నవ్యాంధ్ర రాజధానిలో ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్టు ఈ ఏడాది మరో చరిత్రను సృష్టించింది. గత రెండేళ్లలో ఊహించని విధంగా అనూహ్యంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో సర్వీసుల సంఖ్య సైతం రెట్టింపైంది. దశాబ్దాలపాటు అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన విమానాశ్రయంలో మూడేళ్ల క్రితం వరకూ ఒకటి రెండు సర్వీసులు నడుస్తుండేవి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

నవ్యాంధ్రప్రదేశ్ కు తలమానికంగా ఉన్న విజయవాడ విమానాశ్రయం 2016-17 ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి ఆరన్నర లక్షల మంది ప్రయాణికులతో దేశంలోనే అత్యధిక వృద్ధి 61 శాతం సాధించింది. అర్ధ సంవత్సర ఫలితాలలో దేశంలోని మెట్రోపాలిటన్ ఎయిర్‌పోర్టులన్నింటినీ పక్కనపెట్టి అగ్రపథంలోకి దూసుకువెళ్లింది. ప్రయాణికుల పరంగా, మొత్తం విమాన రాకపోకల పరంగా, ఫైట్స్ మూవ్మెంట్ పరంగా చూసినా, అగ్రస్థానంలో నిలవడం విశేషం.

2014- 15లో మొత్తం 14 విమానాలు వచ్చి వెళ్ళేవి. 2015 - 16 లో 21 విమానాలు వచ్చి వెళ్ళగా.. 2016 - 17 లో మాత్రం అత్యధికంగా 32 విమానాలు వచ్చి వెళ్లాయి. సంవత్సరం అంతా చూస్తే ల్యాండింగ్‌ , టేకాఫ్‌ అయిన విమానాల లెక్కలు తీస్తే విజయవాడకు విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ కలిపి మొత్తం 11,631 రాకపోకలు జరిగాయి. అదే 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూస్తే ల్యాండింగ్‌, టేకాఫ్‌ కలిపి 7,710 మేర రాకపోకలు సాగించాయి. ఏడాది మొత్తం విమానాల రాకపోకలలో ఈ ఏడాది 51 శాతం వృద్ధిని సాధించటం విశేషం. 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6, 50, 463 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. అదే 2015 - 16లో 4, 04, 464 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. ఈ ఏడాది ప్రయాణీకుల రాక, పోకల ఆధారంగా 61 శాతం వృద్ధి కనిపించటం విశేషం.

రూ.160 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో, ఏటా 15 లక్షల మంది ప్రయాణికులు ఏ ఇబ్బందీ లేకుండా రాకపోకలు సాగించేందుకు వసతులు ఏర్పడ్డాయి. తాజాగా విమానాశ్రయాన్ని సైతం 500 ఎకరాల నుంచి మరో 700 పెంచి 1200 ఎకరాలు చేశారు. ప్రస్తుతం రన్వే విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌, ఎయిర్‌కోస్తా వంటి సంస్థలు, దిల్లీ, బెంగళూరు, వారణాశి, చెన్నై, హైదరాబాద్, తిరుపతి, విశాఖలకు సర్వీసులు నడుస్తున్నాయి. మే 22 నుంచి ముంబయికి సైతం నూతన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కొచ్చిన్, కోల్కతా, అహమ్మదాబాద్ వంటి నగరాలకు సైతం ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది.

విదేశాలకు ఇక్కడి నుంచి సర్వీసులను నడిపే విషయంలోనూ కేంద్ర విమానయానశాఖ వద్ద ఫైల్ కదలికలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి ఎగరనున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కస్టమ్స్ ఇమ్మిగ్రేషన్ సర్వీసులకు అవసరమైన విభాగాలు సైతం ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నాయి. ఆయా విభాగాల అధికారులతోనూ ఇప్పటికే సమావేశమై సాధ్యాసాధ్యాలను చర్చించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read