పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల విద్యుత్తు బోర్డు అవార్డు (సీబీఐపీ) దక్కింది. 2019వ సంవత్సరానికి బెస్టు ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ జలవనరుల ప్రాజెక్టుగా అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించింది. సీబీఐపీ కార్యదర్శి వి.కె.కంజిలియా ఏపీ జలవనరులశాఖకు ఈ సమాచారం అందించారు. ఈ మేరకు సోమవారం రాత్రి జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం వెంకటేశ్వరరావుకు ఇ-మెయిల్‌ పంపారు. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని గౌరవించేలా ఈ అవార్డును అందజేయాలని జ్యూరీ నిర్ణయించిందని కాంజ్లియా ఈ-మెయిల్‌లో వివరించారు. 2019 జనవరి 4న సీబీఐపీ దినోత్సవం సందర్భంగా దిల్లీలో జరిగే ఒక ముఖ్య కార్యక్రమంలో ఈ అవార్డు అందించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరిగేందుకు అనుసరిస్తున్న విధానాలకే ఈ అవార్డు దక్కినట్లు తెలిపారు.

polavaram 18122018 2

1927 నుంచి సీబీఐపీ ఈ అవార్డులు కొన్ని రంగాల్లో విశిష్ఠ సేవలందించినందుకు, ఘనతలు సాధించినందుకు అందిస్తూ వస్తోంది. జలం, విద్యుత్తు, రెన్నోబుల్‌ ఎనర్జీ రంగాల్లో ఘనమైన సేవలను కొనియాడేందుకు ఈ అవార్డులు ఇస్తోంది. మరో పక్క, పోలవరం ప్రాజెక్టు డిసెంబరు 2019 కల్లా పూర్తికానుందని కేంద్రం వెల్లడించింది. 62.16శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని 2019 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు సోమవారం రాజ్యసభలో కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం సిఫార్సుల మేరకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామన్నారు.

polavaram 18122018 3

1.4.2014న జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే నాటికి సాగునీటి విభాగానికి సంబంధించి రూ.7158.53 కోట్లు నిధులు విడుదల చేయాల్సి ఉందని, ఆ తర్వాత రూ.6764.16 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అయితే సాగునీటి విభాగం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం తదితర అంశాల్లో తాజాగా సవరించిన అంచనాల ప్రకారం రూ.57940.86 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు కేంద్ర జలసంఘం తెలిపిందన్నారు. ప్రాజెక్టు సవరించిన అంచనాలు కేంద్ర జల సంఘం తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. భూసేకరణకు 1.66 లక్షల ఎకరాలు గుర్తించినట్లు, ఇప్పటి వరకు 1.10 లక్షల ఎకరాలు సేకరించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నివేదిక ఇచ్చినట్లు మంత్రి వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ పై కేంద్ర వైఖరికి నిరసనగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పార్లమెంటు ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టాలని ఎంపీ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. పార్లమెంటు ముగిసే వరకు ఆయన దీక్ష కొనసాగనుంది. రామ్మోహన్ నాయుడు నిరసనకు మద్దతుగా టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంట్ లో మోడీని నిలదియ్యకుండా తెలుగుదేశం ఎంపీలను అన్ని విధాలుగా బెదిరించారు, మోడీ, షా.. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, తెలుగుదేశం ఎంపీలు మాత్రం, వెనక్కు తగ్గలేదు. ఏపికి న్యాయం చెయ్యండంటూ పార్లమెంట్ లో టిడిపి ఎంపీల ఆందోళన కొనసాగిస్తున్నారు.

rammohan 18122018 2

మరో పక్క, ఏపీకి న్యాయం చేయాలంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతీ రోజు పలు రకాల వేషధారణలతో పార్లమెంటుకు వస్తున్న ఎంపీ ఈరోజు జానపద కళాకారుడు వంగపండు వేషంలో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న మోదీ ఎన్నికలయ్యాక అన్నీ మరిచాడంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా రైల్వేజోన్ ఇతర హామీలను మరిచిన మోదీని ఓడించడానికి కదిలి రావాలంటూ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారంటూ జానపదాలు పాడుతూ శివప్రసాద్ నిరసనను తెలియజేశారు.

rammohan 18122018 3

‘ఏం పిల్లడో ఢిల్లీ వస్తవా.. ఏం అమ్మాయి ఢిల్లీ వస్తవా. ఢిల్లీలోనే మొండోడు(ప్రధాని మోదీ) ఉన్నడు. మొండోడిని కాదు.. నేను మొనగాడిని అంటడు. డ్రస్సులేమో తెగ జోరుగా ఏస్తడు. ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటడు. త్రీడీ ఎఫెక్టుతో ప్రధాని అయ్యుండు. ప్రజల గురించి అసలు ఆలోచించడు’ అంటూ ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ తనదైన శైలి వేషాలతో నిరసన తెలియజేస్తే ఏపీ వాయిస్ వినిపిస్తున్నారు శివప్రసాద్. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తెదేపా లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం నేతృత్వంలో పార్టీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, పనుల్లో నాణ్యత లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ ఏడాది ఆగస్టు 11న పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలోనే సమీక్ష నిర్వహించిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదంటూ తమ పార్టీ నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన థర్డ్‌ పార్టీ(కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ )తో చేయిస్తున్నామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) గడ్కరీ దృష్టికి తీసుకొచ్చింది. పీపీపీకి వాప్కోస్‌ అందిస్తోన్న నెలవారీ నివేదికలు బయటకు వచ్చాయి.

polavaram 17122018

జూన్‌ నుంచి ఆగస్టు దాకా మూడు నెలలపాటు వాప్కోస్‌ ఇచ్చిన నివేదికల్లో పోలవరం పనుల్లో నాణ్యత కొరవడినట్లు ఎక్కడా అభిప్రాయపడలేదు. పైగా పనులన్నీ ఉత్తమ నాణ్యతా ప్రమాణాల(ఎక్స్‌లెంట్‌)తో జరుగుతున్నాయని వాప్కోస్‌ కితాబిచ్చింది. జూన్‌ నెల నాణ్యతా పరీక్షల నివేదిక... 1276 కాంక్రీట్‌ క్యూబుల నాణ్యతను పరిశీలించాం... ఎం15ఏ40 పరిశీలనలో నాణ్యతా ప్రమాణాలు ‘ఎక్స్‌లెంట్‌’ గా ఉన్నాయి. మరో 624 కాంక్రీట్‌ క్యూబుల నాణ్యతనూ పరిశీలించాం... ఎం20ఏ40 నాణ్యత ‘ఎక్స్‌లెంట్‌’గా ఉంది. కాంక్రీట్‌ గ్రేట్‌ ఎం25ఏ20కు సంబంధించి 843 సెట్స్‌ పరిశీలించాం.. నాణ్యత ‘ఎక్స్‌లెంట్‌’గా ఉంది అని వాప్కోస్‌ పేర్కొంది. జూన్‌ నెలంతా నిర్వహించిన క్వాలిటీ టెస్టుల ఫలితాలను వాప్కోస్‌ ‘ఎక్స్‌లెంట్‌’ అంటూ కితాబిచ్చింది.

polavaram 17122018

జూలై నాణ్యతా పరీక్షల నివేదిక.. స్పిల్‌వే కాంక్రీట్‌ బ్లాక్‌లను ఈ నెలలో వాప్కోస్‌ పరీక్షించింది. ఎం15ఏ40 పరీక్షల కింద 792 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం20ఏ40 పరీక్షల కింద మరో 290 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం25ఏ20 పరీక్షల కింద 502 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం30ఏ40 పరీక్షల కింద 48 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం50ఏ20 పరీక్షల కింద 10 బ్లాకులను పరీక్షించి... ‘ఎక్స్‌లెంట్‌’ అని పేర్కొంది.. ఆగస్టు నాణ్యతా పరీక్షల నివేదిక... ఎం15ఏ40 పరీక్షల కింద స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు చెందిన 460 కాంక్రీట్‌ బ్లాకులను వాప్కోస్‌ పరీక్షించి.. కాంక్రీట్‌ ‘ఎక్స్‌లెంట్‌’గా ఉందని కితాబిచ్చింది. అలాగే ఎం20ఏ40 పరీక్షల కింద స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు చెందిన 441 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం25ఏ20 పరీక్షల కింద స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు చెందిన 883 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం30ఏ40 పరీక్షల కింద స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు చెందిన 73 కాంక్రీట్‌ బ్లాకులను, ఎం50ఏ20 పరీక్షల కింద స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ చానల్‌కు చెందిన 17 కాంక్రీట్‌ బ్లాకులను వాప్కోస్‌ పరీక్షించి... కాంక్రీట్‌ ‘వెరీగుడ్‌’ అని కితాబిచ్చింది.

ఎప్పుడూ ఆగ్రహంతో అది చేసారు, ఇది చేసారు అని వార్తల్లో ఉండే టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నిరసన తెలపటం ఏంటి అనుకుంటున్నారా ? ఈ ఘటన గుంటూరు జిల్లా, కాజా టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఆయన ఫ్యామిలీతో సహా, కార్ లో తిరుపతి వెళ్లి, రిటర్న్ వస్తూ ఉండగా, కాజా టోల్ ప్లాజా వద్ద సిబ్బంది చింతమనేని కారును ఆపారు. ఏ టోల్ ప్లాజా వద్ద అయినా, కార్ ఆపగానే, ఎమ్మెల్యే అని చెప్పగానే కార్ కి దారి ఇస్తారు. ఎమ్మెల్యేలకు, టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉండటమే దానికి కారణం. అయితే, గుంటూరు జిల్లాలో అదీ రాజధానికి అత్యంత దగ్గరగా ఉండే కాజా టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం, ఎమ్మెల్యే చింతమనేని వాహనాన్ని కదలనివ్వలేదు.

chintamaneni 18122018 2

తాను ఎమ్మెల్యేను అని స్వయంగా చింతమనేని చెప్పినా అక్కడి సిబ్బంది వినిపించుకోలేదు. దీంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. తాను ఎమ్మెల్యేను అనీ, తనకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉందని గుర్తుచేశారు. అయితే సిబ్బంది మాత్రం డబ్బులు చెల్లించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మీరు ఎమ్మెల్యే అని నిరూపించుకోండి అంటూ మాట్లాడటంతో, చింతమనేని సహనం కోల్పోయారు. టోల్ ప్లాజా సిబ్బంది చర్యలకు నిరసనగా, తన కారును టోల్ గేట్ వద్ద వదిలేసి అటుగా వెళుతున్న బస్సు ఎక్కి, దెందులూరు ప్రయాణం అయ్యారు. ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని మంగళగిరి పోలీసులకు తెలియచేసారు. ఎమ్మెల్యే అని చెప్పినా, గన్ మెన్లు పక్కన ఉన్నా, తనను ఎమ్మెల్యే అని నిరూపించుకోండి అంటూ అక్కడ సిబ్బంది చెప్పటాన్ని, తప్పుబట్టారు.

chintamaneni 18122018 3

కావాలని ఇలా చేసారా, రెచ్చగొట్టి ఏదైనా ఇష్యూ చెయ్యటానికి, ఇలా చేసారా అనే అనుమానం వ్యక్తం చేసారు. నిత్యం ఆ రూట్ లో ఏంటో మంది ఎమ్మల్యేలు వస్తారని, సిబ్బందికి ఎవరు ఏంటో తెలియదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా, టోల్ ప్లాజా సిబ్బంది పై తన సహజమైన దూకుడు ప్రదర్శించకుండా, హుందాగా నిరసన తెలపటం మంచి పరిణామం. అయితే ఇంకా ఎమ్మెల్యే చింతమనేని కారు టోల్ ప్లాజా వద్దే ఉంది. ఇలనాటి సంఘటనలు తాను పట్టించుకోను అని, కాని అక్కడ వాళ్ళ వాలకం చూస్తుంటే, తనను కావాలని, అక్కడ సిబ్బంది అవమానించారని, జరిగిన అవమానానికి బాధ్యలు అయిన వారి మీద, ఏ చర్యలు తీసుకున్నారో చెప్తేనే, అక్కడ నుంచి వాహనం తీసుకువెళ్తానని, చింతమనేని పోలీసులకి చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read