పేదలు ఇంత జాగా అడిగితే కాల్చి చంపేస్తారా? నియంతలు పాలించే చోట కూడా అంత కర్కశత్వం ఉండదేమో! కానీ బలహీనుడి పక్షం అంటూ గొప్పలు చెప్పిన వైఎస్ జమానాలో పేదలకు, వారి ప్రాణాలకు గడ్డిపరకంత విలువ కూడా ఇవ్వకుండా అత్యంత పాశవికంగా జరిపిన దమనకాండ.. ముదిగొండ ఉదంతం. ఉవ్వెత్తున చిమ్మిన బడుగుల నెత్తుటి ధారలతో ఆ గ్రామం నిలువెల్లా వణికిపోయింది. తీవ్రవాదులు, దోపిడీ దొంగలు, కరడు గట్టిన నేరగాళ్లను సైతం అంత దారుణంగా చంపరేమో! అలాంటిది సామాన్యులపై తుపాకీ గుళ్ల వర్షం కురిసింది. పరుగులెత్తించి ఏడుగురి నిండు ప్రాణాలు తీశారు. 20 మందిని క్షతగాత్రులను చేశారు. వైఎస్ పాలన కాలంలో అత్యంత పాశవికంగా జరిపిన దాడుల ఉదంతాల్లో రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేని దారుణమది. ఆనాడు జరిగింది అక్షరాలా మారణహోమం. ప్రజాస్వామ్య విలువలకు పాతరేసిన వైనం. ఏ ప్రజల దయాదాక్షిణ్యాలతో గద్దెనెక్కారో.. వారిని కన్నబిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి, సమస్యలను విన్నవిస్తే.. నిర్దాక్షిణ్యంగా మారణకాండ జరిపించడాన్ని ఏమనాలి? ఏ రాచరికంలోనూ, నియంత పాలనలోనూ కనిపించని దౌర్జన్యకాండ అది
28 జులై 2007.. వైఎస్ పాలనలో మానవ హక్కులను కాలరాసిన రోజు. ముదిగొండలో సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా చేసిన వైనం.. నాటి సంఘటనలో ఇప్పటికీ పేదలు బలిపశువులు... కాల్పులు జరిపిన పోలీసులపై కేసులు లేవు. పైగా వాళ్లకు పదోన్నతులు దక్కాయి. బాధితులను మాత్రం గాలికొదిలేశారు. ఆ రోజును తలచుకోవడానికి పేదల కళ్లలో నీళ్లు కూడా ఇంకిపోయాయి. తిరగని కార్యాలయాలు లేవు, అడగని నేతలు లేరు, చెప్పుకోని మంత్రులు లేరు. పల్లె నీడన ప్రశాంతంగా ఉన్న ఆ కుటుంబాలు చెదిరిపోయాయి. తలోదిక్కు ఉపాధికి వెళ్లాల్సి వచ్చింది.. ఎన్నో ఒత్తిళ్లతో ప్రభుత్వోద్యోగం ఇచ్చినా ఆ కుటుంబాల ఆలనా పాలనా చూసే దిక్కే లేకుండా పోయింది. పిల్లల చదువులు భారంగా మారాయి. బాధాకరం ఏమిటంటే.. ఏ ఇంటిజాగాకు వెళితే తుపాకీ తూటాలు ప్రాణాలు తీసాయో ఇంకా ఆ జాగాను బాధితులకు ఇవ్వలేకపోవడం.
ఆ రోజేం జరిగింది?
పేదలు ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరిని అడుగుతారు? వాళ్ల కోసమే కదా ప్రభుత్వం ఉంది. ఇళ్ల స్థలం అడిగితే కాల్పులకు దిగిన సంఘటనలు ఎక్కడా లేవు. వైఎస్ జమానాలో మాత్రం ఖమ్మం జిల్లా ముదిగొండలో ధర్నా చేసిన ప్రజలను పాశవికంగా అణచివేశారు. ఆరోజు సామాన్య ప్రజలు సీపీఎం ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. జనం బాగా వచ్చారు. మధ్యాహ్నం వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఎండ పెరిగింది. చిన్నారులు, వృద్ధులు విలవిల్లాడిపోయారు. ప్రజల్లో అసహనం.. పోలీసులతో బలప్రయోగానికి అంతా సిద్ధమయింది. ముదిగొండకు చెందిన బండి రమేష్, మరికొందరిని ధర్నా నుంచి పక్కకు లాగడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో ప్రజలు ఎదురు తిరిగారు. పోలీసులు లాఠీఛార్జి చేయడానికి సిద్ధం కావడంతో కంకర రాళ్లను రువ్వారు. అంతే.. ముందస్తు హెచ్చరికలు లేవు.. చెదరగొట్టే ప్రయత్నమూ లేదు.. ఒక్కసారిగా మూడువైపులా కాల్పులు జరపడంతో తుపాకీ తూటాలు పేదల గుండెలను చీల్చుకుంటూ వెళ్లాయి. అరగంట పాటు తుపాకీ గర్జనలు ఆ పల్లెను భయకంపితులను చేశాయి. వందల మంది చెల్లాచెదురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. ఆసుపత్రిలో మరో నలుగురు మృతి చెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన, చనిపోయిన వారిని ఆటోల్లో ప్రజలే ఆసుపత్రికి తరలించాల్సిన దుస్థితి.. కొందరు పోలీసులకూ గాయాలయ్యాయి. కాల్పుల్లో కత్తుల పెద్దలక్ష్మి, యలగందుల వీరన్న, బంకా గోపయ్య, ఉసికల గోపయ్య, పసుపులేటి కుటుంబరావు, చిట్టూరి బాబురావు, జంగం బాలస్వామిలు ప్రాణాలు కోల్పోయారు.
కాల్పుల తరువాత కూడా!
ఐదెకరాల వ్యవసాయభూమి, రూ. 10 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం, ఇళ్లు నిర్మించి ఇవ్వడం, కాల్పులు జరిపిన పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టడం - ఇవీ బాధిత కుటుంబాల డిమాండ్. తిరిగి తేలేని విలువైన తమ వారి ప్రాణాలను కోల్పోయిన అభాగ్యులకు కనీసం వారు అడిగినవైనా ఇవ్వలేకపోయింది సర్కారు. రూ. 6 లక్షల వరకు పరిహారం రెండు విడతలుగా ఇచ్చారు. వ్యవసాయభూమి రెండెకరాలు మాత్రమే అదీ దూరంగా ఇచ్చారు. కాల్పులకు కారణమైన పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తే... కేవలం ఏఎస్పీ రమేష్‌బాబు, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డిలను సస్పెండ్ చేశారంతే. తరువాత వాళ్లకు పదోన్నతులు కూడా దక్కాయి. కానీ గాయపడిన వారు వికలాంగులైనా ఎలాంటి సాయం అందించలేకపోయారు. వైద్య బిల్లులు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంగా ప్రకటించారు. అదీ కొంతమందికే. మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పినా ఎలాంటి సాయం చేయలేదు. సొంతంగానే చికిత్స చేయించుకున్నారు. ముదిగొండ కాల్పుల సంఘటన జరిగినపుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ గానీ, ఆ తర్వాత వచ్చిన సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు గానీ క్షతగాత్రులందరికీ పూర్తిస్థాయిలో సాయం చేయడానికి ప్రయత్నించలేదు.
కొడుకు ఉండడానికి వేల ఎకరాలు దోచిపెట్టి, పేద ప్రజలు నిలువ నీడ కోసం కొంచెం భూమిని అడిగితే తుపాకులతో కాల్చి చంపిన రాజన్న రాజ్యం పేరు చెప్పుకొని అవినీతి రాజ్యం ఏలాలని కలలు కంటున్నాడు జగన్... ఒక్కసారి ఆ అమాయకుల నెత్తురు మరకలను, గుండెలలో దిగిన తూటాలను చూసి ఆలోచించండి...
విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ 2002 లో జరిగిన బషీర్ బాగ్ కాల్పుల గురించి ఇప్పటికీ గుర్తు చేసుకొని చంద్రబాబు మీద మండిపడే వామపక్షాలు దీన్నెందుకో మర్చిపోయాయి. బషీర్ బాగ్ కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు, ముదిగొండలో చనిపోయింది ఎనిమిది మంది. అంతే కాదు, చనిపోయిన వారు మహిళలు, అసలు ఉద్యమంతో ఏ మాత్రం సంబంధంలేని వారు, అయినా వామపక్షాలు కిక్కురుమనవు. వారు కార్యకర్తలు కాకపోవటంతో వామపక్షాలు కూడా వారి గురింఛి తలచుకున్న పాపాన పోలేదు. ఏటేటా బషీర్ బాగ్ సంస్మరణ అంటూ సదస్సులు నిర్వహిస్తాయి కానీ, ముదిగొండ గురించి కనీసం తలచుకోరు.