వైఎస్ వివేక కేసు, రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి విచారణ మారగానే, ఒక్కసారిగా స్పీడ్ పెరిగింది. గత కొంత కాలంగా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుంది అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రాగానే, ఏపిలో విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల పైన అనేక రకాల ఒత్తిడులు పెట్టారు. అయితే కోర్టు ఆదేశాలు ప్రకారం, ఈ కేసు తెలంగాణాకు బదిలీ అయ్యింది. అప్పటి నుంచి సిబిఐ స్పీడ్ పెంచింది. వెంటనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే అవినాష్ రెడ్డి మాత్రం, తనకు సమయం లేదని, అయుదు రోజుల తరువాత వస్తానని చెప్పారు. దీంతో సిబిఐ మళ్ళీ రెండో నోటీసు ఇచ్చింది. అవినాష్ రెడ్డి ఈ నెల 28న విచారణకు కావాలని రెండో నోటీసు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నట్టు ఉండి సిబిఐ అధికారులు పులివెందుల బయలు దేరి వెళ్లారు. రెండు వాహనాల్లో అవినాష్ రెడ్డి ఇంటికి సిబిఐ అధికారులు వెళ్లారు. అవినాష్ రెడ్డి అక్కడ లేకపోవటంతో, ఎక్కడికి వెళ్ళారో ఆరా తీసారు. అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలు పరిశీలించారు. ఇంకా ఆధికారులు అక్కడే ఉన్నారు. ఏమి జరుగుతుందా అని టెన్షన్ నెలకొంది.
news
టిడిపి-జనసేన వైపు కాపులు వెళ్లకుండా జగన్ కోసం కేసీఆర్ వ్యూహం పన్నారా ?
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ ఎందుకు మార్చారో తెలియదు కానీ, ఈ పార్టీ ఏపీలో పనిచేసేది మాత్రం జగన్ వైసీపీకి లాభం చేకూర్చడానికేనన్నది మాత్రం స్పష్టమైందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకంగా మారడంతో అవి టిడిపి-జనసేనకి పడకుండా చూసే బాధ్యతని బీఆర్ఎస్ తీసుకుందని నిర్ణయాలు తేటతెల్లం చేస్తున్నాయి. కాపులకి టిడిపి ఇచ్చిన రిజర్వేషన్ తీసేయడం, కాపు కార్పొరేషన్ కి నిధులు ఇవ్వకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన కాపులు కూడా దూరం అయ్యారు. ఈ ఓట్లు టిడిపికి వెళ్లినా, జనసేనకి పడినా చాలా సీట్లు వైసీపీ కోల్పోతుంది. ఈ పరిస్థితి నుంచి వైసీపీని గట్టెక్కించడానికి కేసీఆర్ బీఆర్ఎస్ ని రంగంలోకి దింపారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీపై కోపంగా వున్న కాపునేతలు, ఓటర్లు ఎవరూ టిడిపి, జనసేన వైపు వెళ్లకుండా బీఆర్ఎస్లోకి ఆకర్షించడమే కేసీఆర్ ప్లాన్ అని తెలుస్తోంది. తాజాగా ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాపు నేతలు హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. టిడిపిలోనే కొనసాగుతానని మొన్ననే చంద్రబాబుని కలిసొచ్చిన గంటా శ్రీనివాసరావు, బీజేపీ అధిష్టానం తీరుతో గుర్రుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణలు ఈ భేటీలో ఉన్నారు. మరోవైపు కాపు జాతి ప్రముఖులైన ముద్రగడ పద్మనాభం వంటి వారు ఎలాగూ వైసీపీ కోసం పనిచేసేవారే. మరికొందరిని కూడా బీఆర్ఎస్లో చేర్చాలని కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ మేరకు తోట చంద్రశేఖర్ ఏపీలో కాపు నేతలతో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం.
ప్రచార పిచ్చకి పరాకాష్ట.. వైసీపీ కరపత్రాలుగా మారిన విద్యార్థులు పుస్తకాలు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నుంచీ ప్రచారపిచ్చి పరాకాష్టకు చేరిందని కథనాలు వచ్చాయి. పచ్చనిచెట్లు కొట్టేసి, వాటికి మోడుకి వైసీపీ రంగులు వేయడం, పథకాల పేర్లు మార్చేయడం దగ్గర నుంచీ ప్రతీ విషయంలోనూ సీఎం జగన్ పబ్లిసిటీ పిచ్చ చూపించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. కేస్ట్ సర్టిఫికెట్ల మీద, పాసుబుక్కుల మీద, కొలతల రాళ్ల మీద కూడా జగన్ రెడ్డి ఫోటోలు వేసుకోవడం చూసి సామాన్య జనం మా హక్కులపై జగన్ ఫోటోలేంటి అని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వ పెద్దలు విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, స్టడీమెటీరియల్, నోటు బుక్కులపైనా తమ ఫోటోలు, పార్టీ రంగులు వేసుకోవడం అన్నివర్గాల నుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని 480 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూ. 1.20 కోట్లు వెచ్చించి 49వేల తెలుగు-ఆంగ్ల మాధ్యమ స్టడీ మెటీరియల్ పుస్తకాలను ముద్రించడానికి జడ్పీ నిధులు వెచ్చించారు. ‘జగనన్న విద్యా భారతి’ పేరుతో ముద్రించిన ఈ స్టడీ మెటీరియల్ పుస్తకాలపై సీఎం జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, జెడ్పి చైర్మన్, సీఈఓల ఫోటోలు వేశారు. మెటీరియల్ ఇంగ్లీషు మీడియం..కవర్ పై వైసీపీ ప్రకటనలు తెలుగులో ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చే స్టడీ మెటీరియల్ పై వైసీపీ నేతల ఫోటోలు, రంగులు వేయడంపై విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి అనిల్ కి వైసీపీ మార్క్ బుల్లెట్టు దిగినట్టుంది
అసెంబ్లీలో బుల్లెట్టు భాషతో బాగా ఫేమస్ అయ్యారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్. మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య..బుల్లెట్టు దిగిందా లేదా అంటూ పోకిరి డైలాగులు కొట్టి చివరికి మంత్రి పదవి పీకేయడంతో కనుమరుగు అయ్యాడు. రాష్ట్ర కేబినెట్లో ఉంటూ హల్చల్ చేసిన అనిల్ నోటిపారుదల మంత్రిగా, ఇరిటేషన్ మంత్రిగా కూడా పేరుపడ్డారు. చివరికి మంత్రి పదవి పోవడంతో నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. ఇక్కడా మనశాంతిగా ఉండటానికి వీల్లేకుండా వైసీపీలో పెద్దలు చేశారు. ఆర్థికంగా బలవంతుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆల్రెడీ రాజ్యసభకి పంపారు జగన్. ఇప్పుడు ఆయన తన భార్యకి అనిల్ సీటు అడుగుతున్నారు అనే ప్రచారం ఉంది. ఇదీ ఓకే అయ్యిందని టాక్ వినిపిస్తోంది. అనిల్ కుమార్ యాదవ్‌తో బాగా సన్నిహితంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరం అయ్యారు. అనిల్ ఆనుపానులన్నీ తెలిసిన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కూడా అబ్బాయ్ తో విభేదాలు మొదలయ్యాయి. మంత్రిగా ఉన్నప్పుడే జిల్లాలోని రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలతో అనిల్ కి సఖ్యత లేదు. మంత్రి పదవి పోయాక అనిల్ పేరు వింటేనే ఆ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో వేమిరెడ్డి నెల్లూరు సిటీ సీటుపై కర్చీఫ్ వేసేశారు. ఇది తెలిసిన నుంచి అనిల్ తనలో తానే రగిలిపోతున్నాడు. తాజాగా మీడియా ముందుకొచ్చి తన అక్కసునంతా వెళ్లగక్కేశాడు. అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తు న్నాడు.. రాసుకోండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో పోలవరం డిసెంబర్ 2020 అని డేట్ ఫిక్స్ చేశాడు. 2023 డిసెంబర్ రాబోతోంది కానీ పోలవరం పూర్తి కాలేదు. ఆ పోలవరం చాలెంజ్ మాదిరిగానే ఈ సీటు చాలెంజ్ కూడా అని నెల్లూరు టాక్. అంతే కాదు, తాను జగన్ కు తప్ప ఎవరికీ తల వంచను అని, నేను పెద్దోడిని నా ముందు తల వంచాలి అంటే కుదరదని, నెల్లూరులో వైసీపీ పెద్దలకు చెప్పకనే చెప్పారు. అనిల్ కు ఈసారి ఎన్నికల్లో టికెట్ లేదని సిటీ నియోజ కవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుండడంతో పోటీచేసేది తానే రాసి పెట్టుకోండంటూ అనిల్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. అయితే అనిల్ కి వైసీపీ మార్క్ బుల్లెట్టు దిగి చాలా రోజులవుతోందని, మనిషి కొంచెం ఫిట్‌గా ఉండడం వల్ల తెలియడంలేదని పంచ్ డైలాగులు వైసీపీ క్యాంప్ నుంచే పేలుతున్నాయి. మరి జగన్ ని ఇంతలా నమ్ముకున్న అనిల్ ను, జగన్ ఏమి చేస్తారు, మళ్ళీ నెల్లూరు సీటు ఇస్తారా, ఎక్కడైనా సర్దుబాటు చేస్తారా అనేది చూడాలి మరి.