శ్రీకాళహస్తి పూర్వ వైభవం సంతరించుకుంది. ఆరేళ్ల క్రితం శ్రీకాళహస్తిలో కుప్పకూలిన రాజగోపురం స్థానంలో, కొత్త గోపురం కొలువుదీరింది. దాదాపు 500 ఏళ్లపాటు శ్రీకాళహస్తికి మకుటాయమానంగా శోభిల్లిన రాజగోపురం 2010లో కూలిపోయిన సంగతి తెలిసిందే. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ గోపురం కూలిన ప్రదేశంలోనే, ఆనాటి నిర్మాణ పద్ధతులతోనే, నవయుగ నిర్మాణ సంస్థ కొత్త గోపుర నిర్మాణాన్ని పూర్తి చేసింది. పాత గోపురానికి అచ్చుగుద్దినట్టున్న కొత్త గోపురాన్ని నిర్మించారు.

పాతగోపుర ప్రాభవం ఇదీ.
గజపతులను యుద్ధంలో ఓడించిన శ్రీకృష్ణదేవరాయలు తన విజయ ప్రస్థానానికి ప్రతీకగా 1516లో ఈ గోపురాన్ని నిర్మించారు. 96 అడుగుల పొడవు, 64 అడుగుల వెడల్పు, ఏడు అంతస్తులతో 136 అడుగుల ఎత్తుతో దీనిని నిర్మించారు. ఎలాంటి పునాదులు లేకుండా ఇసుకపైనే దీనిని నిర్మించడం విశేషం. శ్రీకాళహస్తి క్షేత్రానికి చుట్టూ సుమారు 15 కిలోమీటర్ల పరిధి వరకు ఈ గోపురం కనిపించేది.

నవయుగ గోపురం ఇలా.
కుప్పకూలిన రాజగోపురం స్థానంలో సొంత ఖర్చులతో తిరిగి రాజగోపురాన్ని నిర్మించేందుకు నవయుగ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. 2010 ఆగస్టు 29న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2011 మే 29న పనులను ప్రారంభించిన నవయుగ నిర్మాణ సంస్థ చైర్మన్ చింతా విశ్వేశ్వరరావు నూతన గోపురం వెయ్యేళ్లు వరకు ఉండాలన్న ఆకాంక్షతో, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఏ విధంగా నిర్మించారో అదే రీతిలో తీర్చిదిద్దారు. 92 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పుతో గోపుర నిర్మాణానికి పునాదులు వేశారు. ఏడు అంతస్తులతో 144 అడుగుల ఎత్తున ఈ గోపురాన్ని నిర్మించారు. ఇందులో 35 అడుగుల మేర రాతి కట్టడం. మిగిలిన నిర్మాణాన్ని ఇటుకలతో పూర్తి చేశారు. గోపుర నిర్మాణంలో పాత తరహాలోనే కరక్కాయ, సున్నం, బెల్లం, కోడిగుడ్డుసొన వినియోగించారు. ఎక్కడా సిమెంటును వినియోగించలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గోవిందరావుపల్లె నుంచి ప్రత్యేక రాళ్లను తీసుకువచ్చారు. తమిళనాడుకు చెందిన సుమారు 250 మంది శిల్పులతో చెక్కించిన శిల్పాలను ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ నిర్మాణంలో సుమారు 20 టన్నుల బరువుగల ఒకే రాతిని వినియోగించారు. రూ.50 కోట్ల ఖర్చు చేశారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read