దేశంలో ఢిల్లీ తర్వాత సింగిల్ పిల్లర్ పై ఆరు లేన్లతో నిర్మిస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు సాగుతూ ఉన్నయి. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు ప్రతిషాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2, 2017 నాటికి పూర్తి చేయాల్సిందేనని గడువును నిర్దేశించింది. స్వయంగా ముఖ్యమంత్రి స్టేట్ హైవేస్ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. నెల వారీ పనులకు సంబంధించి ఎంత మేరకు చేయగలమన్న దాని పై ఇంతకు ముందు సోమా సంస్థ, స్టేట్ హైవేస్ అధికారులకు ఓ యాక్షన్ ప్లాన్ అందజేసింది. దానిప్రకారం పనులు జరగటం లేదు. రాష్ట్రంలోనే తొలిసారి ఆరు వరసలతో నిర్మాణం చేపట్టిన కనకదుర్గ వంతెన జాప్యానికి చాలా కారణాలు ఉన్నాయి. సాంకేతిక ఇబ్బందులతో పాటు కూలీల కొరత ఉన్నట్లు తెలిసింది. అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా సోమా సీరియస్ గా తీసుకోవట్లేదు. అక్టోబర్ 2 నాటికి డెడ్ లైన్ విధించినా, డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న పనులు:
చివరి ఘట్టమైన స్పైన్స అండ్‌ వింగ్స్‌ పనులు ప్రారంభమయ్యాయి. కాస్టింగ్‌ డిపోలో తయారైన శ్లాబ్‌లను బిగించేందుకు వీలుగా పిల్లర్‌ టు పిల్లర్‌ దృఢమైన బారికేడ్లతో ఐరన్ డయాఫ్రమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భారీ ట్రాలీలపై శ్లాబ్‌ విడిభాగాలను భవానీపురం నుంచి కుమ్మరిపాలెం వద్దకు తీసుకు వచ్చి, భారీ క్రేన్ల సహాయంతో డయాఫ్రమ్‌ పైకి చేరుస్తున్నారు. అక్కడ పిల్లర్‌ నుంచి పిల్లర్‌కు శ్లాబ్‌ భాగాలను కొలత ప్రకారం పిల్లర్‌ క్యాప్స్‌పై అమర్చుతున్నారు.

అదిరిపోయేలా ఉన్న ఫ్లై ఓవర్ డిజైన్:
తెలుగు సంప్రదాయాలను తెలిపేలా స్తంభాలపై బొమ్మలు.... ఫ్లై ఓవర్ దిమ్మల పై కలంకారీ బొమ్మలు... వంతెనకు ఇరు వైపులా పచ్చని అందమైన మొక్కలు... ఆహాదకరమైన నదీ తీరం... అత్యాధునిక రీతిలో బస్ స్టాప్ లు... రహదారులపై ఆకట్టుకునేలా శిల్పాలు... ఇదీ కనకదుర్గ పైవంతెనకు చేపట్టబోయే అదనపు హంగులు.

రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేకత సంతరించుకున్న ఈ వంతెనను సాధారణ రీతిలో కాకుండా విభిన్నంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి నగరానికి ముఖ ద్వారంగా ఉన్న ఈ ఫ్లై ఓవర్ ను అందంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు. నగరంలోకి ప్రవేశించాలన్నా, ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధానికి వెళ్లాలన్నా పై వంతెన మీదుగా వెళ్లాల్సిందే. అందుకే దీనిని ఆకట్టుకునేలా, నగరానికి వన్నె తీసుకుని వచ్చేలా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు.

వంతెన స్తంభాలపై అందమైన బొమ్మలు, వంతెన దిగువన పచ్చదనం, నడుచుకుంటూ వెళ్ళే వారికి ట్రాక్, బస్ షెల్టర్లు, వివిధ కళారూపాలు, ప్రకాశం బ్యారేజీ వద్ద వంతెన పై తీగలతో అందమైన హ్యాంగింగ్స్, ఆకట్టుకునేలా విద్యుత్తు దీపాలు, ఇలా అనేక అంశాలు అందులో ఉన్నాయి... ఫ్లై ఓవర్ కు అనుగుణంగా కనకదుర్గ గుడికి వెళ్లే మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

భవానీపురం ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వద్ద ప్రారంభమై రాజీవ్ గాంధీ పార్క్ వరకు ఉన్న ఈ ఫ్లై ఓవర్ అదనపు హంగులు సమకూర్చే అంశానికి సంబంధించిన ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు.ఫ్లై ఓవర్ కు చేపట్టబోయే అదనపు హంగులపై వీడియోను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ వీడియో చూసి, కొద్ది పాటి మార్పులతో ఆమోదం తెలిపినట్టు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read