స్థానిక ఎన్నికల పోరులో అధికార వైసీపీ ఎలా రేచ్చిపోయిందో అందరూ చూసారు. విపక్షాలు అన్నీ, గవర్నర్ కు, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకమిషనర్ రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో పాటు తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరడం సంచలనాన్ని రేకెత్తించింది. ఈ అంశాన్ని అధికార పార్టీ తమకనుకూలంగా మార్చుకునేందుకు బూటకమంటూ ప్రచారానికి తెరతీయగా.. ఇది వాస్తవమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటన వైకాపాకు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తమకనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమవు తూనే, ఏకగ్రీవాలపై న్యాయపోరాటానికి సన్నాహాలు ప్రారంభించింది. గత స్థానిక ఎన్నికల్లో రెండు శాతం మాత్రమే ఉన్న ఏకగ్రీవాలు, ఇప్పుడు 24 శాతానికి చేరడంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఈసీ లేఖను ఉదాహరణగా చూపుతూ న్యాయస్థానాలను ఆశ్రయించింది. మరోవైపు అధికార పక్షం దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాలు చింపివేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఆధారాలను కోర్టులో అందజేసి, ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని పోరాటానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ప్రజాక్షేత్రంలో అధికార పక్షాన్ని దోషిగా నిలబెట్టేందుకు తన వంతు ప్రయత్నాలను సాగిస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న ఆగడాలను, అప్రజాస్వామిక పోకడలపై తెదేపా ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి తనకు భద్రత కల్పించాలని కోరుతూ లేఖ రాయడాన్ని అస్త్రంగా మలుచుకుని ముందుక వెళ్తుంది. ఈసీ లేఖను ఆసరాగా చేసుకున్న తెలుగుదేశం పార్టీ సాక్షాత్తూ ఎన్నికలకమిషనర్ కే రక్షణ లేనప్పుడు విపక్ష పార్టీలు, ప్రజల పరిస్థితేంటని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. అయితే, దీన్ని తిప్పికొట్టేందుకు అధికార వైకాపా అసలు ఎన్నికల కమిషనర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదని, ఇదంతా టీడీపీ పన్నిన కుట్ర అంటూ డీజీపీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఎన్నికల కమిషనర్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, అందుకే ఇలాంటి కుట్రకు తెర తీశారని ఆరోపణలు గుప్పించాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ నీరజ్ కుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు వివరణగా ఈసీనే లేఖ రాశారని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం దీన్ని ఒక బూటకంగా ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేసింది. తాజాగా శుక్రవారం స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఈసీ లేఖ రాసింది వాస్తవమేనని, అందుకే ఆయనకు భద్రత కల్పించడం జరిగిందని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపగా.. అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మరింత దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంశాఖ సహాయ మంత్రి ప్రకటన చేసిన వెంటనే ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అధికార పక్షాన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈసీ రాసిన లేఖను అస్త్రంగా చేసుకుని, ఏకగ్రీవాలపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించడంతోపాటు ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలనే డిమాండ్ తెరపైకి తీసుకువస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read