cbn in davos day3 19012017

ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన కోసం, పెట్టుబడులను ఆకర్షించడానికి తన దావోస్ పర్యటన దోహదపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వందలమంది సీఈఓలను ఒకేసారి కలిసే అవకాశం వున్నందునే దావోస్‌కు క్రమంతప్పకుండా వస్తున్నట్టు చెప్పారు. ఇంతమందిని సాధారణంగా కలవాలంటే చాలా సమయం పడుతుందన్నారు. బుధవారం దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సీఐఐ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

ముఖ్యమంత్రి ప్రసంగం సారాంశం :
• ఒకేసారి ఒకే వేదికపై ఇంత మంది పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులను, మేధావులను కలుసుకోవడం, వీరందరితో రాష్ట్రాభివృద్ధి కోసం చర్చించడం ఈ సదస్సు ద్వారా సాధ్యమైంది.
• గతంలో నాకు సైబరాబాద్ నిర్మించిన అనుభవం ఉంది. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కొత్త రాజధానిని నిర్మించే గొప్ప అవకాశం వచ్చింది.
• ఆంధ్రప్రదేశ్‌కు అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. సుదీర్ఘ కోస్తా తీరం, సహజ వనరులు రాష్ట్రం సొంతం.
• ఒక విజన్‌తో పనిచేస్తున్నాం. 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి అత్యున్నత ప్రమాణాలు గల ప్రపంచ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను మలచాలన్నదే మా సంకల్పం.
• సంతోషం, సంపద కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి, మా వృద్ధిలో భాగస్వాములు కండి. మాది కొత్త రాష్ట్రం, యంగ్ స్టేట్, రాష్ట్రాభివృద్ధి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం.
• గత ఏడాది మా వృద్ధి రేటు 10.99% గా ఉంది. సరళీకృత వ్యాపారంలో దేశంలో మొదటి స్థానంలో వున్నాం. మీ సూచనలు, సలహాలు మాకు అవసరం. ఎంటర్ప్రెన్యూర్ షిప్‌పై ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.
• మా నూతన రాజధాని నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను. పెట్టుబడులు పెట్టడమే కాకుండా మంచి ఆలోచనలు మాకు అందించండి. అమరావతి భారతదేశానికి కాకుండా ప్రపంచ నగరంగా ఉండాలన్నదే నా ప్రయత్నం
రాష్ట్రంలో తీసుకొచ్చిన సీఎం కోర్ డాష్ బోర్డ్‌ను రౌండ్ టేబుల్ సమావేశం చివరలో ముఖ్యమంత్రి స్వయంగా అందరికీ పరిచయం చేశారు. దీనిపై ప్రశంసలు జల్లు కురిసింది. ఈ రౌండ్ టేబుల్ వేదికపై సీఐఐ సీఈఓ చంద్రజిత్ బెనర్జీ, ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్సెస్ తదితరులు వున్నారు.

రాష్ట్రంలో వంద విద్యాలయాలు స్థాపిస్తామన్న వేదాంత
ఆంధ్రప్రదేశ్‌లో వంద విద్యాలయాలను నెలకొల్పనున్నట్టు వేదాంత రెసోర్సెస్ ప్రకటించింది. దావోస్‌ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుధవారం కలిసిన వేదాంత రెసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ 'నంద్ ఘర్' పేరుతో ఈ సరికొత్త విద్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఉత్తర భారతంలో విద్యాలయాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్పొరేట్ సామజిక బాధ్యత కింద నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను అనిల్ అగర్వాల్ ముఖ్యమంత్రికి వివరించారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఖనిజ వనరులను వెలికితీసి వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్య పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తన ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. పారిశ్రామికీకరణతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నదే తన ఆలోచనగా చెప్పారు. పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం ద్వారా ఏపీలో నిర్మాణాత్మక మార్పులు సాధించవచ్చని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సైలాన్స్’ ప్రెసిడెంట్ ఫెలిక్స్ మార్కవర్డ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచారు.

ముఖ్యమంత్రితో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ చైర్మన్ భేటీ
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (బ్రిక్స్ బ్యాంక్) చైర్మన్ కేవీ కామత్ ముఖ్యమంత్రిని కలిసారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి గల అవకాశాలను పరిశీలించేందుకు త్వరలో ఒక బృందాన్ని పంపిస్తామని కామత్ తెలిపారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులే కాకుండా చైనీస్ ఫండ్‌ను కూడా సమకూర్చే అవకాశాలున్నాయని అన్నారు. చైనా సాంకేతికతను సైతం అందిస్తామని చెప్పారు. చైనా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సహకరించాలని కామత్‌ను ముఖ్యమంత్రి కోరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్ర్రపదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఇంధన వనరులు, ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిషోర్ తదితరులు వున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read