ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ పటిష్టమవుతోంది. విజయవాడలో ప్రయోగాత్మకంగా "మహిళా రక్షక్" బృందాలు ఏర్పాటయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతులను టార్గెట్ చేసి ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడేవారి భరతం పట్టనున్నాయి. ప్రేమ పేరుతో కళాశాల విద్యార్థినులను ఏమార్చి వలలో వేసుకుని లైంగిక చర్యలకు పాల్పడటం, చైన్ స్నాచింగ్‌లకు తెగబడటం, ప్రలోభాలకు గురైన యువతల నుంచి నగదు, బంగారం దోచుకోవడం వంటి ఆకృత్యాలకు పాల్పడే వారి పట్ల ఇక ‘మహిళా రక్షక్’ సింహస్వప్నం కానుంది.

విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌లోని అన్ని పోలీస్టేషన్ల నుంచి ఎంపిక చేసిన మహిళా కానిస్టేబుళ్ళతో మహిళా రక్షక్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో 50 మంది ఉంటారు. విజయవాడ నగరంలోని 18 మార్గాల్లో 64 ప్రదేశాలను పోలీసు అధికారులు గుర్తించారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు, పార్కులు, బస్ స్టాప్‌లు ఇతర బహిరంగ ప్రదేశాలను గుర్తించారు. ఎంపిక చేసిన మహిళా కానిస్టేబుళ్ళు యూనిఫారంలో కాకుండా సివిల్ డ్రెస్‌లో ఆయా ప్రాంతాల్లో సంచరిస్తుంటారు.

ముఖ్యంగా కళాశాలలు, ఆర్‌టిసి బస్టాండు, సిటీ బస్టాడు, షేర్‌ ఆటోల్లో ప్రయాణించేటప్పుడు, జన సంచారం లేని ప్రాంతాలు, సినిమా హాళ్లు, మాల్స్‌, ఫుడ్‌కోర్టులు, మహిళలు ఒంటరిగా ఉన్న ప్రదేశాలు, బిఆర్‌టిఎస్‌ రోడ్డు, పాయకాపురం, పడవులరేవు సెంటరు, వీధి లైట్లు తక్కువగా ఉన్న ప్రదేశాలు, కార్యాలయాల నుండి మహిళలు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయాల్లో వేధింపులకు గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ బృందాల్లో పనిచేసే మహిళా కానిసేబుల్లు బాడీ వార్న్‌, పెన్‌కెమెరా, చెంపపిన్ను కెమెరా వంటివి ధరించి బస్టాపుల్లో నిలబడి ఉంటారు. ఆకతాయిల కదలికలు, వారి ప్రవర్తన, వారి చూపులను బట్టి వారిని అదుపులోకి తీసుకుంటారు

ఎవరైనా మహిళలు, యువతుల పట్ల ఈవ్‌టీంగ్‌కు పాల్పడినా.. ప్రేమ పేరుతో ప్రలోభపరిచేందుకు ప్రయత్నించినా.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అల్లరి చేస్తున్నా.. స్నాచింగ్‌లు, దాడులు వంటి కార్యకలాపాలకు ఉపక్రమించినా.. అక్కడే ఉండే మహిళా రక్షక్ కానిస్టేబుళ్ళు నిందితులను పట్టుకుని సమీపంలోని పోలీస్టేషన్‌లో అప్పగిస్తారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచే ముందు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పిలిపించి కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. తొలిసారే కదా అని వదిలేది లేదు. అప్పటికప్పుడే వారిపై సస్పెక్ట్ షీటు తెరుస్తారు. ఇక వారి దైనందిన కార్యకలాపాలు, దిన చర్యలపై నిఘా ఉంచి పోలీసులు అనుసరిస్తూ ఉంటారు.

మొదటి సారి పట్టుబడిన నిందితుడు రెండోసారి కూడా దొరికితే.. వెంటనే వారిపై నిర్భయ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారు. ఈవ్‌టీజర్లు, మహిళలు, యువతులను మోసం చేసే అపరిచితులకు కష్టకాలం మొదలవుతుంది. బెజవాడలో కళాశాలల వద్ద బీటు వేసి అమాయక విద్యార్థినులను వలలో వేసుకుని వారిని లైంగికంగా, బంగారం, నగదు పరంగా దోచుకుని వేధింపులకు పాల్పడిన ముఠా ఆకృత్యాలు ఇటీవల కాలంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. విజయవాడ నగరంలో మహిళలకు అండదండగా నిలిచేందుకు మహిళా రక్షక్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్ తెలిపారు. భద్రతకు భరోసా కల్పిస్తూనే వెన్నంటి నిలిచే అభయహస్తంగా అభివర్ణించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read