వైసీపీ ప్రభుత్వం పెత్తందారీ పోకడలతో, ఫ్యాక్షనిజపు విధానాలతో యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా, ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా, ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడంలేదని టీడీపీనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయడు నిలదీశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే, రాప్తాడు నియోజకవర్గంలోని కొనగాలపల్లి మండలం, ముత్తవగగుంట్లలో ఓటర్లకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని, మచిలీపట్నంలోకూడా ఇళ్లపట్టాలు పంచారని నిమ్మల తెలిపారు. తాడిపత్రిలో ప్రభుత్వ బ్యానర్లు కట్టి అట్టహాసంగా చీరలుపంచి, ఇదేవిధమైన కార్యక్రమం నిర్వహించారని, ఇంత జరుగుతుంటే, ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమానికి సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని చెప్పిన నిమ్మల, ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించిన వీడియోను విలేకరులకు ప్రదర్శించారు. నోటిఫికేషన్ వచ్చాక ఒకపక్క నామినేషన్లు వేస్తుంటే, మరోపక్క ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించిన కూపన్లను అధికారులు పంచడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చాగలమర్రి మండలంలో ఎమ్మార్వో ఆదేశాలప్రకారమే ఇళ్లస్థలాల పనులుచేస్తున్నట్లు కిందిస్థాయి అధికారులు చెబుతున్నారన్నారు. (అందుకు సంబంధించిన వీడియోను కూడా ఎమ్మెల్యే చూపించారు.) తహసీల్దార్ ఆదేశాల ప్రకారమే తాను ఇళ్లస్థలాల్లో రాళ్లు పాతడానికి వచ్చినట్లు సదరు అధికారి చెప్పడం జరిగిందన్నారు.

నోటిఫికేషన్ వచ్చాక ఇలాంటిపనులు జరుగుతుంటే, ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర పోతోందా అని నిమ్మల నిలదీశారు. 25 సంవత్సరాల నుంచి బీసీలకు అమలవుతున్న 34శాతం రిజర్వేషన్లు జగన్ వచ్చాక 24 శాతానికి పడిపోయాయని, ఆ 24శాతం కూడా అమలుచేయకుండా, జగన్ ప్రభుత్వం బీసీలను మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక ఎన్నికల కోటాలో కేవలం 12శాతం రిజర్వేషన్లు మాత్రమే జగన్ ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. అందుకు ఉదాహరణ నెల్లూరుజిల్లానేనని, ఆజిల్లాలో 46 జడ్పీటీసీలుంటే, 6స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారని, 562 ఎంపీటీసీలుంటే, కేవలం 59 ఎంపీటీసీలు మాత్రమే బీసీలకిచ్చారని నిమ్మల పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్లను అపహాస్యం చేసిన జగన్, 10.49శాతం రిజర్వేషన్లు మాత్రమే జిల్లావ్యాప్తంగా బీసీలకు అమలు చేశారని ఆయన మండిపడ్డారు. తడ, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో ఎంపీపీలు బీసీలకు రిజర్వ్ అయితే, ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. ఓపెన్ కేటగిరీలో బీసీలు ఎన్నికవకపోతే, ఆ పదవి బీసీలకు రాదనే విషయం తెలిసికూడా ప్రభుత్వం వారికి అన్యాయం చేయడానికే ఇటువంటి చర్యలకు పాల్పడిందన్నారు. 25ఏళ్ల నుంచి హక్కుగా ఉన్నబీసీల రిజర్వేషన్లు మింగేసి, పార్టీపరంగా ఇస్తామంటూ జగన్ కపటనాటకం ఆడుతున్నారన్నారు. వైసీపీప్రభుత్వ తీరుతో తమకు జరిగిన అన్యాయంపై బీసీలు నిలదీయాల్సిన సమయం వచ్చిందని, స్థానిక ఎన్నికల్లో వారంతా ప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధి చెప్పాలని నిమ్మల పిలుపునిచ్చారు.

ఎన్నికల కోసం రాష్ట్రాన్ని 5 రీజియన్లుగా విభజించిన ప్రభుత్వం, వాటికి ఇన్ ‎ఛార్జ్ లుగా రెడ్లయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను నియమించిందని, ఒక్క బీసీకి కూడా ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. బీసీలపట్ల జగన్ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా, ఎంతటి కక్షతో వ్యవహరిస్తోందో ఆ నియామకాలే చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడాకూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడంలేదని, గెలిచే అవకాశంలేనిచోట ప్రభుత్వం ఎన్నికలు వాయిదావేస్తోందన్నారు. పీలేరు నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించి, 18 ఎంపీటీసీల్లో ఎన్నికలు జరపడంలేదని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కు రహస్య జీవో ఇచ్చిందని, తమపార్టీకి అనుకూలంగా లేదనే, వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిమ్మల మండిపడ్డారు. పాలకొల్లులో కూడా మున్సిపల్ ఎన్నికలు వాయిదావేశారని, రెండువార్డుల్లో సమస్య ఉంటే, మొత్తం వార్డుల్లో ఎన్నిక నిలిపివేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నచోట ఒకలా, అధికారపార్టీకి అనుకూలంగా ఉన్న చోట మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నా, ఎన్నికల కమిషన్ చోద్యం చూడటం సిగ్గుచేటన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకకూడా స్వాగతద్వారాలు, హోర్డింగులు, బ్యానర్లు తొలగించలేదని, ఇప్పటికీ విగ్రహాలకు ముసుగులు వేయలేదన్నారు. నోటిఫికేషన్ వచ్చి 4 రోజులవుతున్నా, ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫొటోలు కనిపిస్తున్నా, కార్యాలయాల బయట ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారచిత్రాలు, బ్యానర్లు కనిపిస్తున్నా వాటిని అలానే వదిలేశారన్నారు. రాష్ట్రంలో ఇంతజరుగుతున్నా ఎన్నికల కమిషన్ ప్రభుత్వంపై ఎందుకు కొరఢా ఝళిపించడంలేదని నిమ్మల ప్రశ్నించారు.

ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తోందా..లేక వైసీపీ ప్రభుత్వమా అన్న సందేహం కలుగుతోందన్నారు. అధికారులు ముఖ్యమంత్రితో కలిసి నిఘా యాప్ ఆవిష్కరించడమేంటని ప్రశ్నించిన రామానాయుడు, డబ్బు, మద్యం పేరుతో తీసుకొచ్చిన అర్డినెన్స్ కూడా ప్రభుత్వానికే మేలుచేసేలా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల్లో గెలుపుకోసం ఎన్నికుట్రలు పన్నినా, ఎన్నివిధాలుగా అధికారయంత్రాంగాన్ని దుర్వినియోగంచేసినా, వైసీపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని నడిపించే సలహాదారులుగా తమసామాజికవర్గం వారే పనికొస్తారని నిస్సిగ్గుగా జగన్ అసెంబ్లీలోనే చెప్పాడని, ఆయన ఉద్దేశానికి అనుగుణంగానే పార్టీ, ప్రభుత్వ పదవుల్లో వారికే అగ్రతాంబూలం లభిస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల సామర్థ్యంపై జగన్ కు ఎంత నమ్మకముందో ఆనాడు ఆయన మాటలతోనే తేలిపోయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఘోర పరాభవం తప్పదని నిమ్మల తేల్చిచెప్పారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుఓటములు అనేవి తెలుగుదేశం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపవని, రాబోయే నాలుగేళ్ల ప్రజాజీవితంపై మాత్రం అవి కచ్చితంగా ప్రభావం చూపుతాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిమ్మల స్పష్టంచేశారు. జగన్ కు ఒక్క అవకాశమిస్తే ఏంజరిగిందో, ఎలాంటి దుష్పలితాలు చవిచూశారో ప్రజలందరూ చూశారన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే, జగన్ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తున్నాడని, అవి ముగిశాక వాటన్నింటికీ కోతలు పెట్టడం ఖాయమన్నారు.

గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసి, తరువాత టీడీపీలోకి వచ్చి, ఇప్పుడు వైసీపీ గూటికి చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్.. తనకు ఏ పార్టీ కూడా శాశ్వతమైన రాజకీయవేదిక కాదని ఆయనే చెప్పాడని, దాన్నిబట్టే ఆయన భవిష్యత్ లో ఇంకోపార్టీలోకి వెళతాడని స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి వచ్చిప్పటికీ టీడీపీ డొక్కాకు కీలకమైన పదవులిచ్చిందని, ఎమ్మెల్సీ, మినిమమ్ వేజెస్ బోర్డు ఛైర్మన్ సహా, పార్టీ అధికార ప్రతినిధి హోదాను కూడా కట్టబెట్టి, ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అలా కొనసాగిన వ్యక్తి, నేడు పార్టీకి రాజీనామా చేశారని, ఆయన రాసిన లేఖలో నాటకీయంగా తనకు తాడికొండ స్థానం కేటాయించారని చెప్పడం జరిగిందన్నారు. టీడీపీ కోర్ కమిటీలో చర్చించి, డొక్కాను సంప్రదించాకే, ఆయనకు ప్రత్తిపాడు స్థానం కేటాయించమైందని అన్నారు.

dokka 090322020 2

తాడికొండ స్థానంలో పోటీచేయడానికి తెనాలి శ్రావణ్ కుమార్ ఉండగా, అతన్ని కాదని డొక్కాకు ఎలా కేటాయిస్తారని రామయ్య ప్రశ్నించారు. డొక్కా చెప్పిన నాటకీయ పరిస్థితులు ఎక్కడున్నాయో ఆయనే చెప్పాలన్నారు. శాసనమండలిలో డొక్కా హాజరు అత్యంత ఆవశ్యకమైన రోజునే, ఆయన గైర్హాజరయ్యారని, ఆయన ఎక్కడినుంచైతే పోటీచేయాలని భావించారో, ఆ తాడికొండ నియోజకవర్గం ఉన్న రాజధానిప్రాంతానికి అన్యాయం జరుగుతున్నవేళే, డొక్కా అలా ఎందుకు చేశాడని రామయ్య నిలదీశారు. దళితవర్గాలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తున్న వేళ, డొక్కా మండలికి గైర్హాజరయ్యాడని, ఆనాడే ఆయన వైసీపీవైపు మొగ్గాడని రాష్ట్రప్రజానీకానికి అర్థమైందన్నారు.

dokka 090322020 3

టీడీపీ కూడా ఆనాడే డొక్కా పార్టీ మారుతున్నాడని భావించిందన్నారు. మండలిని శాసనసభే ఏర్పాటుచేసిందన్న వ్యాఖ్యకూడా ఆనాడు డొక్కా మాటల్లో ధ్వనించిందని, అదికూడా సరైంది కాదన్నారు. శాసనసభ తీసుకునే నిర్ణయాల్లోని తప్పొప్పులను ఎత్తిచూపుతూ, మార్పులు, చేర్పులు సూచించే మండలిని, సీనియర్ సభ్యుడైన డొక్కా తప్పుపట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన డొక్కాకు ఆపార్టీలో మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వర్ల తెలిపారు. ఇది ఇలా ఉంటే, గుంటూరు జెడ్పీ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వేషన్ ఖరారు కావటంతో, వైసీపీ జెడ్పీ ఛైర్‍పర్సన్ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురుకి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అందుకే డొక్కా పార్టీ మారరు అని సమాచారం..

అనంతపురంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ పర్యటిస్తున్నారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభలో విజయన్ పాల్గొననున్నారు. ఈ బహిరంగసభకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర స్థాయి నేతలు హాజరుకానున్నారు. సీపీఐ నేత నారాయణతోపాటు సీఎం విజయన్‌ను తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని కలిసారు. అనంతపురం నగరంలోని జూనియర్ కళాశాల మైధానంలో సోమవారం సాయంత్రంరాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎస్ఆర్ సీ, ఎస్వీఆర్, సీఏపలకు వ్యతిరేకంగా జరుగు బహిరంగ సభలో ముఖ్య అతిథిగా కేరళ సీఎం హాజరు కానున్నారు. ఆయన పర్యటన ఖరారు కావడంతో ఆదివారం రోజే కేరళకు చెందిన భద్రతా అధికారులు అనంతపురం వచ్చారు. బహిరంగ సభ జరుగుతున్న జూనియర్ కళాశాల మైధానాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సభలో కేరళ సీఎంతోపాటు సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్ తదితరులు పాల్గొంటారు. ఈ సభకు అనంతురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలే కాకుండా కడప, కర్నూలు ప్రాంతాల నుంచి ప్రజలను సమీకరించేందుకు రాజ్యాంగ పరిరక్షణ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.

బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకున్న కేరళ సీఎంకు సీపీఎం, సీపీఐతో పాటు ఇతర వామపక్ష పార్టీల నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ సాయంత్రం నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న సభలో విజయన్ పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికార పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రంలో బెదిరింపులతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న సభలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ ను వారు కలిశారు. జ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో లౌకికవాదులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలువునిచ్చారు.

అయితే, పక్క రాష్ట్ర సియం వచ్చి, ఇక్కడ ముస్లింలకు భరోసా ఇవ్వటంతో, ఇక్కడ ఉన్న జగన్ మోహన్ రెడ్డి పై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే జగన్ పై, ఈ విషయంలో అన్ని పక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముస్లింల ఓట్ల కోసం ఎన్ పిఆర్, సిఏఏపై డ్రామాలు ఆడుతున్నారని, ఢిల్లీలో సై అని, ఇక్కడకు వచ్చి వ్యతిరేకంగా అంటున్నారని విమర్సలు వస్తున్నాయి. వైసిపి ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని, ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు డ్రామాలు ఆడుతున్నారని ముస్లిం సంఘాల నేతలు ధ్వజమెత్తారు. సీఎం జగన్ కు చిత్తశుద్ది ఉంటే దీనిపై జీవో 102ను ఆగస్ట్ 16న విడుదల చేసేవారే కాదని అన్నారు. ఆగస్టులో జీవో ఇచ్చి ఇప్పుడు మేము వ్యతిరేకం అంటే నమ్మడానికి ముస్లింలు సిద్దంగా లేరని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ముస్లింల ఓట్ల కోసం జగన్నాటకం ఆడుతున్నారని, ఎన్ పిఆర్, సిఏఏ,ఎన్ ఆర్ సిలను అడ్డుకోవాలన్న చిత్తశుద్ది వైసిపి ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. అనేక రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించినా మన అసెంబ్లీలో దీనిపై కనీసం చర్చించక పోవడం, తీర్మానం ఆమోదించక పోవడమే అందుకు నిదర్శనంగా ముస్లిం సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.

గతఎన్నికల్లో ఒక్కసారి.... ఒక్కసారి అని ప్రజలను బతిమాలి వారి ఓట్లేయించుకున్న జగన్, ఇప్పుడు ఇంకోసారి అంటూ వారి ముందుకెళుతున్నాడని, గతంలో ఆయన్ని నమ్మిన వారంతా, మరోమారు ఆయన్ని నమ్మడానికి సిద్ధంగా లేరని టీడీపీనేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒక అవకాశమిచ్చి నిట్టనిలువునా మోసపోయిన ప్రజలంతా, జగన్ కు మరో అవకాశమివ్వడానికి సిద్ధంగా లేరని, ఆయన కల్లబొల్లి మాటలు నమ్మి, మరోసారి తమ భవిష్యత్ ను సర్వనాశనం చేసుకునేందుకు వారెవరూ ఇష్టపడటంలేదని బుద్దా తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా... జగన్ కు ఎప్పుడు బుద్ధిచెబుదామా అని రాష్ట్రప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. తనపార్టీ ఎంపీ, ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న, జగన్ నివాసముంటున్న ప్రాంతమైన అమరావతిలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందో సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అవసరమైన రాజధాని ప్రాంతవాసుల ఓట్లు, స్థానిక ఎన్నికలు వచ్చేసరికి పనికిరాకుండా పోయాయా అని బుద్దా నిలదీశారు. జగన్ కు ఓటమి భయం పట్టుకోబట్టే, రాజధాని ప్రాంతంలోని 3 మండలాల్లో ఎన్నికలు వాయిదా వేశాడన్నారు. కేవలం ఆ ప్రాంతంలోనే తనపై వ్యతిరేకత ఉందని జగన్ భావిస్తున్నాడని, రాష్ట్రమంతా ఆయనకు వ్యతిరేకపవనాలు వీస్తున్నాయన్న విషయం ఎన్నికల ఫలితాల నాటికి ముఖ్యమంత్రికి బోధపడుతుందన్నారు. 175 నియోజకవర్గాల్లో జగన్ పై వ్యతిరేకత ఉందని, అలాంటప్పుడు రాష్ట్రమంతా ఎన్నికలు ఆపేస్తే మంచిదన్నారు.

టీడీపీకి ఓటేస్తే, పింఛన్లు ఇవ్వము.. రేషన్ ఆపేస్తాము, ఇళ్లు ఇవ్వమంటూ జగన్ ప్రభుత్వం వాలంటీర్లద్వారా బెదిరిస్తోందన్నారు. ప్రజలసొమ్ము ప్రజలకు ఇవ్వడానికి జగన్ ప్రభుత్వ బెదిరింపులేంటని వెంకన్న నిలదీశారు. జగన్ దృష్టిలో బీసీలంటే, వాడుకొని వదిలేసేవాళ్లని, అందుకనుగుణంగానే రిజర్వేషన్లు సహా, అనేక అంశాల్లో వారికి మొండిచెయ్యే చూపాడన్నారు. ఎన్నికల నిర్వహణకోసం 13 జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను నియమించిన జగన్ ప్రభుత్వం, బీసీలకు ఎందుకివ్వలేదన్నారు. కాపులు, బీసీలగురించి మాట్లాడే అర్హత జగన్ కు లేనేలేదని బుద్దా స్పష్టంచేశారు. చంద్రబాబునాయుడు కాపురిజర్వేషన్లను అసెంబ్లీలో అమోదించి, కేంద్రానికి పంపితే వాటి గురించి జగన్ ఒక్కనాడైనా కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. బీసీలకు ఉన్న రిజర్వేషన్లే పీకేసిన జగన్, కాపులకు వాటిని అమలుచేస్తాడనుకోవడం అత్యాశే అవుతుందన్నారు. బీసీల రిజర్వేషన్లలో కోతపడితే, వారికి న్యాయం చేయడం కోసం టీడీపీ సుప్రీంకోర్టుకెళితే, దాన్నికూడా తప్పుపట్టడం జగన్ కే చెల్లిందన్నారు. సుప్రీం తీర్పు వచ్చేవరకు ఆగకుంగా జగన్ హడావుడిగా ఎన్నికలకు వెళ్లడంద్వారా బీసీలకు అన్యాయం చేశాడన్నారు. ప్రజలు తనపక్షాన లేరని తెలుసుకున్న జగన్, వారిని గందరగోళపరుస్తూ, పోలీసులను, ఇతర అధికారులను అడ్డుపెట్టుకొని, స్థానిక ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడన్నారు.

జగన్ కు పోలీసులపై ఉన్న విశ్వాసం, నమ్మకం ప్రజలపై లేకుండా పోయాయన్నారు. డబ్బు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ తెగ ఆరాటపడుతున్నాడన్నారు. తన ఇల్లు, తన కార్యాలయం ఉన్న ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలోఉన్న జగన్, రాష్ట్రమంతా ఎన్నికలు పెట్టాలని చూస్తున్నాడని బుద్దా ఎద్దేవాచేశారు. ఇంట్లో గెలవలేని జగన్, రాష్ట్రంలో గెలుద్దామనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో జగన్ చేసిన, చేస్తున్న దుర్మార్గపు పనులు, ఏ ముఖ్యమంత్రి చేయలేదని వెంకన్న మండిపడ్డారు. రాష్ట్రప్రజలంతా జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై నుంచి దిగుతాడా అని ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి లక్షకోట్లు దోచుకోవాలని ఎదురుచూస్తున్న విజయసాయి రెడ్డి, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు వెళుతున్న సొమ్ము, తిరిగి తమజేబుల్లోకే వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నాడన్నారు. ప్రజలు తమసొమ్మంతా నిత్యావసరవస్తువులు, లిక్కర్ (మందు), పెంచిన ధరలకు వెచ్చించేలా చేయడంద్వారా, తిరిగి తమ జేబుల్లోకే ఆసొమ్ము చేరేలా జగన్, విజయసాయిలు గొప్ప పథకం అమలుచేస్తున్నారని వెంకన్న దుయ్యబట్టారు.

నెల్లూరు జిల్లాలో బీసీలకు రావాల్సిన స్థానాలను వైసీపీ ప్రభుత్వం రాకుండా చేసిందన్నారు. జగన్ తన కులానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని, అన్యకులస్థులు, మరీ ముఖ్యంగా బీసీలు పదవులు పొందడం జగన్ కు ఇష్టంలేదన్నారు. జగన్ కు, ఆయనపార్టీ అభ్యర్థులకు ఓటేస్తే, తమభవిష్యత్ తోపాటు, తమ పిల్లల భవిష్యత్ ను కూడా చేజేతులా నాశనం చేసుకున్నట్లేననే విషయాన్ని ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. నిజాయితీగా, నిబద్ధతతో, స్వేచ్ఛగా ఎన్నికలు జరిపిస్తే, జగన్ ప్రభుత్వం ఎక్కడా గెలవదన్నారు. కడపజిల్లాలో టీడీపీ తరుపున ఎవరైనా పోటీచేస్తే, వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారని, తప్పుడుకేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపాలని ప్రభుత్వమే ఆదేశించిందన్నారు. ప్రజలను నమ్మే పరిస్థితిలో జగన్ లేడని, అందుకే పోలీసులను, అధికారులను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడన్నారు. తెలుగుదేశానికి ఓటేస్తే, పించన్లురావు, రేషన్ రాదు, ఇళ్లురావంటూ బెదిరించే పనులు వాలంటీర్లు మానుకోవాలని బుద్దా హితవుపలికారు. ప్రభుత్వం అండతో వాలంటీర్లు హద్దుమీరి ప్రవర్తిస్తే, వారికి ప్రజలే తగినవిధంగా దేహశుద్ధి చేస్తారని టీడీపీనేత హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read