నవ్యాంధ్రలో తిరుమల తరువాత అత్యంత ప్రజాదరణ కలిగిన ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై అధికారులు దృష్టిని కేంద్రీకరించారు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో రూ. 46.92 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆలయ అధికారులు అంచనాలు రూపొందించారు. పునర్విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్రకు నూతన రాజధానిగా అమరావతి ఖరారు కావడంతో విజయవాడలోని దుర్గగుడికి భక్తుల రాక విపరీతంగా పెరిగింది. తిరుమలలో నిత్యం సుమారు 60 వేల మంది కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటుండగా, ఇంద్రకీలాద్రిలో వెలసిన ఆదిశక్తి కనకదుర్గమ్మను దాదాపు 30 వేల మంది వరకు నిత్యం దర్శించుకుంటున్నారు. దీనితో పెరిగిన భక్తులకు రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆలయ పరిసరాల అభివృద్ధి తప్పనిసరి అయింది.

ఆలయ అధికారులు పలు దఫాలుగా పరిశీలన జరిపిన అనంతరం తుదిగా అభివృద్ధి పనుల నిధుల అంచనాలను విడుదల చేశారు. శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం అభివృద్ధి ప్రాకార మండపం పునఃనిర్మాణం నిమిత్తం రూ.3.90 కోట్లు, శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కొలనుకొండ నిర్మాణం నిమిత్తం రూ.45 లక్షలు, శ్రీ దుర్గమ్మ వారి దర్శనార్ధమై వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం కుమ్మరిపాలెం సెంటర్లో పార్కింగ్ నిమిత్తం రూ.3.70కోట్లు, దేవాలయంలో పుష్కరిణి నిర్మాణం, పవిత్ర వనముల అభివృద్ధి నిమిత్తం రూ.2 కోట్లు అవసరమని అధికారులు తేల్చారు.

అమ్మవారి దర్శనానికి హై స్పీడు లిఫ్ట్లు
కొండపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం క్రింద ఉండే అడ్మినిస్తేషన్ భవనసముదాయం నుంచి హై స్పీడు లిఫ్ట్లును రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. అర్జున వీధి సుందరీకరణ నిమిత్తం రూ.7.90 కోట్లు, ఘాట్ రోడ్డు సుందరీకరణ నిమిత్తం రూ.3 కోట్లు, ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన, దిగువన జలపాతములకు రూ.3 కోట్లు, శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం బంగారం మలాం పనులకు రూ.8.97 కోట్లు, ఇంద్రకీలాద్రి క్షేత్ర ముఖద్వారం సుందరీకరణ పనులకు రూ.1 కోటి, గోశాల నిర్మాణం రూ.2కోట్లు, అన్నప్రసాదాల నిర్మాణం నిమిత్తం రూ.5 కోట్లు ఖర్చుకు నివేదికలు రూపొందించారు. ప్రసాదం పోటు నిర్మాణానికి రూ.3 కోట్లు, శ్రీ కనకదుర్గ అమ్మవారి పురాతన మెట్లు మార్గం పునఃనిర్మాణం నిమిత్తం రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు అంచనాల నివేదికలను అధికారులు తయారు చేసారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భక్తులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాల ఏర్పాటు చేయనున్నారు. గతంలో కొండపై ఉన్న పలు దుకాణాలను, కళ్యాణకట్ట, ఆలయ పరిపాలనా భవనాలను క్రిందికి తరలించడంతో కొండపై విశాలమైన స్థలం అందుబాటులోకి వచ్చింది. దీనితో అధికారులు వేలాదిగా తరలి వచ్చే భక్తుల సదుపాయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, సాధ్యమైనంత త్వరగా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకునేలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read