చీకటి గుహల్లోనించి రైలు వెళ్తుంటే గేన్తులేయాలని, గోల చేయాలని ఆశ పడతారు.. వయ్యారి భామలా ఒంపులు తిరుగుతున్న రైల్వే ట్రాక్ ని కిటికీలో నుంచి చూస్తూ ముఘ్దులవతారు... అందాల అరకులో వలిసె పుల అందాలను, ఉరకలెత్తే జలపాతాలను సందర్శించి సంమోహితులవుతారు... దేశ విదేశాల నుంచి పర్యాటకులు ప్రతి ఏటా శీతాకాలం ఎప్పుడొస్తుందా అని ఎడురు చూస్తుంటారు.

నిత్య అందాలతో తళుకులీనే ఆ కోన ఇప్పుడు మరింత సుందరమైంది... ఆంధ్ర ఊటీ అరకులోయను పొగమంచు మరింత అందంగా మార్చేసింది....ప్రకృతికి పసుపు చీర కట్టినట్టు…బంగారు శోభ సంతరించుకుంది ఆంధ్రా ఊటీ… అరకు.... ఎటు చూసినా అందాలే చూపు తిప్పుకోనివ్వదు... ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా…అంటూ అక్కడే ఉండిపోతూ రోజులు గడిపెయ్యాలి అనిపిస్తుంది.

విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలానికి చెందిన గ్రామం అరకు. అరకు లోయ సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖపట్నానికి 115 కి.మీ.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణానికి నెలవై ఔత్సాహికులను ఆకర్షిస్తోంది. అరకు వెళ్లే ఇరువైపులా దట్టమైన అడవులు ఉండే ఘాట్‌ రోడ్‌ ఆసక్తికరమే కాదు ఆహ్లాదకరం కూడా. దారిలో అనంతగిరి కొండల్లో కాఫీ తోటలు ఉన్నాయి. 29 కి.మీ. దూరంలో ఉన్న బొర్రా గుహలు ఒక ప్రకృతి అద్బుతం. ట్రైబల్‌ మ్యూజియం మరో ఆకర్షణ. తూర్పు కనుమల్లో ఉన్న అరకులో కొన్ని గిరిజన తెగల వారు నివసిస్తున్నారు.

అరకు వెళ్లాలంటే… విశాఖపట్నం నుంచి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. అన్ని ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు వచ్చేటప్పుడు బస్‌ ప్రయాణం మంచిది. వైజాగ్‌లో ఉదయం కిరండొల్‌ వెళ్లే పాసింజర్‌ రైలు ఎక్కాలి. కొత్తవలస-కిరండల్‌లో లైనులో అరకు, అరకు లోయ రెండు స్టేషన్లు వస్తాయి. అది అలా కొండలు, లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఆ అనుభూతి అనుభవించాలే తప్ప మాటల్లో చెప్పలేం.

ప్రయాణంలో సిమిలిగూడ అనే స్టేషన్‌ వస్తుంది. అది భారతదేశంలో అతి ఎత్తులో ఉన్న బ్రాడ్‌ గేజ్‌ స్టేషన్‌. ఇక వెళ్లే దారిలో బొర్రా గుహలు వస్తాయి. అక్కడ దిగి బొర్రా గుహలు చూసుకొని అరుకు వెళ్లవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణంలో చూడవచ్చు. అరుకులో ఉండడానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్‌ హౌసులు, కాటేజీలు ఉంటాయి. వేసవిలొ వెళ్తే వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు.

అరకు టూర్లో ముఖ్యంగా చూడాల్సినవి..
బొర్రా గుహలు - సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితంనాటివని భావిస్తున్నారు.
పద్మాపురం గార్డెన్స్‌ - ఇందులో రోజ్‌ గార్డెన్‌, చెట్లపై ఇండ్లు కూడా ఉన్నాయి. ఈ గుడిసె ఇళ్లను ముందుగా బుక్‌ చేసుకుంటే ఒక రోజు అక్కడ ఉండి తనివితీరా ఆనందించవచ్చు.
ట్రైబల్‌ మ్యూజియం - అరకు లోయ మండలంలో నివసించే వివిధ గిరిజన జాతుల పేర్లు, వారి సాంస్కృతికి సంబంధించిన విశేషాలతో కూడిన బోర్డులు మనకి స్వాగతం పలుకుతాయి.
పుణ్యగిరి ఆలయం - చుట్టూ ఎతె్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ఆ కొండలపై వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి భక్తుల మదిని పులకింపజేస్తుందీ పుణ్యగిరి ఆలయం.
చాపరాయి - ఆకాశం నుంచి గంగ భువికి దూకుతున్నట్లుగా ఈ జలపాతం కిందకు ప్రవహిస్తోంది. ఇక్కడికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జీపుల్లో మాత్రమే వెళ్లాలి
మత్స్యగుండం - రెండు కొండల నడుమ గల గలపారే జలపాతం. వాటి నడుమ చిక్కుకుని ఉన్న బండరాళ్ల మధ్య ఇమిడి ఉన్న ఓ చిన్న గుండం. ఆ గుండమే మత్స్యగుండం. ఉత్తరాంధ్ర జిల్లాలలోనే ప్రముఖ శైవ క్షేత్రం
తైద జింగెల్‌ బెల్స్‌
అనంతగిరి కాఫీ తోటలు

ప్రయాణానికి అనువైన సమయం
మొత్తం సవత్సరం లొ ఎప్పుడైన వెళ్ళవచ్చు .
వేసవిలొ వెళ్తే వెచ్చదనం నుండి తప్పించుకొవొచ్చు .
శీతాకాలం ఐతే వలిసపూలు పూసి కొండలన్ని పసుపు వర్ణం తొ అందంగా తయారవుతాయి.అవి చూడాలంటే అప్పుడే వెళ్ళాలి.
ఇక వర్షాకాలం ఐతే పచ్చదనం తొ కళకళలాడిపొతుంది.అప్పుడు వెళ్ళేవాళ్ళు రైన్ కోట్లు,గొడుగులు పట్టికెళ్ళటం మంచిది.

ఎలా వెళ్లాలి..
విశాఖ పట్నం నుంచి బొర్రాకు రైలు ప్రయాణం కలిగించే అనుభూతి వర్ణనాతీతం. ఎత్తైన శిఖరాలు, పాతాళాన్ని గుర్తు చేసే లోయలు ఆనందాన్ని కలిగిస్తాయి. రైలు మార్గంలో 56 సొరంగాల గుండా ప్రయాణం ఓ విచిత్రమైన అనుభవం. గుహల్లో 14 కి.మీ ప్రయాణం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. విశాఖ నుంచి అరకు (రైల్‌ కమ్‌ రోడ్‌ ప్యాకేజీ వెళ్లేటప్పుడు రైలు వచ్చేటప్పుడు బస్సు)ని ఏపీటీడీసీ అందిస్తోంది.

ప్రతిరోజు ఉదయం 6:45 గంటలకు విశాఖ నుంచి కిరండోల్‌ వెళ్లే రైలు ద్వారా 9:30-10 గంటల మధ్యలో బొర్రా చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులో(విశాఖ-అరకు)వెళితే బొర్రా కూడలిలో దిగాక ప్రైవేటు వాహనాల ద్వారా మరో 7కి.మీ ప్రయాణిస్తే గుహల వద్దకు చేరుకుంటాం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట,మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బొర్రా గుహల్లోకి ప్రవేశం ఉంటుంది. పర్యాటకుల రద్దీని బట్టి సమయంలో సడలింపు ఉంటుంది.

మరిన్ని వివరాలకు www.aptdc.gov.in, www.telanganatourism.gov.in, www.irctctourism.com చూడవచ్చు. ఇవే కాకుండా పలు ప్రైవేట్‌ టూర్స్‌ ట్రావెల్స్‌ సంస్థల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read