ఎన్నికలకు ముందు అన్నివర్గాలకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాలు తప్పించి ఇతరత్రా ఏ హామీలు నెరవేర్చే స్థితి లేదు. క్రమంతప్పకుండా ప్రతి ఏటా డిఎస్సీ వేస్తామని వేయలేదు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ ప్రతీ ఏటా జనవరి1న ఇస్తామన్న జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదు. నాలుగేళ్లు పూర్తి కావస్తున్న నేటికీ కూడా టీచర్ ఉద్యోగాలు భర్తీకి ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. కొత్త పరిశ్రమలు రాక, ఉన్నవి తరలిపోతున్న సంక్షోభ పరిస్థితుల్లో ఏపీలో ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. నిరుద్యొోగులు, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు విదేశాలకు వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సర్కారు నిరుద్యోగ యువతకు చేపల కూర పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం డ్వాక్రా మహిళలూ సద్వినియోగం చేసుకోవచ్చని ప్రకటించింది. చేపలు, రొయ్యలతో రకరకాల వంటకాలు తయారు చేసేందుకు శిక్షణ ఇవ్వడంతోపాటు అవి అమ్ముకునేందుకు కర్రీ పాయింట్లలా ఏర్పాటు చేసుకోవడానికి రుణాలూ ఇవ్వాలని వైసీపీ సర్కారు ఆలోచిస్తోంది.

fish 19122022 2

ఇప్పటికే చేపలు, రొయ్యల దుకాణాలను ఫిష్ ఆంధ్రా పేరుతో ఆర్బాటంగా ఆరంభించి మూసేశారు. మటన్ మార్టులూ మాయం అయ్యాయి. ఫిష్ ఆంధ్రా ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు చేపలు, రొయ్యల వంటకాలతో రెస్టారెంట్లు పెట్టుకోవాలని నిరుద్యొోగులకు సర్కారు ఆఫర్ ఇస్తోంది. ఈ హోటళ్ల ఏర్పాటుకు అవసరమైన రాయితీ రుణాలను బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని జగన్ ప్రభుత్వం నమ్మబలుకుతోంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపలు, రొయ్యల వంటలు చేయడంలో శిక్షణ ఇస్తామని, స్వయం ఉపాధి రుణాల మోడల్లోనే లబ్ధిదారుల వాట, రాయిితీతో రుణం ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెబుతున్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతూ..కొత్తవి రాని దశలో ఈ చేపల కూర వండే పథకంలో యువత చేరతారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

నగరి ఎమ్మెల్యే మినిస్టరా? యాక్టరా? అనే అనుమానాలు వైసీపీ నుంచే వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక,యువజనాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి నేటివరకూ ఎప్పుడూ సంబంధిత శాఖా సమావేశాలలో పాల్గొన్న సందర్భం లేదు. నిత్యమూ ఏదో ఒక చోట వేదికలపై డ్యాన్సులు వేస్తూ, సెల్ఫీలు దిగుతూ సోషల్మీడియాలో పోస్టు చేయడం తప్పించి సంబంధిత శాఖలలో ఎటువంటి పనితీరు కనిపించకపోవడంతో రోజాని మంత్రివర్గంలో నామ్ కే వాస్తేగా ఉంచారనే రూమర్లు ఉన్నాయి. మంత్రి పదవి వరించగానే జబర్దస్త్, బతుకు జట్కా బండి కార్యక్రమాలు ఆపేసిన రోజా..ఇప్పుడు బహిరంగసభలలో అవే పాత్రలు పోషిస్తున్నారు. నటనపై మోజు తీరలేదో, శాఖలలో చేయడానికి పనిలేదో తెలియదు కానీ నిత్యమూ సెల్పీలు, డ్యాన్సులతోనే రోజా కాలం వెళ్లబుచ్చుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి ఇష్టంలేకపోయినా రోజాకి మంత్రి పదవి ఇవ్వాల్సి రావడంతో పవర్ లేని మినిస్టర్ గా చేశారని టాక్ వినిపిస్తోంది.

అందుకే ఆరుబయట ఈ డ్యాన్సులని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు అంటూ డ్యాన్సులు చేయిస్తున్నారు. వీటికి ముఖ్యఅతిథిగా రోజా హాజరై ఆమే డ్యాన్సులు వేస్తోంది. యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిి, టిడిపిలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టి ఐరన్ లెగ్ గా ముద్రపడి కాంగ్రెస్లో చేరింది రోజా. ఈమె చేరిన వెంటనే కాంగ్రెస్ సీఎం వైఎస్ చనిపోవడంతో ఈ పేరు స్థిరపడింది. చివరికి వైెెఎస్సార్సీపీలో చేరి నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వరించింది. తన ఐరన్ లెగ్ ముద్ర చెరిపేసుకుంది. మంత్రిగా ఎంతో పని ఉండగా, ఆమె తన విమర్శకులకు పనితో తోనే సమాధానం చెప్పే అవాకాసం ఉన్నా, తన పనులతో, మరింత విమర్శలు పలు అవుతున్నారు. మినిస్టర్ అయినా చేసేందుకు పనిలేక, చేస్తామన్న పని ఇవ్వక యాక్టర్ గా వేదికలపై ప్రదర్శనలు ఇస్తోంది.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కాలు జారారు. తన డ్రైవర్ అత్యంత కిరాతకంగా  చంపేసి,  మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై ఇటీవలే విడుదలయ్యారు. ఆయనేదో స్వాతంత్య్రపోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చినట్టు వైసీపీ ఊరేగింపులతో స్వాగతం పలికింది. దీనిపై నేషనల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దళిత యువకుడిని అధికార వైసీపీ ఎమ్మెల్సీ చంపేస్తే, ఆయనపై కనీసం చర్యలు తీసుకోని వైసీపీ అధిష్టానం... బెయిల్ పై విడుదలయ్యేందుకు వీలుగా చార్జిషీటు దాఖలు చేయకుండా ఆలస్యం చేసింది. అనంతబాబుని కాపాడేందుకు సర్కారు చేసిన చర్యలన్నీ ప్రజలకి అర్థమైపోయాయి. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన హంతక ఎమ్మెల్సీ అనంతబాబుని వైసీపీ శ్రేణులు, నేతలు భారీ ర్యాలీలతో ఊరేగింపులు నిర్వహించి తీసుకెళ్లడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇదే సమయంలో డ్రామానో, నిజంగా జరిగిందో తెలియదు కానీ బాత్రూంలో ఎమ్మెల్సీ కాలుజారి పడ్డారట. ఆయనకి చెయ్యి విరిగిపోయిందట. ఆపరేషన్ అవ్వడం డిశ్చార్జి కావడమూ అయ్యిందట. ఇదేదో మరో ఎత్తుగడలా వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైసీపీ పాలనలో అరాచకాలు, అవినీతిలో ఫస్ట్ ప్లేస్ వస్తున్న ఆంధ్రప్రదేశ్ .. అభివృద్ధి, ఆదాయం,ఎగుమతులలో లాస్ట్ ప్లేస్ సాధిస్తోంది. సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో ఏపీ తీరు అధ్వానం ఉందని కేంద్రం వెల్లడించింది. సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో మొదటి స్థానంలో కర్నాటక, మూడో స్థానంలో తెలంగాణ ఉంటే చిట్టచివరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. విదేశాలకు భారతదేశం నుంచి సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో ఏపీ వాటా కేవలం 0.1 శాతం మాత్రమేనని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం గణాంకాలు వెల్లడించింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డేటాతో సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం 2021-22లో భారత్ నుంచి సాఫ్ట్ వేర్ ఎగుమతులు విలువ రూ.11.89 లక్షల కోట్లు అని వెల్లడించారు. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కింద నమోదైన యూనిట్లు రూ.6.29 లక్షల కోట్లు, సెజ్ కింద నమోదైన యూనిట్లు రూ.5.3 లక్షల కోట్లు ఈ సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో వున్నాయని పేర్కొన్నారు. అత్యధిక సాఫ్ట్ వేర్ ఎగుమతులు కలిగిన రాష్ట్రాలలో దక్షిణాది నుంచి కర్ణాటక, తెలంగాణ మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి. కర్ణాటక 3.96 లక్షల కోట్లు, మహారాష్ట్ర రూ.2.37 లక్షల కోట్లు, తెలంగాణ రూ.1.81 లక్షల కోట్లు సాఫ్ట్ వేర్ ఎగుమతులు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు కేవలం రూ.1,256 కోట్లు మాత్రమేనని, ఇది మొత్తం దేశం సాఫ్ట్ వేర్ ఎగుమతులలో కేవలం 0.1 శాతం మాత్రమేనని కేంద్ర మంత్రి ప్రకటించాారు.

Advertisements

Latest Articles

Most Read