ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'ఎన్టీఆర్‌ ఆరోగ్య రక్ష' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్న తెలుగు ఎన్నారై.. ప్రవాస తెలుగువారికి అన్నివిధాలా అండదండగా నిలుస్తున్న ఏపీఎన్నార్టీ సమన్వయకర్త (సౌత్‌వెస్ట్‌-యునైటెడ్‌ స్టేట్స్‌).. మాధవి మేడి తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెదపులిపాకలోని ప్రజలందరికీ ఈ పథకం కింద ఆరోగ్యబీమా చేయించడానికి ముందుకొచ్చారు. ఈ స్కీంలో చేరేందుకు ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.1200 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గ్రామంలో ప్రజలకు నూరుశాతం ఇన్స్యూరెన్స్ ప్రీమియంను చెల్లించేందుకు ఏడాదికి రూ.2లక్షల వరకూ ఖర్చవుతుందని ఆమె తెలిపారు.

గత ఏడాది మే నెలలో.. గుండెపోటుతో మరణం అంచుల దాకా వెళ్లిన తన తండ్రి వైద్యుల నైపుణ్యం, సంరక్షణచర్యలతో కోలుకున్నారని, అలాంటి వైద్య సంరక్షణే గ్రామంలోని అందరికీ అందజేయాలని తాను భావించానని మాధవి మేడి తెలిపారు. అందుకు మార్గం ఆరోగ్యబీమాయే కాబట్టి ఊరందరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేయిస్తున్నట్టు చెప్పారు. దీనిపై తొలుత తాను ఏపీఎన్నార్టీ సీఈవో రవికుమార్‌ వేమూరుతో చర్చించానని ఆమె వివరించారు. తన చర్యతో విదేశాల్లో ఉంటున్న ప్రవాస తెలుగువారంతా తమతమ సొంత ఊళ్లలోని ప్రజలందరికీ ఆరోగ్యబీమా చేయించేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నట్టు ఆమె తెలిపారు.

కాగా.. ఏపీఎన్నార్టీ సీఈవో రవి వేమూరు మాట్లాడుతూ.. ఏపీలోనే కాక, భారతదేశంలోనే 100 శాతం ప్రజలు ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్యబీమా కలిగి ఉన్న గ్రామంగా పెదపులిపాక చరిత్ర సృష్టించిందన్నారు. ప్రజలందరికీ కనీస ఆహారం, నీరు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వంటి లక్ష్యాలను సాధించేందుకు ఏపీఎన్నార్టీ కృషి చేస్తోందని చెప్పారు. విదేశాల్లో ప్రతి పౌరుడికీ ఇవి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాయని.. మనదేశంలోనూ అలా అందరికీ అందుబాటులోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక, జన్మభూమి రుణం తీర్చుకుంటున్న మాధవి మేడి ఏపీఎన్నార్టీలోనూ చురుగ్గా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read