గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లను బీజేపీతో కలిపి టీడీపీ గెలుచుకుంది. వైసీపీకి ఒక్కటీ దక్కలేదు. ఈసారి అలాంటి పరిస్థితి టీడీపీకి ఏకంగా నాలుగు జిల్లాల్లో ఎదురైంది. కర్నూలు, విజయనగరం, నెల్లూరు, కడప జిల్లాల్లో మొత్తం సీట్లను వైసీపీ స్వీప్‌ చేసింది. పోయినసారి కడప జిల్లాలో ఒక సీటు టీడీపీ గెలుచుకోగలిగింది. ఈసారి అది కూడా రాలేదు. ఇక... చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయన మినహా టీడీపీ అభ్యర్థులెవరూ గెలవలేకపోయారు. తెలుగుదేశంలో ఉన్న నిర్లిప్తత కొంపముంచగా, కసిగా పని చేసిన వైసీపీకి గెలుపు దక్కింది. ‘చంద్రబాబును ఇప్పటికే పలుమార్లు సీఎంగా చూశాం. జగన్‌కూ ఒక్కసారి అవకాశం ఇద్దాం’ అనే జనం వైఖరితోపాటు... అనేక స్వీయ తప్పిదాలు తెలుగుదేశాన్ని దెబ్బతీశాయి. అధినేతగా, పాలనా సారథిగా చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఎంత కష్టపడినా, టీడీపీ ఘోర పరాజయం పొందింది.

cbn tdp 24052019

టీడీపీ ఎమ్మెల్యేల్లో, ప్రజలకి ఉన్న వ్యతిరేకత మరో కారణం. 40 మంది సిట్టింగ్లను మారుస్తా అన్నారే కాని, చంద్రబాబు ఆ పని చెయ్యలేక పోయారు. చంద్రబాబు చేసిన సంక్షేమం, అభివృద్ధి, పడిన కష్టంపై ప్రేమ ఉన్నా... స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి, ఈర్ష్య, అసూయలే ప్రభావం చూపించాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు రెచ్చిపోతుండగా... వారి అనుచరులు మరింత చెలరేగిపోయారు. తొలినాళ్లలో ‘జన్మభూమి కమిటీల’ పేరి సాగిన దందా అంతా ఇంతాకాదు. పసుపు-కుంకుమలాంటి కీలక పథకాలను జనంలోకి బాగానే తీసుకెళ్లినా... ఒక్క విషయంలో మాత్రం తెలుగుదేశం తప్పిదం చేసింది. మహిళలకు వడ్డీలేని రుణాలను గతంలో ప్రభుత్వాలు ఇచ్చేవని, చంద్రబాబు ఆ పథకాన్ని ఎత్తేసి... అందులో కొంత డబ్బును పసుపు-కుంకుమ కింద ఇచ్చారని జగన్‌ పదే పదే ప్రచారం చేశారు. దీన్ని టీడీపీ తిప్పికొట్టలేకపోయింది. ఇలా అనేక చోట్ల జగన్ చేసిన తప్పుడు ప్రచారాన్ని, తిప్పి కొట్టటంలో తెలుగుదేశం పూర్తిగా ఫెయిల్ అయ్యింది.

cbn tdp 24052019

ఇక చివరి నిమిషంలో చేసే పోల్‌ మేనేజ్‌మెంట్‌ లో కూడా తెలుగుదేశం వైఫ్యలం పూర్తిగా కనిపించింది. వైసీపీ అద్భుతమైన పోల్‌మేనేజ్‌మెంట్‌ చేసిందని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. టీడీపీకి సంప్రదాయంగా ఆర్థిక సహకారం అందించే వర్గాలన్నింటినీ కేంద్రం కట్టడి చేసింది. అటు పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా డబ్బు వచ్చే మార్గాలు మూసుకుపోయాయి. ఇచ్చే వాళ్లున్నప్పటికీ... తెచ్చే దారి కనిపించకుండా పోయింది. మరో పక్క వైసీపీకి మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇక, టీడీపీ గెలిచి తీరాలన్న కసి ఆ పార్టీ కార్యకర్తలో 2014లో కనిపించినంతగా ఈసారి కనిపించలేదు. అతి విశ్వాసమో, అన్నీ చంద్రబాబు చూసుకుంటాడన్న ధీమానో, అధికారంవల్ల వచ్చిన అలసత్వమో... కారణం ఏదైనా కావొచ్చు! గత ఎన్నికల్లో చావో రేవో అని తెగించి పనిచేసినవారు... ఈసారి తమవరకు తాము ఓటేస్తే చాలు అనుకునే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు ఈసారి చావో రేవో అన్న కసితో పనిచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read