‘రాష్ట్రంలో రెండున్నరేళ్ల కిందటి కరెంటు కష్టాల గుర్తులు ఇంకా తొలగిపోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంది. మారుమూల గిరిజన తండాల్లోనూ విద్యుత్‌ను అందిస్తూ ‘అందరికీ విద్యుత్’ పథకం అమలులో దేశంలోనే ముందున్నాం. పరిశ్రమలకు కోరినంత విద్యుత్తును అందిస్తున్నాం. పంటలకూ ఏడు గంటలపాటు పగటిపూటే నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం. గతంలో కరెంటు సరఫరా లేకపోవడంతో బోర్లు పనిచేయక నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అవసరమైనప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు 24 గంటలు విద్యుత్తును అందించాం. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో సమర్థవంతమైన యాజమాన్య విధానాలతో విద్యుత్తు పంపిణీ, ప్రసార, ఉత్పత్తి సంస్థలను లాభాలబాట పట్టించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

గతంలో విద్యుత్ కోసం డిస్కంలపై పూర్తిగా ఆధారపడే వారు కాని పెద్ద సంస్థలు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాయి. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహం ఇస్తుండటంతో ప్రైవేటు సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. బయట పవర్ ఎక్సేంజిలోనూ విద్యుత్తు లభిస్తోంది. ఇలాంటి తరుణంలో మిగులు విద్యుత్తును సానుకూలంగా మలుచుకొని ఎప్పటికప్పుడు అంతర్గత సామర్థ్యాలను పెంచుకుంటూ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలు ఒకదానితో మరొకటి పోటీపడుతూ వినియోగదారులకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును అందుబాటు ధరలో అందించేలా కార్యాచరణను రూపొందించండి’ అని ఆయన ఆదేశించారు. ‘ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఈ రంగంలో దాదాపు అన్ని అంశాల్లో దేశంలోనే మనం ముందున్నాం. మరీ ముఖ్యంగా సోలార్, విద్యుత్ పొదుపు అంశాల్లో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ఇక ప్రపంచంతోనే మనం పోటీ పడాలి’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

సులభంగా, సరళ వాణిజ్య విధానాలు అమలుచేస్తూ కోరిన వెంటనే అనుమతులు, భూకేటాయింపులు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందించాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఒక్క నిముషం సైతం అంతరాయం లేకుండా చూడాలని, అప్పుడే పారిశ్రామికాభివృద్ధికి దోహదపడిన వారివౌతామనే విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. 2014 వరకు అధికారికంగా పవర్ హాలీడే ప్రకటించడంతో లక్షలాది చిన్న, మధ్యతరహా యూట్లు మూతపడటంతో అంతేస్థాయిలో కుటుంబాలు వీధినపడిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు ఎంత విముఖత చూపేవారోనంటూ ఆయన గుర్తుచేశారు. నాడు - నేడు పేరిట 2014కు ముందు ఆ తర్వాత విద్యుత్ సరఫరా పరిస్థితులు, ఛార్జీలు, మరీ ముఖ్యంగా 2014కు ముందు ఫ్యూయల్ సర్‌ఛార్జి అడ్జెస్ట్‌మెంట్ (ఎఫ్‌ఎస్‌ఏ) పేరిట ప్రజలపై పెనుభారం మోపిన ఉదంతాలను సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎపి రెగ్యులేటరీ కమిషన్ పబ్లిక్ హియరింగ్స్ సందర్భంగా విద్యుత్ సంస్థల అధికారులు ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read