌, పంకజ్‌ ధీర్‌, ఆయన కుమారుడు నికితిన్‌ ధీర్‌, పునీత్‌ ఇస్సార్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, మిన్నిసా లాంబ, మహిమా చౌధురి, రోహిత్‌ రాయ్‌, అమన్‌ వర్మ, కోయినా మిత్రా, రాహుల్‌ భట్‌, గాయకులు దలేర్‌ మెహందీ, మికా, అభిజిత్‌ భట్టాచార్య, బాబా సెహ్‌గల్‌, నృత్య దర్శకుడు గణేశ్‌ ఆచార్య, హాస్య నటులు రాజ్‌పాల్‌ యాదవ్‌, రాజు శ్రీవాస్తవ, కృష్ణ అభిషేక్‌, విజయ్‌ ఈశ్వర్‌లాల్‌ పవార్‌ (వీఐపీ) తదితరులు ఉన్నారు. ఈ వీడియోల్లో తన మాటల్లో మార్పులు చేర్పులు చేశారని, మాటల్లోని కొన్ని అంశాలనే ఉపయోగించుకుంటూ తనను చెడుగా చూపేందుకు ప్రయత్నించారని నటుడు సోనూ సూద్‌ ఆరోపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read