సీఎం చంద్రబాబు ‘సేవ్ ఇండియా సేవ్ కాన్‌స్టిట్యూషన్ పేరుతో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసి, మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు కంటే ముందుగానే కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చూస్తున్నారు. వీరిద్దరూ తెలుగు రాష్ట్రాల నుంచే ఈ ప్రయత్నాలు ప్రారంభించడం దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఇంతకు ముందే కేసీఆర్ పలువురిని కలిశారు. ఇప్పడు రెండోసారి వివిధ రాష్ట్రాల సీఎంలను కలుసుకోవాలని భావించారు. అందులోభాగంగా సోమవారం ఒడిషా సీఎం నవీన్‌పట్నాయక్‌ను కలిశారు.

cbn 24122018 3

అయితే కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భేటీపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఒడిశా సీఎం, తెలంగాణ సీఎం ఏం చర్చించారో తెలియదని చెప్పారు. తెలంగాణకు పోలవరం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం కేసు వేసిందని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం శీతకన్ను వేసిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికి 62.8 శాతం పనులు పూర్తి చేశామని, అత్యుత్తమ ప్రాజెక్టు కింద పోలవరానికి సీబీఐపీ అవార్డు వచ్చిందని తెలిపారు. జనవరి 6-7 తేదీల్లో 28 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి రికార్డు సృష్టిస్తామని పేర్కొన్నారు.

cbn 24122018 2

స్పిల్‌ వే పనులు 75 శాతం పూర్తి చేశామని, పోలవరం అన్ని డిజైన్లకు అనుమతులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. భూసేకరణ పూర్తియ్యిందని, పరిహారం, భూసేకరణకు నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు రూ.15,235 కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.3,500 కోట్లు ఇవ్వాలని గుర్తుచేశారు. కేంద్రం కొత్త డీపీఆర్‌ను ఆమోదించాల్సి ఉందని, రూ. 4 వేల కోట్లతో విద్యుత్‌ కేంద్రం పనులు చేయాల్సిఉందన్నారు. పోలవరం నుంచి 2019 మే నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని తెలిపారు. వచ్చే డిసెంబర్‌ నాటికి ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫీల్‌ డ్యాం కూడా పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు.

 

రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణ పై శ్రద్ధ పెరుగుతూ మధుమేహం, తదితర వ్యాధుల బారి నుంచి ఉపశమనం పొందేందుకు చిరుధాన్యాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. రోజులో కనీసం ఒకసారైనా చిరుధాన్యాలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. మారుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా చౌకధరల దుకాణాల ద్వారా రాగులు, తెల్లజొన్న సరఫరా చేస్తోంది. గడచిన మూడు నెలల్లో వీటికి డిమాండ్ పెరగటం ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పునకు అద్దం పడుతోంది. చౌకధరల దుకాణంలో బియ్యం బదులుగా రాగులు లేదా జొన్నలను కిలో రూపాయి చొప్పున తీసుకునే వీలు ప్రభుత్వం కల్పించింది.

ration 2412201 2

రాగులు, జొన్నల పంపిణీని తొలుత రెండేసి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టినప్పటికీ ప్రజల నుంచి పెరిగిన ఆదరణను గమనించి రాష్ట్రం అంతటా అమలు చేస్తున్నారు. రాగుల పంపిణీకి తొలుత 4000 టన్నులు సరఫరా చేసేందుకు ప్రతిపాదించగా, అక్టోబర్‌లో 2215 టన్నుల మేర ఇండెంట్ పెట్టారు. ఆ నెలలో కేవలం 810 టన్నులు మాత్రమే కార్డుదారులు తీసుకెళ్లారు. డిసెంబర్ నాటికి ఇండెంట్ 2262 టన్నులకు చేరుకోగా, 3475 టన్నులు పంపిణీ చేశారు. తెల్లజొన్న కూడా అక్టోబర్‌లో 2640 టన్నుల మేర ఇండెంట్ ఉండగా, 1531 టన్నులను పంపిణీ చేశారు. డిసెంబర్ నాటికి 1561 టన్నులను పంపిణీ చేశారు. దీంతో మూడునెలల్లో 5036 టన్నులను సరఫరా చేయడం విశేషం.

ration 2412201 3

రాగులకు సంబంధించి చిత్తూరు, అనంతపురం, కృష్ణా, కడపలో ఎక్కువ వినియోగం నమోదు కాగా, జొన్నలు కర్నూలులో ఎక్కువగా తీసుకెళ్లినట్లు వివరాలు తెలియచేస్తున్నాయి. జనవరి నుంచి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఈమేరకు ఎక్కువ మొత్తంలో రాగులు, జొన్నలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరా సంస్థ జనరల్ మేనేజర్ వి వెంకటరమణ ఆదివారం ఇక్కడ తెలిపారు. రాగుల వినియోగం రాష్ట్రంలో అంతటా ఉందని, జొన్నలకు ఎక్కువ డిమాండ్ కర్నూలులో మాత్రమే ఉందన్నారు. వీటి సరఫరాపై పరిమితిని ఎత్తివేశామని, బియ్యం బదులు ఎంత కావాలన్నా తీసుకునే వెసులుబాటు కల్పించామని ఆయన వెల్లడించారు.

నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబోతున్న శుభ గడియలు సమీపించాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు మొదటి గేటును బిగించే పనికి శుభముహూర్తం ఖరారైంది. నవ్యాంధ్రుల జీవనాడిగా, వర ప్రదాయనిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలక ఘట్టానికి సోమవారం శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే 61.43 శాతం పనులు పూర్తి చేసుకుని శరవేగంగా నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన రేడియల్ గేట్ల ఏర్పాటు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 48 రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందులో తొలి గేటు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం తొలి గేటును నిలబెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ప్రారంభించనున్నారు.

polavaram 24122018 2

మిగిలిన 47గేట్లు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు, వెడల్పు 15.9 అడుగులు. మొత్తం గేట్ల తయారీకి 18వేల టన్నుల ఉక్కు అవసరమవుతుందని అంచనా. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు 61.98 శాతం పూర్తయ్యాయి. గేట్ల నిర్మాణానికి రూ. 530కోట్ల రూపాయలు వ్యయం అవుతోంది. గేట్లను నిలబెట్టేందుకు హైడ్రాలిక్ సిలిండర్లు వినియోగిస్తారు. ఒక్కో సిలిండర్ బరువు 250 టన్నులు కాగా, వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. గేట్ల ఏర్పాటులో హైడ్రాలిక్ సిలిండర్లతో పాటు సెల్ఫ్ లూబ్రికేటింగ్ బుష్‌లు కీలకంగా ఉంటాయి. వీటిని జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. మొత్తం 96 బుష్‌లు అవసరం అవుతాయి.

polavaram 24122018 3

ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ 500 టన్నుల బరువును ఎత్తుతుంది. ఒక్కో గేటు 300 టన్నుల బరువు ఉంటుంది. గేట్‌ను ఎత్తి నిలబెట్టేందుకు వీలుగా ఇప్పటికే కొన్ని హైడ్రాలిక్ సిలిండర్లు ప్రాజెక్టు ప్రాంతానికి తరలించగా, మరికొన్ని కొద్దిరోజుల్లో రానున్నాయి. తొలిగేటును ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్టను మే చివరి నాటికి పూర్తిచేసి గ్రావిటీ ద్వారా నీటిని అందించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రాజెక్టు ఎత్తు 129 అడుగులు, పొడవు 9560 అడుగులు ఉంటుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సహా సాగు, మంచినీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది.

రాష్ట్రానికి ఏ మోహం పెట్టుకుని ప్రధాని మోడీ వస్తున్నారని, చచ్చారో బతికారో చూద్దామని వస్తున్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి న్యాయం చేశాకే ఇక్కడ పర్యటన చేయాలని, లేని పక్షంలో ప్రజల నుంచి నిరసన ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే ప్రధానికి నిరసన తెలిపేందుకు అన్ని వర్గాలు సమా యత్తమవుతు న్నాయని, తానుకూడా గుంటూరు నుంచి తెనాలివరకు నిరసన పాదయాత్ర ఆరోజు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు సహకరిస్తున్న పార్టీలను సైతం దోషులుగా నిలబెట్టాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఇప్పటికే 10 జిల్లాల్లో ధర్మపోరాట సభలు నిర్వహించామని తెలిపారు.

cbnprotest 24122018 2

‘కొత్త సంవత్సరం తొలిరోజు సంబరాలు చేసుకుంటాం.. అయితే వాటి బదులు మనకు జరిగిన అన్యాయంపై గళమెత్తాలి. మన ఐక్యతను చాటాలి. రాష్ట్రస్థాయి నుంచి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వరకు నిరసన ప్రదర్శనలు జరగాలి. ప్రతి పల్లెలోనూ జనం కదం తొక్కాలి. ఆ రోజు ఎవరికి ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో 2-3 కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీలు చేయాలి’ అని సూచించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ, దానికి సహకరిస్తున్న పార్టీల గుండెల్లో గుబులు పుట్టేలా ప్రజల్లో చైతన్యం రావాలని స్పష్టం చేశారు. ఆయనే స్వయంగా ఆ రోజు నిరసన ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల మీదుగా 15-20 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ జరుపుతారని సమాచారం. పార్టీపరంగా అని కాకుండా.. ప్రజలే ముందుకొచ్చి ర్యాలీలు చేయాలని చంద్రబాబు కోరారు.

cbnprotest 24122018 3

‘ఒకరు నడుస్తూ వెళ్తుంటే కలిసొచ్చేవాళ్లు కలిసొస్తూ ఉంటారు. అదో ప్రవాహంలా మారుతుంది. జనాలను రాజకీయంగా తీసుకొచ్చి చేసే పనికాదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా స్వచ్ఛందంగా అంతా కలిసిరావాలి. ఎవరికి వీలున్నచోట్ల వారు చేయాలి. ఓ 20 మందీ మొదలుపెడితే.. అలా నిరసన ర్యాలీ సాగుతుండగా మధ్యలో అనేకమంది స్వచ్ఛందంగా కలుస్తారు. చివరకు వెళ్లేసరికి భారీ ర్యాలీగా మారుతుంది. అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుంటే మళ్లీ అదే చేస్తారు. మోసం చేసినా మౌనంగా ఉంటే బలహీనత అనుకుంటారు. మళ్లీ అదేపని చేస్తారు. మోసం చేసినవాళ్లను నిలదీయాలి. అప్పుడే భయం ఉంటుంది’ అని చంద్రబాబు పార్టీ నేతలు, మీడియాతో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం, ఇతర హామీల అమలు కోసం ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకే నూతన సంవత్సరం మొదటిరోజును ఎంచుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సంబరాలు మానుకుని..రాష్ట్రం కోసం ప్రజలు చైతన్యంగా ఉన్నారని నిరూపించే కార్యక్రమంగా ఇది మారాలని ఆకాంక్షిస్తున్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ నిరసన ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read