ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో గేట్లాట జరుగుతోంది. సెక్రటేరియట్ నిర్మాణం మొదలు ఇప్పటి వరకు వాస్తు పేరుతో, భద్రతా కారణాల పేరుతో గేట్ల నిర్మాణం, మూత జరుగుతోంది. నెలన్నర క్రితమే వాస్తు పేరుతో మూడు గేట్లను మూసేసిన అధికారులు.. తాజాగా సచివాలయంలో ప్రధాన ద్వారాన్ని బుధవారం బంద్ చేసేశారు. అసెంబ్లీ గేటు -2ను కూడా మూసేశారు. ఆ రెండు గేట్లకు అడ్డంగా సిమెంట్ ఇటుకలతో శరవేగంగా గోడ నిర్మాణాన్ని చేపట్టారు. సచివాలయం, శాసనసభ అధికారులు, ఉద్యోగులు ఉదయం విధులకు వెళ్లే సమయంలో యథావిధిగానే ఉన్న ద్వారాలు ఆ తర్వాత కొద్ది సేపటికే మూతపడ్డాయి. విధులు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళ్లే సమయంలో గేట్లకు అడ్డంగా ఇటుకలతో గోడలు నిర్మిస్తుండటాన్ని చూసిన అధికారులు, ఉద్యోగులు ఇదేం చిత్రమబ్బా అంటూ విస్తుపోయారు. వెలగపూడి సచివాలయం వాస్తు బాగోలేదని ఇటీవలే మూడు గేట్లను అధికారులు మూసేశారు. రెండు గేట్లకు ఏకంగా అడ్డుగా గోడ నిర్మాణం చేపట్టగా, ఒక గేటును పూర్తిగా వినియోగించడం మానేశారు. ఇప్పటి వరకు సచివాలయంలోకి వెళ్లేందుకు వైఎస్ జగన్ వినియోగించే గేటునే పూర్తిగా మూసేశారు.

శాసనసభకు వెళ్లే సమయంలో జగన్ ఉపయోగించే గేటును మూసేసిన అధికారులు, దానికి అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అటు సచివాలయానికి, ఇటు అసెంబ్లీకి ఒక్కో గేటు మాత్రమే మిగిలాయి. అసెంబ్లీ, సచివాలయం మధ్యన అంతర్గతంగా ఉన్న గేటును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిని విశాఖపట్నం తరలించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉండగా, రెండు రోజుల క్రితం కొడాలి నాని శాసనరాజధాని కూడా ఎందుకంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించగా, మరుసటి రోజునే సచివాలయం, అసెంబ్లీ గేట్లకు అడ్డంగా గోడల నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. జగన్ రాజధాని మొత్తాన్ని విశాఖ తరలించేందుకే కుట్ర పన్నుతున్నారని, ఆ పన్నాగంలో భాగంగానే గేట్లాటకు తెరలేపారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యానే గేట్లను మూస్తున్నట్లు సీనియర్ అధికారులు చెబుతుండగా, సచివాలయానికి వాస్తు దోషం ఉందని, అందుకే గేట్లను మూసేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.

సచివాలయం, అసెంబ్లీ గేట్లను మూసేయడం వెనుక అమరావతి ఉద్యమం సెగ ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత నుంచి ఆ ప్రాంత రైతులు ఉద్యమం ప్రారంభించారు. జనవరిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజధాని పరిరక్షణ సమితి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఆ సమయంలో రైతులు, మహిళలు, రాజకీయ నాయకులు సీఎం బ్లాక్ కు వెళ్లే గేటు నంబరు వన్ వరకు చొచ్చుకొచ్చారు. ఆ ఘటనపై సాక్షాత్తు ఏపీ డీజీపీ సైతం సీరియస్ అయ్యారు. ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళలను అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారు. వారిని అడ్డుకునే మార్గాలు లేకపోవడంతో పోలీసులు ప్రభుత్వ పెద్దలు, అధికారుల తిట్లు తినాల్సి వచ్చింది. సచివాలయం ఐదు గేట్లలో నాలుగింటిని మూసేయడంతో అందరూ ఒకే గేటు నుంచి లోపలకు ప్రవేశించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర వీవీఐపీలు సెక్రటేరియటకు వచ్చి వెళ్లే సమయంలో విజిటర్స్ తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read