`ముఖ్యమంత్రి గతవారం రోజులనుంచీ గందరగోళంలో, కంగారుగా ఉన్నారని, ఆయన జాతకం తిరగబడబోతోందని, టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సెర్బియాలో జూలై 30న అరెస్ట్ అయిన ఏ3 నిమ్మగడ్డ ప్రసాద్, గతంలో వ్యాపార పనుల నిమిత్తం దుబాయ్ వెళ్లాలని సీబీఐని కోర్టుని కోరడంతో వారు అనుమతించారు. వ్యాపార పనులపేరుతో విహారయాత్రకు వెళ్లిన నిమ్మగడ్డను సెర్బియాలో అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిసి వ్యాపారం చేస్తామని యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా కంపెనీ, వాన్ పిక్ పేరుతో పోర్టుల నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. రస్ అల్ ఖైమా 51శాతం పెట్టుబడి పెడితే, మిగిలినవాటా నిమ్మగడ్డ, అతని బృందం పెట్టడం జరిగిందన్నారు. వాన్ పిక్ కు ఆనాటి వై.ఎస్ ప్రభుత్వం 28వేల ఎకరాలను అతితక్కువధరకే కేటాయించగా, రస్ అల్ ఖైమా పెట్టుబడులు పెట్టడం జరిగిందన్నారు. రస్ అల్ ఖైమా పెట్టుబడులను దుర్వినియోగంచేసిన నిమ్మగడ్డ ప్రసాద్, లేనికంపెనీలను ఉన్నట్లుగా సృష్టించి, రూ.854కోట్ల వరకు జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇతరకంపెనీల్లోకి మళ్లించడం జరిగిందన్నారు. ఈనేపథ్యంలో జగన్ ను, ఏ2 విజయసాయిరెడ్డిని, ఏ3 నిమ్మగడ్డను అరెస్ట్ చేయడం జరిగిందని, తరువాత కండీషన్ బెయిల్ పై వారిని విడుదల చేసిందన్నారు.

అలా బెయిల్ పై వచ్చిన నిమ్మగడ్డను రెడ్ కార్నర్ నోటీసును ఆధారంగా చేసుకొని సెర్బియాలో అరెస్ట్ చేసినట్లు వర్ల తెలిపారు. అక్కడ అరెస్ట్ అయిన నిమ్మగడ్డ, తన వాంగ్మూలంలో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడని, గడచిన 7నెలల నుంచి సెర్బియా వీధుల్లోనే తిరుగుతున్నాడన్నారు. ఈ వ్యవహారంపై రస్ అల్ ఖైమా వారు భారత ప్రభుత్వానికి ఒక లేఖరాశారని, ఆ లేఖలో నిమ్మగడ్డ తమవద్ద కాజేసిన సొమ్ముని, జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లుగా చెబుతున్నాడని, నిమ్మగడ్డ చెప్పిన సదరు వ్యక్తిని ‘మీరు అరెస్ట్ చేసి, మాకు అప్పగిస్తారా...లేక ఆ వ్యక్తి నుంచి మాకు రావాల్సిన సొమ్ముని మాకు ఇప్పిస్తారా’ అని లేఖలో కోరడం జరిగిందన్నారు. రస్ అల్ ఖైమా లేఖ రాయడంతో జగన్ బృందం గంగవెర్రులెత్తిపోయిందని, ఆ వెంటనే ముఖ్యమంత్రి తనను తాను రక్షించుకోవడానికి ఢిల్లీకి పరుగులు పెట్టాడన్నారు. తనను రస్ అల్ ఖైమాకు అప్పగించవద్దని వేడుకుంటూ, జగన్మోహన్ రెడ్డి, ప్రధానిమోదీని శరణుజొచ్చాడన్నారు. ఇదంతా నిజమో.. కాదో జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలని, ఇంకా ప్రజల్ని మభ్యపెడుతూ, దాగుడుమూతలు ఆడుతామంటే కుదరదని వర్ల తేల్చిచెప్పారు. తనను రస్ అల్ ఖైమా బారినుంచి బయటపడేయాలని కోరుతూ, ప్రధానితో, హోంమంత్రితో జగన్మమోహన్ రెడ్డితో భేటీలు జరిపింది వాస్తవమో... కాదో ఆయనే చెప్పాలన్నారు.

రస్ అల్ ఖైమా దేశానికి, మనదేశానికి మధ్యన జగన్ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉత్సుకత రాష్ట్ర ప్రజలందరిలోనూ ఉందన్నారు. సెర్బియాలో అరెస్ట్ కాబడిన నిమ్మగడ్డను విడిపించడం కోసం, వైసీపీకి చెందిన 22మంది ఎంపీలు మూకుమ్మడిగా వెళ్లి, కేంద్ర విదేశాంగశాఖా మంత్రి జైశంకర్ ను కలిసి మొరపెట్టుకున్నది నిజం కాదా అని వర్ల ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు తనను కలిసి వెళ్లాక, జైశంకర్, జగన్ అవినీతి చరిత్రను తెలుసుకొని అవాక్కయ్యారని, వెంటనే వైసీపీ ఎంపీలు ఇచ్చిన విజ్ఞప్తిని పక్కన పెట్టేశారని వర్ల తెలిపారు. రస్ అల్ ఖైమా బారినుంచి ముఖ్యమంత్రి జగన్ బయటపడాలంటే, నిమ్మగడ్డ తన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన రూ.854కోట్లు తిరిగిచ్చేయడం తప్ప మరోమార్గం లేదని, ఏపీ ప్రజానీకమంతా భావిస్తోందని, జగన్ భవిష్యత్ ని గురించి, రాష్ట్ర భవిష్యత్ ను గురించి తలుచుకొని రాష్ట్ర ప్రజానీకమంతా కంగారు పడుతోందని, వారి సందేహాలను, ఆందోళనను నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉందన్నారు. తనకేమీ సంబంధంలేకపోతే జగన్మోహన్ రెడ్డి, బయటకు వచ్చి నిమ్మగడ్డ అంశంపై, రస్ అల్ ఖైమా లేఖపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

నిమ్మగడ్డ అరెస్ట్ అయింది మొదలు, ఇప్పటివరకు జరిగిన అన్ని అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయింది మామూలు కేసులో కాదని, ఆయన ఆర్థిక నేరాల గురించి న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇప్పటికే అనేకమార్లు వ్యాఖ్యానాలు చేయడం జరిగిందన్నారు. జగన్ బెయిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించినప్పుడు, నాటి న్యాయమూర్తి జస్టిస్ సదాశివం మాట్లాడుతూ, క్షణికోద్రేకంలో చేసే హత్యలు, ఖూనీల కంటే ఆర్థికనేరాలు అత్యంత ప్రమాదకరమైనవని, ఆర్థిక నేరాలు చేసినవారిని వదిలేస్తే సమాజ మనుగడకే హానిచేస్తారన్నది నిజం కాదా అని రామయ్య నిలదీశారు. తనపై ఉన్న కేసులభయంతోనే జగన్ కోర్టుల విచారరణకు హాజరవకుండా భయపడుతున్నాడన్నారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని, హోంమంత్రిని కలిసిన జగన్ , తరువాత కేంద్రమంత్రి జైశంకర్ ను కలవాలని భావించి, విజయసాయి వద్దనడంతో వెనక్కు తగ్గింది నిజం కాదా అని రామయ్య ప్రశ్నించారు. ఈ దేశానికిచెందిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వేరేదేశం వారు అరెస్ట్ చేస్తే, ఏపీ ప్రజలకు ఎంతటి అవమానమో జగనే ఆలోచించాలన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అంశం అన్ని ప్రతికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయని, అన్నింట్లో జగన్ పేరుని ఉటంకించారని, అటువంటప్పుడు దానిపై వివరణ ఇవ్వాల్సిన బాద్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read