రాష్ట్ర బీజేపీలో అభ్యర్థుల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం తలమునకలైంది. ఆశావహుల దరఖాస్తులు స్వీకరించి వాటిని అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తోంది. ఆర్థిక బలంతోపాటు జిల్లా నాయకత్వం అభిప్రాయాన్ని తీసుకొంటోంది. సగం పార్లమెంటు స్థానాల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే జాబి తా ప్రకటించాలనుకున్నా.. వైసీపీ అభ్యర్థుల జాబితా వాయిదా పడటం ఒక కారణంగా తెలుస్తోంది. గురువారం ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌ్‌సలో జరిగిన రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశంలో జాబితాపై చర్చ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట నుంచి లోక్‌సభ బరిలో దిగుతుండగా.. మాజీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు పార్టీలోనే పోటీ ఎదుర్కొంటున్నారు.

jagan kcr 15032019

ఆ స్థానాన్ని తనకు కేటాయించాలని పురందేశ్వరి పట్టుబడుతుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. గతంలో విశాఖ ఎంపీ గా కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన పురందేశ్వరి యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరిన ఆమె 2014 ఎన్నికల్లో రాజంపేట నుంచి కమలం గుర్తుపై పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆమె విశాఖ నుంచి బరిలో దిగుతాననడంతో రాష్ట్ర నాయకత్వం ఆ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టింది. విజయనగరం నుంచి సన్యాసిరాజు, అరకు నుంచి మాజీ ఎమ్మెల్యే డి.సత్యనారాయణ రెడ్డి, రాజమండ్రి నుంచి గోపీనాథ్‌ దాస్‌(ఇస్కాన్‌) అభ్యర్థిత్వాలను దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. నరసాపురం సిట్టింగ్‌ స్థానం నుంచి గోకరాజు గంగరాజు బరిలో ఉంటారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా మరోవైపు సినీనటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పేరు బలంగా వినిపిస్తోంది. ఏలూరులో కావూరి సాంబశివరావు పోటీపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

jagan kcr 15032019

విజయవాడ నుంచి కిలారు దిలీప్‌, మచిలీపట్నం నుంచి గుడివాక అంజిబాబు, గుంటూరు నుంచి పారిశ్రామికవేత్త వల్లూరి జయప్రకాశ్‌, ఒంగోలు నుంచి ఓ ప్రవాసాంధ్రుడు, కర్నూలులో పార్థ డెంటల్‌ అధినేత పార్థసారథిరెడ్డి, హిందూపురం నుంచి కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కడప నుంచి కందుల రాజమోహన్‌రెడ్డి, రాజంపేట నుంచి వై.సత్యకుమార్‌ (వెంకయ్య నాయుడు మాజీ ఓఎస్ డీ) పేర్లు ఫైనల్‌ కాగా తిరుపతిలో ప్రవాసాంధ్రుడు సునీల్‌ ఇస్కా పోటీకి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, నంద్యాల, అమలాపురం, అనకాపల్లి, శ్రీకాకుళం స్థానాలపై కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహికుల్లో 50మంది పేర్లు ఫైనల్‌ అయినట్లు తెలిసింది. మరో 125 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. కాగా అభ్యర్థుల జాబితా తీసుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం రాత్రి లేదా శనివారం అభ్యర్థుల పేర్లు వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది.

 

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read