నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు తీవ్రం అయ్యింది. గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకూ వైసీపీ మూడు గ్రూపు..ఆరు తగాదాలుగా రోడ్డున పడుతున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్‌తో సరిపడడంలేదు. ఇదే సీటు కోసం పోటీపడుతున్న వైసీపీ నేతలు కూడా అనిల్ కి దూరంగానే ఉంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సీటు ఆశిస్తున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డిని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరదీస్తుండడంతో కోటంరెడ్డి అలకబూనారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సందర్భం దొరికితే జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఆనంకి చెక్ పెట్టడానికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో వర్గపోరు మరింత తీవ్రమైంది. గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్ కి టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ అసమ్మతివర్గం భీష్మించుకు కూర్చుంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ నేతల తీరుతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దోపిడీ, దౌర్జన్యాలను సొంత పార్టీ వారే అసహ్యించుకుంటున్నారు. ఓ రాజ్యసభ సభ్యుడు తన వారసుడిని ఇక్కడి నుంచి పోటీకి దింపాలని వైసీపీ పెద్దల వద్ద ప్రతిపాదన ఉంచారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆ రాజ్యసభ సభ్యుడి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎన్నికలు వచ్చేనాటికి నియోజకవర్గాల్లో అసమ్మతి సద్దుమణగకపోతే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
news
ఆ నలుగురి ఫ్యాన్స్‌తో ఫ్యాన్ వార్.. బాబు, బాలయ్య, చిరు, పవన్ ముట్టడిలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి..
వైసీపీకి చేతిలో 151+4 అధికారం ఉంది కానీ, మనశ్శాంతి లేదు. శాసనసభ్యులు సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్షనేత చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పోరాడుతున్న తీరుతో వైసీపీ సర్కారుకి ముచ్చెమటలు పడుతున్నాయి. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ పరుగులు తీయిస్తున్నాడు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దీంతో ప్రతిపక్షాలు ప్రజాఉద్యమాలతో ప్రభుత్వంతో ఢీకొడుతున్నాయి. అటు బాబు, ఇటు పవన్ లకి పెరుగుతున్న జనాదరణ తట్టుకోలేక జీవో నెంబర్ 1 పేరుతో బ్రిటిష్ కాలం నాటి చట్టం అమలుకి బరితెగించింది జగన్ సర్కారు. అయితే ఇది బూమరాంగ్ అయ్యింది. జీవోతో జగన్ వీపు గోక్కోమనండి అని ధిక్కరిస్తూ బాబు కుప్పంలో కుమ్మేసారు. జనసేన అధినేత యువశక్తి పేరుతో రణస్థలంలో ఈ నెల 12న వైసీపీపై రణభేరీ మోగిస్తున్నారు. మరోవైపు మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీలా చెలరేగిపోతున్న బాలయ్య వీరసింహారెడ్డిలో పేలిన రాజకీయ డైలాగులు, వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంకోవైపు నుంచి వాల్తేరు వీరయ్య పంచ్ కూడా వైసీపీకే తాకనుంది. నలువైపులా వీరిని అడ్డుకుంటే వైసీపీకి భారీ డ్యామేజీ. అడ్డుకోకపోతే జగన్ మనస్తత్వం శాంతించదు. సభలకు సెక్యూరిటీ సమస్య అంటూ అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడం, ఇబ్బంది పెట్టడం చేస్తుంటే ప్రజావ్యతిరేకతకి తోడు నలుగురు హీరోలు(పొలిటికల్ హీరో చంద్రబాబు) ఫ్యాన్స్ తో ఫ్యాన్ వార్ షురూ అయినట్టే.
చాలా రోజుల తరువాత లోకేష్ తో గంటా భేటీ... రాజకీయ వర్గాల్లో చర్చ...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో గంటా శ్రీనివాసరావు దాదాపు గంట పాటు మంతనాలు జరిపారు. వీరి భేటీపై అధికారికంగా ఏ ప్రకటనా ఇంకా విడుదల కాలేదు. అయితే పార్టీలు మారడం, పదవులు పొందడం ఒక నిరంతర ప్రక్రియలా చేపట్టే గంటా కొన్నాళ్లుగా టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికార వైసీపీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేశారని కథనాలు స్పష్టం చేస్తున్నాయి. లేటెస్ట్‌గా డిసెంబర్ మొదటివారంలో కూడా వైసీపీలోకి జంప్ కొడతారని వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ కాపు హక్కుల పరిరక్షణ అవతారం ఎత్తారు గంటా. మామూలు రాజకీయ నాయకుల్లా కాకుండా నిరంతరం పార్టీలు, ప్రజలనాడిపై సర్వేలు చేయించే గంటా శ్రీనివాసరావుకి వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని తేలిందని, దీంతో ఊగిసలాట ధోరణికి కట్టిపెట్టి పార్టీలో కొనసాగేందుకు మొగ్గు చూపారని టాక్ వినిపిస్తోంది. జనసేన-టిడిపి జత కట్టడం గ్యారంటీ అని తేలిపోవడంతో మౌనం వీడిన గంట మోగిందని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు ప్యాకేజీ పాలిటిక్స్ ని టిడిపి ఎంటర్ టైయిన్ చేస్తుందా? కష్టకాలంలో తెరమరుగై కలిసొచ్చే కాలంలో తిరిగొచ్చిన గంటాకి పూర్వ ప్రాధాన్యం ఇస్తుందా త్వరలో తేలనుంది. టీడీపీ అధిష్టానం గంటా ఎటువెళ్లినా పట్టించుకోదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లోకేష్ తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గంటకి పైగా గంటా ఏం చర్చించారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖలో బాబు, లోకేష్ పర్యటనలకు వచ్చినప్పుడు పత్తా లేని గంటా కలుగులోంచి బయటకొచ్చింది ఎందుకో అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
బాలయ్య - చిరు సినిమాలతో వైసీపీ బ్యాచ్ కేస్ట్ పాలిట్రిక్స్
ఏపీలో ఎప్పుడూ కమ్మ-కాపు వైరం పెట్టడం రాజకీయంగా మంచి ఎత్తుగడగా భావిస్తుంటారు. వాస్తవంగా ఆ రెండు క్యాస్ట్‌ల మధ్య ఉన్న విభేదాల కంటే సృష్టించినవే ఎక్కువ. తాజాగా మరోసారి కమ్మ-కాపు కేస్ట్ పాలిట్రిక్స్ కి వైసీపీ బ్యాచ్ తెరలేపిందని రఘురామ రాజు ఆరోపించారు. సంక్రాంతికి బాలయ్య వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ అవుతున్నాయి. ఇదే అదనుగా భావించిన వైసీపీ ఫేక్ అకౌంట్లతో ఇరు హీరోల పేరుతో వివాదాలు రేపేందుకు విశ్వప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపణ. బాలయ్య, చిరు సినిమాలు రెండింటికీ ఒకటే సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కులాలైనా, హీరోల ఫ్యాన్స్ అయినా, నిర్మాత అయినా ఇప్పుడు కోరుకునేది సినిమా హిట్ కావడమే. ఏ ట్రైలర్ బాగుంది? ఏ సినిమా హిట్ అవ్వొచ్చంటూ క్యాస్ట్ పేర్లతో ఓపెన్ చేసిన సోషల్మీడియా ఖాతాల ద్వారా విషం చిమ్ముతున్నారు. ఇవి వర్కవుట్ అయ్యే అవకాశం లేకపోవడంతో కాపుల విద్వేషం చిమ్మేలా ఒకవర్గం, కమ్మవాళ్లపై అక్కసు వెళ్లగక్కేలా మరో వర్గంగా వైసీపీ వాళ్లే ఫేక్ ఖాతాలతో వందలకొద్దీ పోస్టులు సృష్టిస్తున్నారు. చిరు, బాలయ్య ఈ వైసీపీ మార్క్ క్యాస్ట్ పాలిట్రిక్స్ పట్టించుకోరు. ఇరు హీరోల ఫ్యాన్స్, కులాలు, వారు మద్దతుగా నిలిచే పార్టీల అభిమానులు మాత్రం చాలా జాగ్రత్తగా సోషల్మీడియా పోస్టుల పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఉంది.