దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల నిర్వహణ రాష్ట్రంలోఉన్న తీరుగా లేదని, అడుగడుగునా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతున్నా, అధికారపార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా, అధికారయంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి దాస్యం చేస్తున్నా, ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీనేత, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ‍ప్రభుత్వాధినేతలు, అధికారులు విచ్చలవిడిగా నియమావళిని ఉల్లంఘిస్తున్న ఘటనలు కోకోల్లలుగా ఉన్నాయని, వాటన్నింటినీ ప్రతి గంటకోసారి మీడియాకు వెల్లడించాలని టీడీపీ నిర్ణయించుకుందని దీపక్ రెడ్డి చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సంఘటనలను మీడియాసాక్షిగా ఎన్నికల సంఘం, ప్రజల ముందుంచుతున్నామని, ఎన్నికల్లో గెలుపుకోసం ఎవరు అడ్డదారులు తొక్కుతున్నారో వారే తేల్చాలని ఆయన సూచించారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబసభ్యుడైన పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, టీడీపీతరుపున పోటీచేస్తున్న అభ్యర్థిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని, నామినేషన్లు వేయడానికి వెళ్లిన సదరు అభ్యర్థిపై దాడిచేయడమేగాక, అతనిచేతిలోని నామినేషన్ పత్రాలు లాగేసుకున్నాడని దీపక్ రెడ్డి పేర్కొన్నారు. (సుధీర్ రెడ్డి దాడిలో గాయపడిన వ్యక్తిని, అతనికి అయిన గాయాల ఫొటోలను ఈ సందర్భంగా విలేకరులకు చూపించారు.)

పట్టపగలే మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి, అధికారుల సమక్షంలో ఇంతటి ఘాతుకానికి పాల్పడినా, పోలీసులుగానీ, ఎన్నికల సంఘంగానీ అతనిపై ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే, రాష్ట్రంలో ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్నట్టా..లేనట్టా అనే అనుమానం ప్రజలందరికీ కలుగుతోందన్నారు. నామినేషన్లు వేయడానికి అవసరమైన పత్రాలు ఇవ్వకుండా నిన్నటివరకు అధికారులు వేధిస్తే, ఎలాగోలా అవి తీసుకొని నేడు నామినేషన్లు వేయడానికి వెళితే, అక్కడ దాడిచేయడం జరిగిందని దీపక్ రెడ్డి తెలిపారు. ఈ ఒక్క సంఘటనే కాదని, ఇలాంటివి అనేకం ఉన్నాయని, నేటి నుంచి (11-03-2020) ప్రతిరోజూ అధికారపార్టీ దౌర్జన్యాలను, దుర్మార్గాలను ఆధారాలతో సహా పత్రికాముఖంగా బయటపెట్టడమే తమ పని అని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలలో వైసీపీ పట్టణ అధ్యక్షుడైన వెంకటరమణ అనేవ్యక్తి, టీడీపీకి చెందిన బీసీ మహిళా అభ్యర్థికి ఫోన్ చేసి దూషించాడని, నామినేషన్ వేస్తే, ఆమె ఇంటిని కూలగొడతామని హెచ్చరించడం జరిగిందన్నారు. (దీనికి సంబంధించి వైసీపీనేత, సదరు మహిళా అభ్యర్థిని బెదిరించిన ఆడియో క్లిప్ (ఇరువురిమధ్య ఫోన్లో జరిగిన సంభాషణ) ను విలేకరుల సమావేశంలో వినిపించారు) చిత్తూరుజిల్లాలో రేణిగుంట ఎమ్మార్వో విజయసింహారెడ్డి నిన్నటివరకు తమపార్టీవారికి నామినేషన్లకు అవసరమైన ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా తప్పించుకు తిరిగాడని, మేము ఈసీకి ఫిర్యాదుచేయడంతో ఆఖరినిమిషంలో అవి మంజూరుచేసి, తనకు ప్రోటోకాల్ ఉందంటూ నామినేషన్లు తీసుకోకుండా వెళ్లపోయాడన్నారు.

ఎన్నికల నిబంధన అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రోటోకాల్ ఉండదని, కానీ సదరు ఎమ్మార్వో మాత్రం, టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తీసుకోకూడదనే కావాలనే కుంటిసాకుచెప్పి తప్పించుకున్నాడన్నారు. హైకోర్టు ఆదేశాలొచ్చి 24 గంటలవుతున్నా, నేటికీ శ్రీకాళహస్తిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర భవనాలకున్న వైసీపీ రంగులను తొలగించలేదన్నారు. చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో టీడీపీ అభ్యర్థులు ఉదయం నుంచి అధికారుల కార్యాలయాల ఎదుట వేచిచూస్తున్నా, వారి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోలేదని, ఇదంతా కావాలని చేయడం కాదా అని దీపక్ ప్రశ్నించారు. అదే జిల్లాలోని జీ.డీ.నెల్లూరులో తమపార్టీకి చెందిన అభ్యర్థి రవీంద్రకుమార్ నామినేషన్ పత్రాలు తీసుకొని, రిసీవ్ డ్ అని స్టాంపువేసి, అతనికి రసీదు ఇచ్చారని, తరువాత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పీ.ఏ.సుబ్రహ్మణ్యం చెప్పాడంటూ, నామినేషన్ పత్రాలను అధికారులు వెనక్కు ఇచ్చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకోల్లలుగా జరుగుతుంటే, ఎన్నికల సంఘం ఏం చేస్తోందని, మంత్రులే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తుంటే, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని దీపక్ రెడ్డి మండిపడ్డారు.

ఎన్నికలసంఘానికి తాము ఇప్పటివరకు అనేకఫిర్యాదులుచేశామని, వాటిపై ఇంతవరకు స్పందించలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చినప్పటినుంచీ, తమపార్టీ తరుపున తాముచేసిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ ఏవిధమైన చర్యలు తీసుకోలేదని, కాబట్టి వాటిని పత్రికాముఖంగా ప్రజలముందుకు తీసుకెళ్లి, అనంతరం హైకోర్టు ముందుంచాలని నిర్ణయం తీసుకున్నామని టీడీపీ ఎమ్మెల్సీ తేల్చిచెప్పారు. నేటి (11వతేదీ) సాయంత్రం లోగా ఎన్నికల సంఘం నిద్రమేల్కొని, నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై, అధికారయంత్రాంగాన్ని, పోలీసులను తమదౌర్జన్యాలకు ఉపయోగించుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా జరుగుతున్న సంఘటనలపై ఈసీ ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యలను మీడియాకు వెల్లడించాలన్నారు. అధికారులు తాము పనిచేయమని చెబుతున్నా, కుల,ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వమంటున్నా, నామినేషన్లు తీసుకోమని బహిరంగంగానే చెబుతున్నా, ఎన్నికల సంఘం ఎందుకుపట్టించుకోవడంలేదో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ ఆధారాలతో సహా వెల్లడిస్తున్న ఘటనలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే, తక్షణమే ఎన్నికలను నిలిపివేయాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈసీ, పోలీస్ స్పందించక పోవటంతో, ఇక కోర్ట్ కు వెళ్ళటమే మిగలి ఉందని చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పై, ఈ రోజు బొండా ఉమా, బుద్దా వెంకన్న పై జరిగిన హ-త్యా-యత్నం పై చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, ప్రజలకు దండం పెడుతూ, భావోద్వేగానికి లోనయ్యారు. "ప్రజలే నిర్ణయించుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా శాశ్వతంగా తాకట్లు పెట్టుకుంటారా, ప్రజలే ఆలోచించాలి. ఇది చూసిన తర్వాతైనా ప్రజలకు కనువిప్పు కలగాలి. రాజకీయ పార్టీలలో కనువిప్పు కలగాలి. ప్రజల్లో ఆలోచన జరగాలి. చేతులు దండం పెట్టి అడుగుతున్నా మీరు ఆలోచించండి అని. నేను నావంతుగా నియంతపై పోరాటం చేస్తున్నాను. వద్దని చెప్పండి నేను కూడా మానేస్తాను." అంటూ చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నేను వెళ్ళమంటే, బొండా ఉమా, బుద్దా వెంకన్న అక్కడకు వెళ్లారు, ఒక వేళ వారికి జరగరానిది ఏమైనా జరిగి ఉంటే, నేను జీవితాంతం బాధ పడుతూ, ఆ కుటుంబాలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉండేది. వారిని నేనే అక్కడకు పంపించాను అంటూ చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు... "ఇంత దుర్మార్గాన్ని ఎక్కడా చూడలేదు. రాక్షస రాజ్యం కూడా ఇలా ఉండదు. నిన్న బోదిలవీడులో కేస్ట్ సర్టిపికెట్ పైన అవన్నీ మీరు చూస్తే మావాళ్లు పోరాడి, నామినేషన్లు వేయడానికి వెళ్తే పేపర్లు చించేశారు. పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. దానిపై పార్టీ తరఫున ఫాక్ట్ ఫైండింగ్ కమిటి గా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్ ముగ్గురినీ పంపాం. అక్కడికి వెళ్తే వైసిపి వాళ్లెంత రా-క్ష-సం-గా వ్యవహరించారో మీరే చూడండి. వీళ్లు వెళ్తావుంటే, ‘‘అదిగో బ్లాక్ కార్’’ అని ఛేజ్ చేస్తున్నారో చూడండి..‘‘పెద్ద ఐరన్ రాడ్ తో కారు అద్దాల్లోగుండా ఎలా పొడుస్తున్నారో చూడండి..ఆ కారులో మనుషులు ఉన్నారు. అయినా రాక్షసంగా ఎలా దాడిచేశారో’’ ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. నేను ఎస్పీకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత కూడా జరిగిందంటే ఇంకా పోలీసులు ఉండీ ఎందుకు..? మీ ఇష్ట ప్రకారం చేస్తారా మీరు ..కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. అరాచక శక్తుల ఆగడాలను నియంత్రించలేరా..? దీనికి అధికారులే జవాబివ్వాలి..? కాశ్మీర్ లో, బీహార్ లో ఇలాంటి దుర్మార్గాలు జరగలేదు. అయినా రాజీలేకుండా పోరాటం చేస్తాం. ప్రజలే నిర్ణయించుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా శాశ్వతంగా తాకట్లు పెట్టుకుంటారా, ప్రజలే ఆలోచించాలి.
ఇది చూసిన తర్వాతైనా ప్రజలకు కనువిప్పు కలగాలి. "

"రాజకీయ పార్టీలలో కనువిప్పు కలగాలి. ప్రజల్లో ఆలోచన జరగాలి. వాళ్లు ముగ్గురు చనిపోతే ఎవరిది బాధ్యత.? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా..? ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి వాళ్లు చనిపోవాల్నా? ర-క్త-పు మ-డు-గు-లో వాళ్లు కనబడటం లేదా..? ఏమనుకుంటున్నారు మీరంతా...? ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని.? వల్లకాడు చేస్తారా రాష్ట్రాన్ని..? అడ్డం వచ్చినవాళ్లపై దాడులు చేస్తారా? పోలీసు వాహనాలపై దా-డి-చే-సే ధైర్యం వచ్చిందంటే ఏమనాలి..? నేను ప్రతి నిముషం పిటిషన్లు పెట్టుకుని ఎన్నికల్లో పోటి చేయాల్నా..? స్వేచ్ఛ లేదా మాకు నామినేషన్లు వేయడానికి, నాజీవితంలో ఎప్పుడూ చూడలేదు. చూద్దాం ఎక్కడిదాకా వెళ్తారో..? ప్రజాదరణ ఉంటే ఎందుకు భయపడుతున్నారు..? ఎందుకీ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు? చేతులు దండం పెట్టి అడుగుతున్నా మీరు ఆలోచించండి అని. నేను నావంతుగా నియంతపై పోరాటం చేస్తున్నాను. వద్దని చెప్పండి నేను కూడా మానేస్తాను. రాష్ట్రంలో ఎక్కడ ఉంటే రక్షణ చెప్పండి..? ఇంట్లో ఉంటే రక్షణా, ఆఫీసుకు వెళ్తే రక్షణా, ఎక్కడుందీ రక్షణ అని ఈ పోలీసులను ప్రశ్నిస్తున్నా..? చెప్పుకోడానికి కూడా అవకాశం దొరకని డిజిపి ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్లకే రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ కల్పిస్తారు మీరు. ’’ అంటూ చంద్రబాబు అగ్రహోదగ్రుడయ్యారు.

త్వరలో జరగ నున్న రాజ్యసభ ఎన్నికల బరిలోకి తెదేపా దిగాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా కొత్త ఎత్తు గడను తెరపైకి తీసుకు వచ్చారు. రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంఖ్యా బలం అధికంగా ఉన్న వైకాపా ఆ స్థానాల న్నింటిని కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సంఖ్యా బలం లేనప్పటికీ పార్టీ తరుపున అభ్యర్థిని బరిలోకి దింపి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా చూడాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి మరీ రాజ్యసభ బరిలోకి దిగుతు న్నామని తమ పార్టీ తరుపున పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం శాసనసభలో తెదేపాకు కేవలం 23 మంది సభ్యులు ఉండగా అధికార పక్షమైన వైకాపా 151 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇటీవల గుంటూరు, గన్నవరం ఎమ్మెల్యే లు మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీలు తెదేపాకు గుడ్ బై చెప్పి అధికారపక్షంతో కలిసి నడుస్తున్నారు.

ఈ రాజ్యసభ ఎన్నికలను ఆసరాగా చేసుకొని చేజారిన ఇద్దరు ఎమ్మెల్యేలను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు తెదేపా ప్రయత్ని స్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు పోలింగ్ జరిగేందుకు బ్యాలెట్ ను చూపి మరి ఓటు వేసే పరిస్థితి ఉండడంతో దీనిని కీలకంగా చేసుకొని చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారని చెబుతు న్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరు క్షణం ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుంది. దీంతో ఇరువురు రెబల్ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండడం లేదా తెదేపాకు వేయాల్సిన పరిస్థితి ఉందని లేని పక్షంలో వారిపై వేటు పడుతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఇదే విషయాన్ని చంద్రబాబు మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ విప్ జారీ చేస్తుందని దాని ప్రకారం నడుచుకోకపోతే అనర్హత తప్పదని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామా..? లేదా..? అన్నది కాదని అయితే రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచకాలను ప్రజలకు తెలియజెప్పేందుకేనని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య కు రాజ్యసభ అభ్యర్థిత్వం ఇవ్వడం ద్వారా బడుగులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ప్రజలకు స్పష్టమవు తోందని తెదేపా భావిస్తుంది. వన్ షాట్ .. టు బర్డ్స్ అనే విధంగా, ఇటు సామాజిక వర్గ సమీకరణం, మరోవైపు ఎన్నిక ఏకగ్రీవం కాకుండాచూడాలన్నదే టీడీపీ లక్ష్యంగా స్పష్టమవుతోంది. ఇక వంశీ, మద్దాల గిరి ఆడుతున్న డ్రామాలకు కూడా చెక్ పెట్టబోతున్నారు.

తెలుగుదేశంపార్టీ తరుపున తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచీ, వైసీపీకిచెందిన కొందరునేతలు తనపై వల్లమాలిన ప్రేమాభిమానాలు చూపుతున్నారని, టీడీపీఅధినేత చంద్రబాబునాయుడు గతంలో తనకు రాజ్యసభ ఇస్తానని చెప్పి, ఇవ్వకుండా తనకేదో తీరని అన్యాయం చేశాడని వారంతా తెగబాధపడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రిలయన్స్ అధినేత అంబానీ తన ఇంటికి వస్తే, సాదరంగా ఆహ్వనించి స్వాగతం పలికిన జగన్మోహన్ రెడ్డి, గతంలో కుట్రచేసి, తన తండ్రిని ముకేశ్ అంబానీయే హ-త్యచేయించాడని, తన తండ్రిది సాధారణమరణం కాదని, కచ్చితంగా కుట్రపూరితంతో చేసిన హ-త్యేనని గగ్గోలు పెట్టింది నిజం కాదా అని వర్ల నిగ్గదీశారు. ఆనాడు వైసీపీ అధినేత, ఆయనపార్టీవారు, ఆయన కుటుంబసభ్యులు రిలయన్స్ అధినేతపై ఆరోపణలు చేసి, వారి సంస్థలకు చెందిన వేలాది కోట్ల ఆస్తుల విధ్వంసానికి కారకులయ్యారన్నారు. రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేయండి, వారి ఆస్తులు తగలబెట్టండి, రిలయన్స్ బంకులకు ని-ప్పుపెట్టండని జగనే, తనపార్టీకి చెందిన ఎన్ఎస్ యూఐ నాయకుడైన వంశీచంద్రారెడ్డికి ఆదేశాలిచ్చింది నిజమా...కాదా అని టీడీపీ నేత ప్రశ్నించారు.

ఆనాడు జగన్ ఇచ్చిన పిలుపుకారణంగా ఆవేశానికి గురై, తమ జీవితాలను జైళ్లపాలు చేసుకున్న వారిలో 90శాతం మంది దళితబిడ్డలే ఉన్నారని, వారి జీవితాలగురించి ఒక్కనాడైనా ఆదిమూలపు సురేశ్, సుచరిత, బల్లి దుర్గాప్రసాదరావులు ఎందుకు మాట్లాడలేదని వర్ల మండిపడ్డారు. అంతమంది దళితుల ఉసురుపోసుకున్న జగన్మోహన్ రెడ్డి, తన తండ్రిని చంపించిన వాడని ప్రచారం చేసిన వ్యక్తి చెప్పాడని, ఏమాత్రం ఆలోచించకుండా నత్వానీకి రాజ్యసభపదవి ఎలా ఇచ్చాడో సమాధానం చెప్పాలన్నారు. తండ్రిని చంపించినవారిగురించి, బాబాయిని చంపినవారి గురించి పట్టించుకోకుండా రాజకీయఅవసరాలకోసమే, జగన్ ప్రవర్తిస్తున్నాడన్నారు. రిలయన్స్ ఆస్తుల ధ్వంసంలో పాల్గొని కేసులుపెట్టబడిన కారణంగా, అనేకమంది దళితబిడ్డలు తమకు వచ్చిన ఉద్యోగాలను కూడా కోల్పోయారన్నారు. వారికి జరిగిన అన్యాయానికి జగన్మోహన్ రెడ్డి కారణంకాదా అని వర్ల ప్రశ్నించారు. వేలాది మంది దళితబిడ్డల భవిష్యత్ ను నాశనం చేసిన వ్యక్తిని వదిలేసి, తనకేదో అన్యాయం జరిగిందని వైసీపీమంత్రులు, నేతల చెప్పడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం కాదా అన్నారు. నత్వానీకి ఇచ్చిన రాజ్యసభ సీటు ధర ఎంతో.. ఎంతమొత్తం బరువున్న మూటకు ఆసీటుని జగన్ అప్పగించాడో వైసీపీనేతలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. అదే సీటుని నత్వానీకి ఇవ్వకుండా ఒక దళితే నేతకు ఎందుకివ్వలేదని వైసీపీలోని దళితనేతలు జగన్ ని ఎందుకు అడగటంలేదన్నారు. వైసీపీలో ఉన్న దళితనేతలు, తమపార్టీనుంచి ఎగురుకుంటూ వైసీపీలోకి వెళ్లిన దళితనేతలకు ఇవ్వకుండా ఎక్కడినుంచో వచ్చిన నత్వానీని పెద్దలసభకు పంపడమేంటన్నారు.

ఎవరితో చర్చించి, తనపార్టీలోని ఏవర్గానికి చెందిన నేతలతో సంప్రదించి జగన్మోహన్ రెడ్డి, తనపార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులను ఖరారుచేశాడో బహిర్గతం చేయాలని వర్ల డిమాండ్ చేశారు. గతంలో కూడా జగన్ రాజ్యసభకు ఇద్దరూ రెడ్లనే పంపాడని, ఇప్పుడుకూడా రెండుస్థానాలు వారికే ఇచ్చాడని, దానిపై వైసీపీలోని ఒక్క దళితనేతైనా ఎందుకు ప్రశ్నించలేకపోయారని రామయ్య నిలదీశారు. జగన్ పైకి దళితులుగురించి మాట్లాడుతూ, దళితవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని, ఈ విషయం వైసీపీలోని దళితనేతలు ఎందుకు గమనించడంలేదన్నారు. నిత్యం టీడీపీ తరుపున మాట్లాడుతుంటానని, ఏనాడూ కూడా తనపేరుగానీ, తనఫొటోగానీ సాక్షిపత్రికలో, సాక్షి ఛానెల్ లో రాలేదని, దళితుడిని కాబట్టే తనపై సదరు మీడియా వివక్ష చూపుతోందని, నిన్నటికినిన్నమాత్రం రాజ్యసభ పదవి విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ పెద్దఫొటోవేసి, కథనాలురాశారన్నారు. దళితులంటే జగన్మోహన్ రెడ్డికి, సాక్షి మీడియాకు చిన్నచూపనడానికి తన వార్తలు చూపించకపోవడమే నిదర్శనమనన్నారు. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండికూడా దళితులకు రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నారు. ప్రాధాన్యత లేనిచోట బానిసల్లా, జగన్ జమానాలో బతుకుతున్న వైసీపీకి చెందిన దళితమంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా ఆలోచించుకొని, ఆత్మప్రబోధానుసారం నిర్ణయం తీసుకొని తనకు ఓటేయాలని రామయ్య విజ్ఞప్తిచేశారు. ఎంతోమంది దళిత బిడ్డల ఉసురు తీయడానికి కారకుడైన వ్యక్తి, నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా తాను దళితవర్గాల వ్యతిరేకినేనని నిరూపించుకున్నా డన్నారు. వైసీపీఅధినేత జగన్ నత్వానీని తొలగించి, తనపార్టీలోని దళితనేతకు ఆస్థానం కట్టబెడితే, తాను తక్షణమే రాజ్యసభ రేసునుంచి తప్పుకుంటానని రామయ్య తేల్చిచెప్పారు

Advertisements

Latest Articles

Most Read