ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం, మంగళగిరిలో ఉన్న ఎన్టీఆర్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా, రేపు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, అలాగే ప్రజలకు ఎలా అర్ధమయ్యేలా చెప్పాలి అనే దాని పై, చర్చించారు. ఈ సందర్భంగా, ఆనాడు ఎన్టీఆర్ తీసుకువచ్చిన ఒక ఫార్ములా ఎలా సక్సెస్ అయ్యింది ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు: 1).అభివృద్ది వికేంద్రీకరణే తెలుగుదేశం పార్టీ మూల సిద్దాంతం. అన్ని ప్రాంతాల్లో అభివృద్ది జరగాలి, పరిపాలన ప్రజల వద్దకు చేరాలి అనేదే ఎన్టీఆర్ హయాం నుంచి టిడిపి విధానం. ఎన్టీఆర్ మాండలిక వ్యవస్థ తెచ్చింది పరిపాలన ప్రజల వద్దకు తెచ్చాం. ఆఫీస్ మారిస్తే, ఏదో 10మంది ఉద్యోగులను అటుఇటు మారిస్తే అభివృద్ది జరగదు. ఇప్పుడు పరిపాలన వికేంద్రకరణ పేరుతో అంతా రివర్స్ చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వ శాఖలను 4చోట్లకు మార్చడం ‘‘పాలనా వికేంద్రీకరణ కాదు. పాలనా విచ్ఛిన్నం..’’ బాధ్యతా యుతమైన స్థానాల్లో ఉన్నవాళ్లు ఈవిధంగా చేయరాదు. ప్రజల సౌలభ్యం కోసం పరిపాలన ఉండాలి. మండల స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట (మండల కేంద్రంలో) ఉండాలి. జిల్లా స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు జిల్లా కేంద్రంలోనే ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట సెక్రటేరియట్ లో ఉండాలి. అప్పుడే వివిధ పనులపై వచ్చిన ప్రజానీకం ఆ ప్రాంతానికి వచ్చి అన్ని పనులు చేసుకుని వెళ్లడం సులువుగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ లో భాగంగానే ప్రతి మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలని ఎన్టీఆర్ అప్పట్లో భావించారు, మాండలిక వ్యవస్థకు రూపకల్పన చేసి దిగ్విజయంగా నడిపారు.  రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు రాజధాని ప్రాంతంలో ఒకేచోట సెక్రటేరియట్ లో ఉంటేనే, అన్నివర్గాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది. ఒక్కో శాఖ పనికి ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సి రావడం ప్రజలకు వ్యయ ప్రయాస భారమే..

ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కేంద్ర కార్యాలయాలను అన్నింటినీ ఒకేచోట తెచ్చి, 70వేల ఉద్యోగులను ఒకే చోటకు తెచ్చి, ఇండియా గేట్- రాష్ట్రపతి భవన్ మధ్య నిర్మిస్తుంటే, పరిపాలనా కేంద్రీకరణ చేస్తుంటే, మన రాజధానిలో ఉన్న శాఖలను 4చోట్లకు మార్చేసి ‘‘పాలనా విచ్ఛిన్నానికి’’ వైసిపి ప్రభుత్వం పాల్పడుతోంది. 10వేల ఎకరాల భూములపై కన్నేసినందుకే విశాఖకు రాజధానిని తరలించాలని ఎత్తుగడ వేశారు. 8నెలల్లో సీఎం స్వంత నియోజకవర్గానికి వేలకోట్లు ఇచ్చారు. అదే శ్రీకాకుళం, విజయనగరంకు ఎందుకివ్వలేదు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే..? 2).నీటిపారుదల ప్రాజెక్టులపై టిడిపి ప్రభుత్వం రూ72వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో 40వేల కోట్లు పైన వెనుకబడిన జిల్లాలలోనే(ఉత్తరాంధ్ర, రాయలసీమ) ఖర్చు చేశాం. టిడిపి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా విశాఖ నుంచే చేశాం. 3సమ్మిట్లు పెడితే మూడూ విశాఖలోనే నిర్వహించాం. ఆర్ధిక రాజధానిగా, ఫార్మాహబ్ గా, టూరిస్ట్ కేంద్రంగా విశాఖను అన్నివిధాలా అభివృద్ది చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే..హుద్ హుద్ తుపాన్ బీభత్సంలో విశాఖ అతలాకుతలం అయితే, సెక్రటేరియట్, కేబినెట్ అంతా అక్కడే 14రోజులు మకాం వేసి విశాఖను మళ్లీ సర్వాంగ సుందరంగా చేశాం. తిత్లి తుఫాన్ బీభత్సంలో కనీసం శ్రీకాకుళం జిల్లాలో బాధితులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు.

హుద్ హుద్ తుపాన్ తో విశాఖ అల్లాడితే అక్కడ కనీసం గంట కూడా ఉండకుండా వెళ్లిపోయాడు. వాళ్ల అమ్మను ఓడించినందుకే హుద్ హుద్ వచ్చిందన్నవాళ్లకు విశాఖపై ప్రేమ ఉంటుందా..? 3).ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఈ 8నెలల్లో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఎంత నిధులు ఖర్చు చేశారు..? భావనపాడు పోర్ట్, భోగాపురం ఎయిర్ పోర్ట్ అతీగతీ పట్టించుకోలేదు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార ప్రాజెక్టుల్లో ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క యూనిట్ కాంక్రీట్ వేయలేదు. విశాఖపై ప్రేమతో కాదు అక్కడి భూములపై కన్నేయడం వల్లే అక్కడికి తరలిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ కాబట్టి అమరావతి వీలుకాదు, ల్యాండ్ గ్రాబింగ్ కోసమే విశాఖపై కన్నేశారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టి ఇక్కడి భూముల ధరలు పెంచడం దేవుడెరుగు, ఉన్నభూములన్నీ వైసిపి భూతాలే మింగేస్తున్నారని అక్కడి ప్రజలు భీతిల్లుతున్నారు. పనులన్నీ నిలిపేసి ఇక్కడ అమరావతిని దెబ్బకొట్టారు. రూ లక్ష కోట్ల సంపదను నాశనం చేశారు. రూ లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే డేటా సెంటర్, లులూ, ప్రాంక్లిన్ టెంపుల్ టన్, ఫిన్ టెక్ అన్నీ పోగొట్టేసి విశాఖను దెబ్బకొట్టారు. కియా ఆగ్జిలరీ యూనిట్లు 17పోగొట్టి అనంతపురాన్ని, మెగా సీడ్ హబ్ పోగొట్టి కర్నూలును, రిలయన్స్ కంపెనీ పోగొట్టి తిరుపతిని, సోలార్-విండ్ పవర్ ప్లాంట్లను బెదిరించి మొత్తం రాయలసీమనే దెబ్బకొట్టారు. మొత్తం రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు తీరని నష్టం చేశారు.

గత 8నెలల్లో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నాశనం చేయడంపై సర్వత్రా వ్యతిరేకత ఉంది. ఆదాయం పెంచే చర్యలు లేకుండా సంపద నాశనం చేసే చర్యలు చేపట్టారు. పెట్టుబడులు వచ్చే వాతావరణాన్ని విచ్ఛిన్నం చేశారు. 4).అభివృద్ది వికేంద్రీకరణలో ఒక భాగమే అమరావతి..రాజధానితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ 13జిల్లాల అభివృద్ది ప్రణాళికను 04.09.2019న అప్పటి సీఎంగా చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు, చాలావరకు చేసి చూపించారు. ‘‘అభివృద్ది వికేంద్రీకరణ-రాజధానిగా అమరావతి’’ అనే శీర్షికతో చంద్రబాబు చేసిన ప్రకటన అసెంబ్లీ రికార్డులలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఒక సెటిల్డ్ ఇస్యూ...4ఏళ్లుగా సజావుగా నిర్వహిస్తున్న అంశం. సీఎం మారాడని మళ్లీ రాజధానిని మార్చే అధికారం ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు 650కూడా, 29రాష్ట్రాలలో 650జిల్లాలలో పెట్టమని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారా..? అదేవిధంగా ఏపిలో 175నియోజకవర్గాలలో 175ఆఫీసులు పెడతారా నియోజకవర్గానికి ఒకటి చొప్పున..? ఈ 8నెలలు ఒక్క పనిచేయకుండా, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, పనులన్నీ నిలిపేసి అభివృద్దిని రివర్స్ చేశారు, పరిపాలనను రివర్స్ చేశారు, రాష్ట్రాన్నే తిరోగమనంలో నడిపిస్తున్నారు. అబద్దాన్ని కూడా నిజంగా వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. అలాంటిది నిజాన్ని నిజంగా చెప్పడంలో వెనుకంజ సరికాదు.

5).అమరావతిని 3ముక్కలు చేసి ఒక్కో ముక్క ఒక్కో ప్రాంతంలో పెట్టడమే ముద్దు అంటూ ర్యాలీలు నిర్వహిస్తున్న అమరావతి నుంచి ఎన్నికైన వైసిపి ఎమ్మెల్యేలు రేపు అడ్రస్ లేకుండా పోతారు. రాజధాని మార్పుపై ఆందోళనకు గురై తీవ్ర ఆవేదనతో 23మంది గుండెలు ఆగాయి. వాళ్ల ఉసురు వైసిపి నేతలకే తగులుతుంది. గత 33రోజులుగా దీక్షలు,ధర్నాలు,ర్యాలీలతో ఆందోళనలు చేస్తున్నా, పండుగలు కూడా చేసుకోకుండా పస్తులు ఉంటున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించకుండా మూర్ఖంగా పోతున్నారు’’ అంటూ చర్చలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పిఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్, టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, టిడిఎల్ పి ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, గౌరివాని శ్రీనివాసులు, ఎంపి కనకమేడల రవీంద్రకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read