విజయవాడలో ఓ యువకునికి కరోనా పాజిటివ్​గా ఉన్నట్లు కలెక్టర్​ ఇంతియాజ్​ అహ్మద్​ తెలిపారు. అతన్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. యువకుని ఇంటి చుట్టుపక్కల సర్వే చేసినట్లు పేర్కొన్నారు. స్థానికులకు వైరస్​ సోకకుండా అప్రమత్తంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో విదేశాల నుంచి వచ్చిన ఒక యువకుడికి కరోనా పాజిటివ్​ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు కలెక్టర్ ఇంతియాజ్​ అహ్మద్​ ప్రకటన చేశారు. ఈనెల 17, 18న హోమ్​ ఐసోలేషన్​లో ఉన్న యువకుడు.. జ్వరం రావడం వల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు కలెక్టర్​ తెలిపారు. నమూనాలను పరీక్షలకు పంపగా.. కరోనా ఉన్నట్లు తేలిందని చెప్పారు. యువకుని ఇంటి చుట్టుపక్కల 500 ఇళ్లల్లో సర్వే చేసినట్లు పేర్కొన్నారు. స్థానికులకు వైరస్​ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ 3 రోజుల్లో యువకుడు, అతని కుటుంబ సభ్యులు ఎవరెవరితో మాట్లాడారో ఆరా తీస్తున్నామని కలెక్టర్​ తెలిపారు. యువకుడు హైదరాబాద్​ నుంచి వచ్చిన క్యాబ్​ గురించి కూడా ఆరా తీస్తున్నామని అన్నారు.

కరోనాపై ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే కంట్రోల్​ రూం నెంబర్​ 79952 44260కు సమాచారం ఇవ్వాలని సూచించారు. విజయవాడలో యువకునికి కరోనా పాజిటివ్​గా తేలిన నేపథ్యంలో ఏప్రిల్​ 14 వరకు 144 సెక్షన్​ అమలు చేయనున్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రేపటి నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. జనతా కర్ఫ్యూను మూడు రోజులు అమలు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. పారిస్​ నుంచి వచ్చిన యువకునికి కరోనా వచ్చిందన్న ఆయన.. కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నామని చెబుతున్నా వారికి పరీక్షలు అవసరమని అన్నారు. మనకు మనం స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలని సీపీ తెలిపారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నివారణకు అందరూ సహకరించాలని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించాలని.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చినవారికే ఎక్కువగా వైరస్​ లక్షణాలు ఉన్నాయన్న ఆయన.. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read