ప్రకృతిని పలకరించుకుంటూ ఎత్తై కొండల్లో..జలపాతాలు, అహ్లాదకరమైన వాతావరణం నడుమ ప్రయాణం సాగించాలని ఎవరు కోరుకోరు...! ఆంధ్రాఊటిగా ప్రసిద్ధి గాంచిన అరకు వ్యాలీ ప్రయాణమంటే చాలు ఎవరైనా ఎగరేసి గెంతేస్తారు. బస్సు సౌకర్యమున్నా...84 బ్రిడ్జిలను, 58 సొరంగాలనూ చీల్చుకుంటూ వంపులు తిరిగే రైలులో ప్రకృతి అందాలను చూడాలని ప్రయాణికులు ఎక్కువ మక్కువ చూపిస్తారు.

ఇరుపక్కల నుంచి చూస్తే పచ్చదనం కలబోసిన ప్రకృతి సౌందర్యం.. తల పెకైత్తి చూస్తే నీలాకాశం.. బోగీ లోపల విభిన్న ఆకృతిలో కళ్లు చెదిరేలా రూపొందించిన డిజైన్లు.. అటూ ఇటూ కదిలే కుర్చీలు.. పారదర్శకంగా ఉండే అద్దాలు.. శీతలాన్ని వెదజల్లే బోగీలు.. ఇవన్నీ విశాఖ నుంచి అరకు వెళ్లే అద్దాల రైలుకు సొంతం..! ఎన్నాళ్ల నుంచో ఇదిగో.. అదిగో.. అంటూ ఊరిస్తున్న ఈ అద్దాల (విస్టాడూమ్) రైలు రెడీ అయ్యింది.

దేశ, విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు నిత్యం అరకుని సందర్శిస్తారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా చిరకాల నేస్తమైన కిరండోల్ పాసింజర్‌ని చటుక్కున ఎక్కేసి ఎంచక్కా...ప్రకృతిని చుట్టేస్తారు. ఇప్పుడా నేస్తం కొత్త హంగులు అద్దుకుని, నగరవాసుల చిరకాల స్వప్నమైన అద్దాలరైలుగా మనముందుకు రాబోతోంది.

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన చెన్నైలోని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) ఇప్పుడు కొత్త రికార్డు సాధిస్తోంది. అత్యాధునిక రైలు పెట్టెల తయారీతో ప్రయాణికులను, పర్యాటకులను ఆకర్షించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అరకు అందాలను వీక్షించడానికి అద్దాల రైలు పెట్టెలను తయారు చేసి అక్కడి రైల్వే అధికారులకు అందజేస్తోంది.

ఈ పెట్టెలు మంగళవారం చెన్నై నుంచి బయలుదేరి వెళ్లనున్నాయి. రిజర్వేషన్‌ లేని అంత్యోదయ, దీన్‌దయాళ్‌ రైలు పెట్టెలను తయారు చేసిన ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ స్టెయిన్‌లెస్‌ స్టీలు కోచ్‌లు తయారు చేసి రికార్టు సృష్టిస్తోంది. ప్రస్తుతం మరో మెట్టు ఎక్కి ఆంధ్రప్రదేశ్‌, కశ్మీర్‌ రాష్ట్రాలలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు మొదటిసారిగా పైకప్పు అంతా ప్రత్యేక అద్దాలతో నిండిన రైలు పెట్టెలను రూపొందించింది.

రొటేటింగ్‌ కుర్చీలతో తయారు చేస్తున్న మొదటి పర్యాటక కోచ్‌ మంగళవారం చెన్నై నుంచి విశాఖపట్నానికి పయనమవనుంది. ఊటీలో నడుస్తున్న కొండ రైలు మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లోని అరకు వ్యాలీలో ఐఆర్‌సీటీసీ పర్యాటక రైలుని నడుపుతోంది. ఈ రైలుకు పూర్తిగా పైకప్పుతో సహా అద్దాలతో నిండిన బోగీని రూపొందించింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలలో నడపడానికి కూడా అత్యాధునిక కోచ్‌ల తయారీకి ఐసీఎఫ్‌కి ఆర్డర్‌ వచ్చింది.

వీటి ప్రత్యేకత ఏమిటి?

  • దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా కోచ్‌లను ఐసీఎఫ్‌ తయారు చేస్తోంది
  • వోల్వో బస్‌లలో అద్దాలు అమర్చే రీతిలో ఈ బోగీలకు అద్దాలు అమర్చబడి ఉంటాయి
  • బయటి వాతావరణానికి తగిన రీతిగా పగలు, రాత్రిని ప్రతి ఫలింపజేసే విధంగా ఉండే రైలులో రొటేటింగ్‌ కుర్చీలు
  • రొటేటింగ్‌ కుర్చీల వల్ల ప్రకృతి సోయగాలను 360 డిగ్రీలలో తిరిగి చూడవచ్చు
  • కోచ్‌ మొత్తం స్టెయిన్‌లెస్‌ స్టీలుతో తయారు
  • టీవీ సౌకర్యం
  • ఫస్ట్‌క్లాస్ ఎ.సి సదుపాయం ఉంటుంది
  • 108 సీట్లతో చైర్‌కార్ సిట్టింగ్ ఉంటుంది
  • టికెట్‌ధర 300 నుంచి రూ. 400 వరకూ ఉండొచ్చు
  • సాధారణ కోచ్‌కు రూ.60 నుంచి రూ.70 లక్షల మధ్య వ్యయ అంచనా అయితే..విస్టోడోమ్ కోచ్‌కు..మరో రూ.30 లక్షలు అదనంగా ఖర్చుకానున్నాయి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బద్రాద్రి రాముడిదే వైభోగం అంతా... పట్టుబట్టలు తలంబ్రాలు సమర్పించేది ఆయనకే.... కాని రాష్ట్రం విడిపోయాక ఇక్కడ బద్రాద్రిగా, ఏ దేవాలయాన్ని ప్రకటించాలి అని పలు తర్జన బర్జనలు జరిగాక కడపలోని ఒంటిమిట్టను ఆంధ్ర బద్రాద్రిగా ప్రకటించారు.... ఆ క్షేత్ర విసిస్టత అలాంటిది... ఎంతో చారిత్రక వైభోగం గల ఒంటిమిట్ట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంతగా ప్రాశస్త్యం పొందలేదు.... కాని బద్రాద్రికి మించిన స్థల పురాణం ఒంటిమిట్టకు ఉంది...

శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం. త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరామునికి అనుంగు భక్తుడైన ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ లేకపోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఆంజనేయుని రాకకు ముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్టు తెలుస్తోంది.

ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది.

జాంబవత స్థాపితం
వానరులలో బ్రహ్మజ్ఞాని జాంబవంతుడు. ఆయన ఎన్నో యుగాలను చూశారు. అనుభవశీలి, మేధావి, శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న అనంతరం సీతారామ, లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. కొద్దికాలానికి సంజీవరాయ మందిరంలో ఆంజనేయ విగ్రహాన్ని నెలకొల్పారు. కలియుగంలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ఒంటెడు, మిట్టడు అనే సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వారి పేరుతోనే ఒంటిమిట్టగా ఈ గ్రామం ఖ్యాతిచెందింది. వీరి విగ్రహాలను కూడా ఆలయప్రాంగణంలో చూడవచ్చు.

అద్భుతమైన ఆలయ నిర్మాణం
ఆలయ నిర్మాణం విజయనగర వాస్తు శైలిలో అద్భుతంగా నిర్మితమైవుంటుంది. మూడు గోపురాలు సుందరంగా వుంటాయి. ఆలయం లోపల స్తంభాలు, గోడలపై సజీవమైన చిత్రకళను వీక్షించవచ్చు. విఘ్నేశ్వరుడు నాట్యభంగిమలో ఉండి భక్తులకు ఆశీర్వచనం ఇస్తుంటాడు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఫ్రెంచ్‌ యాత్రీకుడు టావెర్నియర్‌ ఆలయ గోపురం దేశంలోని పొడవైన గోపురాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి అనేక సంకీర్తనలు రచించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతనామాత్యులు ఆ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామభద్ర కవి ఈ ప్రాంతానికి చెందిన వాడేనని తెలుస్తోంది. ఆంధ్ర వాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం విశేషం.

పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని కల్యాణం
రామాలయాలన్నింటా కల్యాణాన్ని మధ్యాహ్న సమయంలో అభిజిల్లగ్నంలో జరిపించడం ఆనవాయితీ. ఒంటిమిట్టలో రాత్రిపూట పండువెన్నెల్లో నిర్వహిస్తారు. చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

రాష్ట్ర ఉత్సవంగా బ్రహ్మోత్సవాలు
రాష్ట్ర విభజన అనంతరం కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించారు. కడపజిల్లా ఒంటిమిట్ట ఆలయంలో ఈ నెల పదో తేదీన సీతారామ కల్యాణాన్ని రాష్ట్ర మహోత్సవంగా జరపనున్నారు.

ఎలా చేరుకోవచ్చు
* కడప-తిరుపతి రహదారిపై వుంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
* రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది.
* కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది.
* తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.

తమిళనాడు వేళాంగిణి మాత చర్చ్‌ తర్వాత మేరీ మాత చర్చ్‌ అనగానే విజయవాడలోని గుణదల జ్ఞప్తికి వస్తుంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పర్వదినాల్లో పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.

దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతి పెద్ద క్షేత్రం – గుణదల మేరీమాత చర్చి. ఫ్రాన్సులోని లూర్థు నగరం సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చ్‌ను పోలినట్టుగా విజయవాడ శివారులోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. తమిళనాడు వేళాంగిణి మాత చర్చ్‌ తర్వాత మేరీ మాత చర్చ్‌ అనగానే గుణదలే జ్ఞప్తికి వస్తుంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ రోజున పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. సాధారణ రోజుల్లో శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఉంటుంది. ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న క్షేత్రం కనుక ఈసారి మరిన్ని హంగులతో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2017 ఉత్సవాలకు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు హాజరవడానికి సిద్ధపడుతున్నారు.

చరిత్ర: అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్‌ జోసఫ్స్‌ ఇనిస్టిట్యూట్‌ పేరున ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. దానికి రెక్టర్‌గా ఇటలీకి చెందిన ఫాదర్‌ పి. అర్లాటి నియుక్తులయ్యారు. ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందడంతో 1971లో పూర్తిస్థాయి చర్చి నిర్మితం అయ్యింది. గుడి అంకురార్పణ జరిగిన నాటి నుంచి అనాథబాలలు, క్రైస్తవ మత కన్యలు, కథోలికులు (క్యాథలిక్స్‌) ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మరియమ్మ (మేరీ మాత) ఉత్సవాలు నిర్వహించు కునేవారు. 1933లో ఫాదర్‌ అర్లాటి ఆ«ధ్వర్యంలోనే ఈ కొండ శిఖరాగ్రాన ఓ శిలువ ప్రతిష్ఠితమైంది. 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కథోలికులు, ఫాదర్‌ అర్లాటి ఆధ్వర్యంలో కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, గుహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు.

1947 నుంచి తిరనాళ్ళు: 1946లో అప్పటి ఫాదర్‌ బియాంకి, జిప్రిడా, బ్రదర్‌ బెర్తోలి, ఎల్‌క్రిప్పాలు గుణదల కొండపై మరియమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, గుహ వద్ద భారీగా బలిపీఠాన్ని నిర్మించతలపెట్టారు ఇందులో భాగంగా గుహ వద్ద ఉన్న శిలను తొలిచేందుకు పూనుకున్నారు. అయితే 1947లో ఫాదర్‌ బియాంకి అకస్మాత్తుగా ఇటలీ వెళ్లాల్సి వచ్చింది. నిర్మిస్తున్న బలిపీఠానికి సంబంధించిన నిర్మాణాలు అప్పుడు కురిసిన భారీవర్షానికి కొట్టుకు పోయాయి. అయినా సరే మిగిలిన ఫాదర్లు నిరుత్సాహపడలేదు. ఫాదర్‌ బియాంకి వచ్చే సమయానికి తిరిగి నిర్మాణ పనులు పూర్తిచేశారు. ఫలితంగా 1947లో భారీ స్థాయిలో మరియమాత ఉత్సవాలు జరిగాయి. దక్షిణాన విస్తృత ప్రచారం పొందాయి. 1948లో కలరా ప్రబలిన కారణాన ఆ ఒక్క సంవత్సరం తప్ప ప్రతి ఏటా అంతకంతకూ ఈ ఉత్సవాలు పెరుగుతున్నాయి. ఇవాళ గుణదల మాత ఉత్సవాలంటే తెలియనివాళ్ళు లేరు.

ఫిబ్రవరిలోనే ఎందుకు..?
ఫ్రాన్సులోని లూర్థు నగరం దాపున ఉన్న కొండ అడవిలో బెర్నాడెట్‌ సోబిరస్‌ అనే పధ్నాలుగేళ్ల బాలిక వంట కలప ఏరుకునేందుకు వెళ్లగా అక్కడ మేరీ మాతను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది. ఆ తేదీ ఫిబ్రవరి 11. ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించినందువల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతాయి కనుక గుణదలలో కూడా ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి జనవరి 31న నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూర్వం ఫిబ్రవరి 11న ఒక్కరోజే ఉత్సవాలు జరిగేవి. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదల మాత ఉత్సవాలు నిర్వహణ జరుగుతోంది.

భక్తిశ్రద్ధలతో... శిలువ మార్గం
గుణదల కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు చెదురుమదురు కాలిబాటలు ఉండేవి. అయితే 1951లో గుహకు ఇరువైపులా ఆర్చిలను నిర్చించి, శిలువ వరకు మెట్లమార్గం ఏర్పాటు చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా, జపమాల పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా నవదిన ప్రార్థనల్లో పుణ్యక్ష్రేతం రెక్టర్‌ చర్చి నుంచి గుహ వరకు దివ్యసత్‌ ప్రసాద పూజను నిర్వహిస్తారు.

మొక్కులు తీర్చుకునే రోజులు
మేరీ మాత ఉత్సవాలు జరిగే మూడు రోజులూ క్రైస్తవులంతా భక్తిప్రపత్తులతో హాజరై మొక్కులను తీర్చుకుంటారు. నవంబర్‌లో జరిగే ప్రత్యేక ఆరాధనలకు, నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు సాగే ప్రత్యేక ప్రార్థనలకు కూడా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు రావడం ఆనవాయితీగా వస్తోంది.

అరకు అంటే ప్రకృతి అందాలు, అమాయక గిరిజనం, మనల్ని మనం మరిచిపోయే కొండకోనలు దృశ్యాలు గుర్తొస్తాయి. అంతేనా..? ప్రపంచాన్నే కట్టిపడేసే అర్గానిక్ కాఫీ రుచికి కూడా కేరాఫ్ అడ్రస్ అరకే. ఏజెన్సీ ఏరియను దాటి ప్రస్తుతం సప్తసముద్రాల అవతల ఉన్న కాఫీ ప్రియులను సైతం మైమరింపచేస్తోంది అరకు కాఫీ.

ఇప్పటివరకు అరుదైన నాణ్యత గల ఉత్పత్తులు పారిస్ వంటి నగరాల నుంచి భారతదేశానికి వస్తుంటాయి. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా మన తెలుగింట పండిన అరకు కాఫీ విదేశంలో గుభాళిస్తోంది. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు మెరుగైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో, అరకు ప్రాంతంలో భారీ ఎత్తున కాఫీ సాగును ప్రోత్సహించడమే కాకుండా, అరకు కాఫీని ఒక అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అమోఘం. చంద్రబాబు దార్శనికత ఫలితంగా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత పారిస్ మార్కెట్ లోకి అరకు కాఫీ అడుగు పెడుతోంది. ప్రపంచంలో టాప్ కాఫీ బ్రాండ్ లకి, పోటీ ఇవ్వనుంది, మన అరకు కాఫీ..

చంద్రబాబుతో పాటు నాలుగు వ్యాపార దిగ్గజ సంస్థల అధిపతులు కూడా ఈ కృషిలో భాగస్వాములయ్యారు. మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సోమా నిర్మాణ సంస్థ చైర్మన్ మాగంటి రాజేంద్రప్రసాద్ లు పారిస్ లో అరకు కాఫీ మొదటి స్టోర్ ప్రారంభం అయ్యేందుకు కారణమయ్యారు. ఈ సంస్థల ఆధ్వర్యంలో 20,000 ఎకరాలలో కాఫీ పంట సాగవుతోంది. ఈ సంస్థలే అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్ ను తెచ్చి పెట్టారు. ఇప్పుడు అరకు కాఫీ పారిస్ లో అడుగుపెట్టడం అన్నది 150 గిరిజన తెగల విజయం. ఐదు వేరియెంట్లలో అమ్ముడు కానున్న అరకు కాఫీ ధర కిలో రూ.7,000లుగా ఉండనుంది.

విశాఖ మ‌న్యంలో గిరిజ‌నులు పండిస్తున్న కాఫీకి చంద్ర‌బాబు త‌న వంతు ప్ర‌మోట్ చేస్తున్నారు. చంద్ర‌బాబు దేన్నైనా ప్ర‌మోట్ చేయాల‌నుకుంటే దాన్ని ఓ రేంజ్‌కు తీసుకెళ్లే వ‌ర‌కు వ‌ద‌ల‌రు. తాజాగా ఆయన విశాఖ మన్యం అరకులో పండిస్తున్న అరకు కాఫీని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. రాష్ట్రానికి వచ్చే ప్రముఖులు ఎవరైనా సరే.. వారికి అరకు కాఫీని రుచి చూపించి.. దాని గొప్పతనం వివరించి చెప్పటమే కాదు.. అరకు కాఫీ మీద సర్వత్రా ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఈ కాఫీని గిఫ్ట్‌గానూ ఇస్తున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన ‘అరకు కాఫీ’, ‘అరకు వ్యాలీ కాఫీ’ పేరుతో ఆర్గానిక్ కాఫీ మార్కెట్లోకి వస్తోంది. ఈ కాఫీ తయారీకి గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటలకు అనువైన వాతావరణం ఉంది. ప్రస్తుతం అక్కడ 96,337 ఎకరాల్లో కాఫీ పంట సాగవుతోంది. ఇందులో అరబికా రకాన్నే గిరిజన రైతులు అత్యధికంగా పండిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ అరకులో పండించే అరబికా రకం కాఫీకి మంచి డిమాండ్ ఉంది.

కృష్ణా జిల్లాలోనే కాక ఇరుగు పొరుగు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ తిరునాళ్లకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. సోమవారం రాత్రి మెట్టినింటి నుంచి అమ్మవారు బయలుదేరి మంగళవారం సాయంత్రం ఉయ్యూరు ప్రధాన రహదారి పై ఉన్న ఆలయానికి చేరుకుని ఈనెల 26 వరకు భక్తలకు దర్శనమిస్తారు. భక్తులు గండదీపాలతో మొక్కులు తీర్చుకుంటారు. తిరునాళ్ల ముగింపు రోజు రాత్రి ఆలయం నుంచి బయలుదేరి మెట్టినింటికి చేరుతుంది. అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం తిరునాళ్ల ప్రాంరభం రోజున ఉయ్యూరు పట్టణ పోలీసులు పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తారు.

తిరునాళ్లలో 11వ రోజైన, 16వ తేదీన జరిగే శిడిబండి వేడుక వైభవంగా జరుగుతుంది. కొబ్బరితోట ప్రాంతం నుంచి శిడిబండి బయలుదేరి శివాలయం రోడ్డు, ప్రధాన సెంటర్ మీదుగా ఆలయానికి చేరుకుంటుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

అమ్మవారి చరిత్ర
వీరమ్మతల్లి చరిత్ర గురించి పెద్దలు చెప్పే కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తాలుక పెద్ద కడియం గ్రామంలో బొడు పరుసురామయ్య, పార్వతమ్మ దంపతుల ముదుబిడ్డ శివ వీరమ్మకు ఎనిమిదో ఏట ఉయ్యూరుకు చెందిన పారుపూడి చలమయ్య చెల్లమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో వివాహం జరిపించారు. వివాహానంతరం యుక్తవయస్సు వచ్చిన శివ వీరమ్మను కాపురానికి పంపారు. చింతయ్య వీరమ్మల సంసారం ఆనందంగా సాగుతున్న సమయంలో కరణం సుబ్బయ్య కళ్ళు వీరమ్మపై పడ్డాయి. ఉయ్యూరు గ్రామం లో ,కరణం సుబ్బయ్య కు స్త్రీ వ్యామోహం ఎక్కువ. ఆమెను లోబరుచుకునేందుకు సుబ్బయ్య చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అతని బావమరిదితో చింతయ్యను హతమార్చేందుకు పధకం రూపొందించి చంపుతారు. ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లి పోతుంది. తాను ప్రేమించిన భర్తతో సహ గమనం చేయాలని నిస్చయించుకొంది .

తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకొని, అతని వంశం నిర్వంశం కావాలని శపించింది .సుబ్బయ్య అకస్మాత్తు గా చని పోయాడు .అతనితో అతని వంశము అంతరించింది .వీరమ్మ పుట్టినింటి వారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారు. ఆమె కోపం వచ్చి పుట్టి నింటి వారిని కూడా ”నిర్వంశం ”కావాలని శాపంపెట్టింది. సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబు ప్రతినిధి ”జిన్నా సాహెబ్ ”అంగీకరించారు. చింతయ్యకు చితి ఏర్పాటు చేయించారు. వీరమ్మ కు అగ్ని గుండం ఏర్పాటు అయింది. గుండం తవ్వ టానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోక పొతే, మాదిగ వారు వచ్చి తవ్వారట అందుకే సిడి బండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ముత్తైదువులు పసుపు దంచుతుంటే, రోలు పగిలింది. వీరమ్మ తల్లి మోకాలు అడ్డు పెట్టి ,తానూ రోకటి పోటు వేసింది. ముత్తైదువులకు పసుపు, కుంకుమలు పంచి పెట్టింది. ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కన్పిస్తుంది. చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు. వేలాది ప్రజలు భోరున విలపిస్తుండగా, అత్తా మామలు, బంధు గణం శోక సముద్రంలో మునిగి ఉండగా పుణ్య స్త్రీలతో, తోడి కొడాలితో ,”పారెళ్ళు ”పెట్టించుకొని, పెళ్లి కూతురులా ,పుష్పాలతో శిరోజాలను అలంకరించుకొని, సాధ్వీమ తల్లి, పతివ్రతా శిరోమణి, వీరమ్మ తల్లి, భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి, భగ భగ మండే ఆ మంటలో తానూ, భర్త చితి పై చేరి అగ్ని గుండంలో సహ గమనం చేసింది. ఆదర్శ మహిళగా, మహిమ గల తల్లిగా ఆ నాటి నుంచి, ఈ నాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకొంటోంది.

అందరూ ఆలోచించి, వీరమ్మ అత్త మామల తో సంప్రదించి, గ్రామస్తులతో సమావేశం జరిపి, సహగమనం జరిగిన చోటులో ఆలయాన్ని నిర్మించారు. చెరువు తవ్వించారు. వీరమ్మ, చింతయ్యల విగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు. ఆమె సహగమనం చేసిన రెండు మూడు రోజులకే మాఘ శుద్ధ ఏకాదశి రావటం, అదే భీష్మ ఏకాదశి కావటం ఆ రోజూ నుంచే ఉత్సవాలు ప్రారంబించటం జరుగుతోంది.

తిరునాళ్ళు పదిహేను రోజుల్లోను, ఉయ్యూరులో ఏ ఇంట్లోను పసుపు దంచరు, కుంకుమ తయారు చేయరు. ముందే సిద్ధం చేసుకొంటారు. కారం కూడా కొట్టరు. ఇవి స్వచ్చందంగా అందరు పాటించే నియమాలే. తిరునాళ్ళ రోజుల్లో, బంధువులను పిల్చుకొని విందు భోజనాలు ఏర్పాటు చేసుకొంటారు . ఆమె పవిత్రతను ఇలా తర తరాలుగా పాటిస్తూ, నేటికీ నిలబెట్టు కొంటున్నారు ఉయ్యూరు, పరిసర గ్రామాల ప్రజలు.

More Articles ...

Page 2 of 2

Advertisements

Latest Articles

Most Read