krishna pushkaralu 3 07072016

విజయవాడకి చరిత్రలో చాలా పేర్లు ఉన్నాయి . బిజియివాడు, విజయివాడ, బిజవాడ, బీజవాటిక, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, చోళరాజేంద్రపురం, చోళరాజేంద్ర విజయపురం, మల్లికార్జున మహాదేవపురం, విజయవాడ. ఇన్ని పేర్లు ఉన్నా చరిత్రలో చాలాకాలం బెజవాడగానే చలామణి అయింది.

ఆదిశంకరులు భగవాత్పాదులు భారతదేశమంతటా పర్యటించి, ప్రధాన ప్రదేశాలలో అష్టాదశ పీఠాలను స్థాపించి, శక్తి స్వరూపిణియైన జగధాంబను ప్రతిష్టించారు. ఆంధ్రప్రదేష్ లోని పిఠాపురంలో పురు హెుతుకాశక్తి, విజయవాటికలో కనక దుర్గాంబా సుప్రసిద్దమైనవి. శక్తి పీఠానికి స్థానం గనుక పీఠికాపురమనే పేరు. విజయాంబ అనే నామాంతరం గల దుర్గాదేవి కావాసం గనుక విజయవాటిక అని పేరు ఈ పట్టణాలు వహించాయి.

దుర్గాదేవి బీజశక్తి, కనక బీజవాటిక అనే పేరు ఈ నగరానికి వచ్చింది. బీజవాటి యొక్క వికృ తరూపం బెజవాడ ఈ పేరును గురించి మరొక విధంగా కూడా చెబుతారు. జైన బౌద్ధ బిక్షకులకు ఇదినివాన మై కొందరు చెబుతారు. ఎవరేమి చెప్పినా, పన్నెండువందల ఏళ్ళక్రితం దీనిని బెజవాడ అని పిలిచేవారని విష్ణువర్ధన మహారాజు వ్రాయించిన తామ్రాశాసనం చెబుతుంది. దేశంలో బౌద్ధమతం వెల్లివిరిసిన కాలంలో, అంటే క్రీస్తు మరణానంతరం 639 లో భారత దేశానికి వచ్చిన చైనా యాత్రీకుడు హ్యూన్‌ సాంగ్‌ బెజవాడను కూడా సందర్శించినట్టు రాసుకున్నాడు.

దుర్గామాత రాక్షస సంహారం తరువాత కొన్నాళ్ళు ఇంద్రకీలాద్రిపై విశ్రాంతి తీసుకుంటుంది. విజయం లభించిన ప్రదేశం (వాడ) కావడంవల్ల, ఆ పట్టణానికి విజయవాడ అనే నామం వచ్చిందని స్థల పురాణం. అలాగే, మహాభారతంలో శివునికీ, అర్జునికీ నడుమ ఇంద్రకీలాద్రి కొండపైనే సంగ్రామం జరిగిందని ఐతిహ్యం. అర్జునుడి శక్తికి మెచ్చి శంకరుడు అతడికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. అర్జునుడి నామాలలో ఒకటయిన విజయుడి పేరు మీద విజయవాడగా ప్రసిద్ధి పొందిందని కొందరి నమ్మకం.

ఇంద్రకీలాద్రి కొండ అప్పట్లో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకూ విస్తరించి ఉండేదనీ, చుట్టుపక్కల సుమారు పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేదనీ ఓ కథనం. మధ్యలోకి కృష్ణానది ప్రవాహం రావడంతో...కొండ మధ్యలో బెజ్జం ఏర్పడిందనీ ఆ తర్వాత రూపుదాల్చిన పీఠభూమిలోనే విజయవాడ నగరం వెలసిందనీ చరిత్రకారులు చెబుతారు. అందుకే, బెజవాడను మొదట్లో 'బెజ్జంవాడ' అని పిలిచేవారట.

Advertisements

విజయవాడకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? Last Updated: 07 July 2016