విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే విస్తరణ పనులకు గురించి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని గురువారం బెంగుళూరు నుండి గన్నవరం విమానాశ్రయూనికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టరు బి.లక్ష్మీకాంతం విమానాశ్రయంలో జరుగుతున్న రన్ వే విస్తరణ పనులను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న రన్ వేను 3,350 మీటర్లు విస్తరణ చేస్తున్నామని వివరించారు. ఈ విస్తరణతో బోయింగ్ 747 వంటి భారీ స్థాయి విమానాలు రన్వే పై సులభతరంగా దిగేందు వీలుగా అవకాశం ఉంటుందని వివరించారు.

ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మదుసూదనరావు, కలెక్టరు బి.లక్ష్మీకాంతంతో, పనులు వేగవంతం కావటానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సీఎం ప్రశ్నించగా.. కొన్ని అంశాలను ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత రన్‌వే ఎండ్‌ పాయింట్‌ నుంచి బుద్దవరం మీదుగా వెళ్ళే రోడ్డును డైవర్షన్‌ చేయాల్సి ఉందని, మంచినీటి పైపులైన్లను మళ్లించాల్సి ఉందని, మేజర్‌ డ్రెయిన్‌ను తరలించాల్సి ఉందని, హైటెన్షన్‌ వైర్లను కూడా మార్చాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ విన్న సీఎం చంద్రబాబు వెంటనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి విస్తరణకు ప్రతిబంధకంగా ఉన్న అంశాలపై గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది.

సరిగ్గా 11 గంటలకు ఆయన విమానంలో కుప్పం వెళ్ళారు. సీఎం విమానాశ్రయం నుంచి నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడటంతో సంబంధిత శాఖల అధికారులంతా విమానాశ్రయానికి క్యూ కట్టారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో ఎస్‌ఈలు వచ్చారు. అప్పటికే సీఎం వెళ్ళిపోవటంతో ఆయన వచ్చే వరకు వెటరినరీ కళాశాలలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో ఉన్నారు. అక్కడే కలెక్టర్‌ లక్ష్మీకాంతం చేయాల్సిన పనులకు సంబంధించి సమీక్ష చేశారు. కుప్పం నుంచి బయలుదేరి నాలుగు గంటలకు సీఎం ఎయిర్‌పోర్టుకు వస్తారని తెలియటంతో వేచి చూశారు. సీఎం వచ్చే గంట ముందు కలెక్టర్‌ విస్తరణ పనులను పరిశీలించారు. సీఎం విమానం దిగిన తర్వాత ఆయనకు ఎదురేగారు.

అధికారులంతా ఒకేసారి రావటంతో సీఎం పెండింగ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వారందరితో కలిసి ప్రస్తుత రన్‌వే ఎండింగ్‌ పాయింట్‌కు వెళ్లి విస్తరణ పనులను పరిశీలించారు. పనులను ఇంకా వేగంగా చేపట్టటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఉదయం సీఎం ఎయిర్‌పోర్టులో రన్‌ వే విస్తరణ పనులపై సమీక్ష చేయంతో సాయంత్రానికి అధికారులంతా అటెన్షన్‌ కావటంతో అప్పటికపుడు పరిష్కారం లభించింది. రెండు నెలల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఒక్కసారిగా చిక్కుముడి వీడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read