కరోనా సంక్షోభం దృష్ట్యా ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో సామాన్యులకు కాస్త ఊరటనిచ్చేలా కీలక చర్యలు చేపట్టింది రిజర్వు బ్యాంకు. టెర్మ్​ లోన్స్​ నెలవారీ వాయిదాల చెల్లింపుపై 3 నెలల మారటోరియం విధించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చింది. అంటే మూడు నెలల పాటు, ఈఎంఐ వాయిదా వేసుకోవచ్చు. వర్కింగ్ కేపిటల్​పై వడ్డీ చెల్లింపు ఆలస్యమైనా రుణ ఎగవేతగా పరిగణించరాదని సూచించింది. చెల్లింపుల్లో జాప్యం రుణగ్రహీత క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది.కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన చేశారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తీసుకుంటున్న మరిన్ని చర్యల్ని వెల్లడించారు.

ఇక మరో పక్క, కీలక వడ్డీ రేటును ఒకేసారి 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. రివర్స్​ రెపో రేటు 90 బేసిస్ పాయింట్ల క్షీణతతో 4 శాతానికి చేరింది.కరోనా విజృంభణ, దేశవ్యాప్తంగా లాక్​డౌన్ వంటి పరిస్థితుల మధ్య ఈ అసాధారణ నిర్ణయాలను ప్రకటించారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్. మరికొద్ది రోజుల్లో జరగాల్సిన ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశాన్ని ఈనెల 25, 26, 27 తేదీల్లో ముందుగానే నిర్వహించినట్లు తెలిపారు. రెపో రేటు తగ్గింపు సహా ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడతామని భరోసా ఇచ్చారు శక్తికాంత దాస్.

కరోనా సంక్షోభం... ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. 2019లో దశాబ్దపు కనిష్ఠానికి ప్రపంచ వృద్ధి రేటు పతనం కావడాన్ని గుర్తుచేశారు. 2020లో వృద్ధి కొంతైనా పుంజుకుంటుందన్న ఆశలు ఇప్పుడు ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి తీవ్రత, వేగం, ఎంత కాలం ఈ మహమ్మారి కొనసాగుతుందన్న అంశాలపైనే ప్రపంచ ఆర్థిక భవిత ఆధారపడి ఉంటుందని విశ్లేషించారు ఆర్​బీఐ గవర్నర్. ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయే ప్రమాదముందని అంచనా వేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read