ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ముగ్గురు తెలుగుదేశం ఎంపీలు కాగా, కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధిస్తారని, వైసీపీ పార్టీకి 22 మంది ఎంపీలను గెలిపించారు. అయితే ఇప్పుడు ఈ 25 మంది ఎంపీలు, ఈ ఏడాదిలో ఏమి చేసారు ? ఎవరెవరు, ఎన్ని రోజులు పార్లమెంట్ కు వెళ్లారు ? ఎన్ని చర్చల్లో పాల్గున్నారు ? కేంద్రానికి ఎన్ని ప్రశ్నలు వేసారు ? రాష్ట్రానికి సంబధించిన ఎన్ని అంశాలు లేవనెత్తారు ? నవ్యాంధ్ర వాణి వినిపించారా ? ఈ 25 మందిలో ఎవరు బెస్ట్ ? ఎవరు లాస్ట్ ? ఇలాంటి అన్ని అంశాల పై యువగళం అనే సంస్థ ఒక నివేదికను సిద్ధం చేసింది. ఏడాది కాలంలో, మన ఎంపీల పెర్ఫార్మన్స్ చెప్పింది. గడిచిన ఏడాది కాలంలో, పార్లమెంట్ ఎంపీల పని తీరు పై, యువగళం అధ్యయనం చేసింది. అంశాల వారీగా ఒక్కొక్కరి పనితీరుని విశ్లేషించింది. మొత్తంగా 25 మందిలో, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు, ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఈయన 97 శాతం సభకు హాజరు అయ్యారు.

91 ప్రశ్నలు వేసి, 42 చర్చల్లో పాల్గున్నారు. ఇక రెండో స్థానంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. 93 శాతం హాజరుతో, 91 ప్రశ్నలు అడిగిన గల్లా, 36 చర్చల్లో పాల్గున్నారు. మూడో స్థానంలో, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారు. 88 శాతం హాజరుతో, వంద ప్రశ్నలు అడిగిన గీత, 33 చర్చల్లో పాల్గున్నారు. నాలుగో స్థానంలో శ్రీకాకుళం ఎంపీ, రామ్మోహన్ నాయుడు నిలిచారు. 93 శాతం హాజరుతో, 69 ప్రశ్నలు అడిగిన రామ్మోహన్, 34 చర్చల్లో పాల్గున్నారు. అయితే చివరి స్థానంలో, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ చివరి స్థానంలో నిలిచారు. 50 శాతం హాజరు ఉన్న సురేష్, ఒక్క ప్రశ్న కూడా ఇప్పటి వరకు అడగలేదు. ఒక చర్చలో పాల్గున్నారు. చివరి నుంచి రెండో స్థానంలో కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ నిలిచారు. 76 శాతం హాజరుతో, 14 ప్రశ్నలు అడిగిన ఆయన, ఒక చర్చలో పాల్గున్నారు.

చివరి నుంచి మూడో స్థానంలో, ఎంవీవీ సత్యన్నారాయణ, 75 శాతం హాజరుతో, 35 ప్రశ్నలు అడిగి, ఒక చర్చలో పాల్గున్నారు. 50 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న ఎంపీగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. అలాగే సగటు వయసు తీసుకుంటే, టిడిపి ది 47 ఉండగా, వైసీపీ ది 51 ఉన్నట్టు తెలిపారు. అలాగే పార్లమెంట్ హాజరు చూస్తే , టిడిపి ది 92 శాతం ఉండగా, వైసీపీ ది 79 శాతం ఉన్నట్టు తెలిపారు. టిడిపి ఎంపీలు సగటున 71 ప్రశ్నలు అడిగితె, వైసీపీ 46.3 ప్రశ్నలు అడిగారు. అలాగే చర్చల్లో టిడిపి సగటున 26.6 చర్చల్లో పాల్గుంటే వైసీపీ 11.1 చర్చలో పాల్గున్నారు.

విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ కేసులో, కీలక మలుపు చోటు చేసుకుంది. హాస్పిటల్ సూపరింటెండెంట్ కి చెప్పి, డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళొచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ విచారణకు సహకారించాలని సుధాకర్ ను కోర్టు ఆదేశించింది. సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటీషన్ పై, ఈ రోజు విచారణ జరిగింది. ఈ రోజు జరిగిన విచారణ సందర్భంలో, డాక్టర్ సుధాకర్ విడుదల పై, హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మే నెల 16న సుధాకర్ ను అదుపులోకి తీసుకుని, కేజీహెచ్ కు పోలీసులు తరలించారు. తరువాత రోజు, డాక్టర్ సుధాకర్ మానసిక స్థితి సరిగ్గా లేదు అంటూ, విశాఖ మానసిక వైద్యశాలకు తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. అక్కడ హాస్పిటల్ లో అందుతున్న, చికిత్స పై, డాక్టర్ సుధాకర్ తో పాటుగా, అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. డాక్టర్ సుధాకర్ తనని వేరే హాస్పిటల్ కు తరలించాని, లేదా ప్రైవేటు హాస్పిటల్ లో కోర్టు వారి ఆధ్వర్యంలో వైద్యం అందించాలని పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ వాయిదా పడింది. అయితే సుధాకర్ తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటీషన్ పై, కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది.

మరో పక్క, డాక్టర్ సుధాకర్ కేసునకు సంబంధించి సీబీఐ అధికారులు గురువారం కూడా విచారణ చేశారు. ఈ కేసునకు సంబంధించి పోలీసు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సుధాకర్ మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు గురువారం నరీపట్నం మెడికల్ ఆఫీసర్ నీలవేణిని సుమారు 7 గంటల పాటు విచారించారు. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అన్ని కోణాల్లో విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే పోలీసులను, సుధాకర్ కుటుంబ సభ్యులను, విశాఖ కెజిహెచ్ వైద్యులను, మానసిక ఆరోగ్య కేంద్రం వైద్యులను పలు పర్యాయాలు విచారించిన సీబీఐ మంగళవారం సుధాకర్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అయితే అసలు సుధాకర్ కేసు ఉదంతానికి కేంద్ర బింధువైన నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అసలేం జరిగిందన విషయమై గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇందులో భాగంగా ఆసుపత్రి సూపరింటిండెంట్ నీలవేణిని ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆమె కార్యాలయంలోనే విచారణ జరిపి వివరాలు రాబట్టారని తెలుస్తోంది. వృత్తి పరంగా సుధాకర్ వ్యవహార శైలి, తదితర అంశాలపై లోతుగా అధికారులు విచారించినట్టు విశ్వసనీయ సమాచారం. సుధాకర్ కేసు వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉండడంతో సీబీఐ ఆచితూచి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, హైకోర్టులో ఇప్పటి వరకు దాదాపుగా 70 సార్లు ఎదురు దెబ్బ తగిలింది. అలాగే హైకోర్టు తీర్పుని, సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టుకు వెళ్తున్న ఎక్కువ సార్లు, సుప్రీం కోర్టులో కూడా ఎదురు దెబ్బ తగులుతూ వచ్చింది. అయితే, సరిగ్గా ఇక్కడే వైసీపీ నుంచి వైలెంట్ రియాక్షన్ వచ్చింది. డాక్టర్ సుధాకర్ కేసులో, హైకోర్టు ఉత్తర్వులు ఇస్తూ, ఈ కేసుని సిబిఐకి ఇస్తున్నామని చెప్తూ, దానికి కారణాలు కూడా చెప్పింది. అభియోగాలు పోలీసులు పైనే ఉన్నాయి కాబట్టి, సిబిఐకి ఇస్తున్నాం అని హైకోర్టు చెప్పింది. అయినా సరే, హైకోర్టు పై, విమర్శలు దాడి చేసింది వైసీపీ. హైకోర్టు తీర్పు పై విమర్శలు చేస్తే చేసుకోవచ్చు కాని, జడ్జిల పై పర్సనల్ కామెంట్స్ చెయ్యటం, కుట్రలు అంటకడతం లాంటి పనులు చెయ్యటం, ఏకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నేతలు ఇలా చెయ్యటంతో, హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది, వీరందరికీ నోటీసులు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీం కోర్టులో కూడా ఇదే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎందుకు తప్పులు చేస్తున్నాం అనేది చూడకుండా, చట్ట ప్రకారం నిర్ణయాలు ఉంటున్నాయా అనేది చూడకుండా, కోర్టుల పై నెపం నెట్టుతున్నారు.

అయితే, ఇప్పుడు హైకోర్టు కొట్టేసిన మరో కేసులో, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో, తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెడతాం అంటూ, ప్రభుత్వం తెచ్చిన జీవో 81, 85 లను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎవరు ఏ మీడియంలో చదువుకోవాలో, అది వారి ఇష్టం అని, విద్యా హక్కు చట్టం ప్రకారం, మాతృభాష కూడా ఉండాలి అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం, తెలుగు మీడియం ఆప్షన్ ఇవ్వటానికి ఎందుకో మొగ్గు చూపటం లేదు. ఇంగ్లీష్ మీడియం పెట్టుకోండి, కాకపొతే తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉంచండి అని చెప్పినా, ప్రభుత్వం వినటం లేదు. హైకోర్ట్ కొట్టేయగానే, వెంటనే వాలంటీర్లతో సర్వే చేపించి, 80 శాతం మంది ఇంగ్లీష్ మీడియంకి అనుకూలంగా ఉన్నారని, అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం అంటూ, సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఇక్కడ బేసిక్ పాయింట్ అయిన, తెలుగు మీడియం ఆప్షన్ ఇవ్వటానికి, ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటో మరి. ప్రభుత్వం చెప్తున్నట్టు, ఆ 80 శాతం మందిని ఇంగ్లీష్ మీడియంలో చదివించి, తెలుగు మీడియం కోరిన ఆ 20 శాతం మందికి, అదే పెట్టవచ్చు కదా ? చూద్దాం సుప్రీం కోర్టు ఏమి చెప్తుందో.

ఒక పార్టీకి అనుకూలంగా ఉండే ఒక వెబ్‌సైట్‌ పై, నర్సాపురం ఎంపీ, రఘురామకృష్ణంరాజు సీరియస్ అయ్యారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే కధనం రాసి, తన పై బురద చల్లినందుకు, తగిన చర్యలు తీసుకోవాలి అంటూ, లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు, రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేసారు. గ్రేట్‌ ఆంధ్ర అనే వెవెబ్‌సైట్‌, అర్జెంటుగా సస్పెండ్ చేయించుకోవాలని, ఆ ఎంపీ ఉబలాటం అంటూ, తన పై కధనం రాసారని, తన ఫిర్యాదులో తెలిపారు. తన పై అసత్య ప్రచారం చేసిన ఆ కధనం పై, చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ కధనంలో తన పేరు ఎక్కడా రాయకపోయినా, తనను ఉద్దేశించి చేసిన కంటెంట్ అందులో ఉంది, అంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు. తన పై నిందలు వేసిన ఆ వెబ్‌సైట్‌ పై, సభా హక్కుల ఉల్లంఘన కింద, చర్యలు తీసుకోవాలని, స్పీకర్ ని కోరారు. అలాగే తాను తాగి ఒక సమావేశానికి హాజరు అయ్యానని, అక్కడ జగన్ తనను చూసి, దూరం పెడుతున్నారు అంటూ, ఆ ఆర్టికల్ లో రాసారని, ఇదంతా అవాస్తవం అని, తన ప్రతిష్ట దిగజార్చటానికి, ఆ వెబ్‌సైట్‌ ఇలా రాసింది అంటూ, రఘురామకృష్ణంరాజు, స్పీకర్ కు రాసిన లేఖలో తెలిపారు. తాను, ఎక్కడా ప్రభుత్వాన్ని, తమ అధినేతను విమర్శించటం లేదని, కేవలం కొన్ని విషయాల పై తన వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పానని అన్నారు.

దీనికి, తన పై ఇష్టం వచ్చినట్టు కధనాలు రాసారని, ఇది ఎంపీగా ఉన్న తన హక్కులు, ప్రతిష్టతకు మచ్చ అని, అందుకే వారి పై సభా హక్కుల ఉల్లంఘన మొదలు పెట్టాలని కోరారు. అయితే, ఇదే విషయం పై రఘురామకృష్ణం రాజు ఒక ప్రకటన విడుదల చేస్తూ, వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని వెబ్‌సైట్‌లు, ఇతర మాధ్యమాలు తన పై కక్ష కట్టిన వ్యవహరిస్తూ, వ్యతిరేక కధనాలు రాస్తున్నాయి అంటూ, ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న, కొన్ని వెబ్‌సైట్లలోనే తన పై, ఇలా ఉద్దేశపూర్వకంగా ఎందుకు రాస్తున్నారో అర్ధం కావటం లేదని, అన్నీ తాను గమనిస్తున్నాని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి, సోషల్ మీడియా విషయాలు చూసుకునే ఒక వ్యక్తి, ఇలా నన్ను టార్గెట్ చేసుకుని రాతలు రాస్తున్నారని, త్వరలోనే జగన్ ను కలిసి, ఈ విషయాలు పై ఫిర్యాదు చేస్తానని, ఎంపీ, రఘురామకృష్ణంరాజు తెలిపారు. అలాగే, ఆయన ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు పై, పార్లమెంట్ స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read