జగన్.. అధికారంలోకి వస్తే భూమిపై స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలను నరకాన్ని చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు మీ కోసం...! జగన్ పుట్టినరోజుకు ప్రభుత్వ నిధులు వెచ్చించడమేంటి? విజయవాడలో అధికారికంగా సాంస్కృతికశాఖ మంత్రి రోజా నృత్య కార్యక్రమాలు ప్రత్యక్షంగా ఆమే స్వయంగా నిర్వహించడంలో అర్థంలేదు. జగన్ పుట్టినరోజుకు సాంస్కృతిక, క్రీడాశాఖలు రూ.2.50 కోట్లు వెచ్చించడం దారుణం. ఏ సీఎం ఇలా చేయలేదు. ఎన్టీరామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి యేడాది రక్తదానాలు చేస్తారు. శిబిరాల వద్దకు తీసుకొచ్చి రక్తమివ్వండని ఎవరూ అడగరు, డాక్టర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తారు. అంతేగానీ ఎవరూ బలవంతపెట్టరు. జేఎన్ టీయు, ఎన్ఎస్ఎస్ సంస్థ ల ద్వారా విద్యార్థులచే బలవంతంగా రక్తదానం చేయించడం హాస్యాస్పదం. బలవంతంగా రక్తదానం ఎక్కడా చేయించారని పాలకులు అర్థం చేసుకోవాలి. ఈ మూడున్నర సంవత్సరాలుగా విద్యార్థులు, మహిళలు, యువకులు, వృద్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్థులు, కూలీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏ వర్గంవారు కూడా సంతోషంగా లేరు. జగన్.. రాష్ట్రానికి ఏమీ చేయలేదు. రాష్ట్రాన్ని పరిపరివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో విద్యాదీవెన, వసతి దీవెన, నాడు-నేడు, అమ్మఒడి పెట్టిన అంశాలుగా పెట్టారు. పాల్గొనే విద్యార్థులకు జగన్ ప్రవేశపెట్టిన పథకాలను పొగిడితేనే ఫస్ట్, సెకండ్ మార్కులొస్తాయి.

విమర్శనాత్మక ధోరణితో రాస్తే ప్రైజు రాదు కదా.. ప్రమాదం ఉంటుంది. కావున విమర్శనాత్మకంగా రాయొద్దని భయపడి తల్లిదండ్రులు విద్యార్థులకు చెబుతున్నారు. రేపు మీ వెంటపడే అవకాశముంది.కాబట్టి తస్మాత్ జాగ్రత్త. జగన్ స్వాతంత్ర్య సమరయోధుడా? రాష్ట్రంలో ఎవరూ తీసుకరాని సంస్కరణలు తీసుకొచ్చారనా?. ధీరాదాత్తుడనా? ఈ రాష్ట్రానికి మంచిపనులు చేశారనా? రాష్ట్రాన్ని ఆర్థికంగా , సాంఘికంగా, సాంస్కతికంగా అభివృద్ధి చేశారనా? రాష్ట్రం తలెత్తుకునేలా చేసిన వ్యక్తి అనా! ఎందుకు ఈ సంబరాలు? రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను అధోపాతాళానికి నెట్టేశారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పోయేలా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రానీయకుండా చేశాడు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. పారిశ్రామికులు భయంతో తరలి వెళ్లిపోయేలా చేశారు. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చారు. ప్రజలు నమ్మారు, నమ్మినందుకు నట్టేట ముంచారు. నాకొక ఛాన్స్ ఇచ్చి చూడండి నా సత్తా చూపిస్తానని చెప్పి మోసం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తానన్నాడు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానన్నాడు. ఉద్యోగస్థులకు వారం రోజుల్లోనే ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు. సకాలంలో డీఏలు ఇస్తానన్నాడు, రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్నాడు, డ్వాక్రా స్థితిగతులు మెరుగుపరుస్తానన్నాడు.

అమరావతిని బ్రహ్మాండంగా అబ్బురపరచేలా రాజధానిని నిర్మిస్తానని చెప్పి అన్ని రకాలుగా మోసం చేశారు. చెప్పిన మాటలన్నీ మోసకారి మాటలు అని తేలిపోయాయి. అసెంబ్లీలో టీడీపీతోపాటు మేం కూడా అమరావతిని రాజధానిగా అంగీకరించి తీర్మానం చేసి ఇప్పుడు మూడు రాజధానుల ముచ్చట పెట్టారు. దొంగ నాటకమాడుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారు. అప్పుడు తనను గెలిపించండి తన సత్తా ఏంటో చూపిస్తానని అరచి అరచి చెప్పి ఇప్పుడు కరుస్తున్నారు. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని జగన్ పుట్టినరోజు సంబరాలు? పుట్టినరోజులకు స్వచ్ఛందంగా రక్తదానమిస్తారు, బలవంతాలేంటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన, నాడు-నేడు, అమ్మఒడి లపై వ్యాసరచన పోటీలు పెట్టకుండా ఏ దేశోద్ధారకుల గురించో రాయమంటే ప్రజలు హర్షించేవారు. జగన్ వావిలాల గోపాలకృష్ణ కంటే గొప్పవాడా? విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీరామారావు, చెన్నారెడ్డి, అంజయ్య, రాజశేఖర్ రెడ్డిలెవరూ ఇలా చేయలేదు. రాష్ట్రంలో మీరొక్కరే బతకాలనుకోవడం అవివేకం. మా పార్టీ మాత్రమే ఉండాలనుకోవడం దుర్మార్గం. మీ ఇష్టమొచ్చినట్లు దాడులు చేస్తామనడం అహంకారం. పోలీసులను ఉపయోగించి కేసులు పెడుతున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అశోక్ బాబులాంటివారిని అరెస్టు చేసి ఏం సాధించారు? టీడీపీలో భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు. ఎవరూ భయపడరు. దౌర్జన్యకాండ చేసి జన్మదినాలు జరుపుకుంటున్నారు. వివేకానందుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపతిరాయ్ ని పోల్చుకొని మురిసిపోకండి. ఇప్పటికైనా ప్రభుత్వ నిధులను జగన్ పుట్టినరోజుకు వాడకుండా ఉండాలని కోరుచున్నాను.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ వ్యూహం సినిమాకి నిర్మాత దాసరి కిరణ్ కి టీటీడీ పాలకమండలి సభ్యత్వం కానుకగా  ఇచ్చారు. జగన్ గురువు స్వరూపానంద సిఫారసుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి బూదాటి లక్ష్మీనారాయణపై గతంలో బోర్డ్ మెంబెర్ ఇవ్వగా, ఇప్పుడు సీబీఐ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. దీంతో  లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేసారు. ఖాళీ అయిన టిటిడి పాలకమండలి సభ్యత్వాన్ని దాసరి కిరణ్ కి ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. టిడిపి ప్రభుత్వ హయాంలో శేఖర్ రెడ్డికి టీటీడీ పాలకమండలి సభ్యత్వాన్ని ఇవ్వడాన్ని తప్పుబట్టిన జగన్ ..అదే శేఖర్ రెడ్డికి తాను సీఎం అయిన వెంటనే పేరు జనాలు గుర్తు పట్టకుండా టీటీడీ మండలిలోకి తీసుకున్నారు. టీటీడీ పాలకమండలిని వైసీపీ క్విడ్ ప్రోకో వ్యవహారాల వేదికగా మార్చేశారనే ఆరోపణలున్నాయి. వివాదాస్పద నిర్ణయాలతో ఇప్పటికే టీటీడీ ప్రతిష్ట మంట గలిపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ .. ఇప్పుడు తన జీవితాన్ని సినిమాగా తీస్తున్న నిర్మాతకి ప్రతిఫలంగా టిటిడి పాలకమండలి సభ్యుడిని చేసేశారు. ముఖ్యమంత్రి జగన్ బయోపిక్ ``వ్యూహం`` సినిమాకి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. తన జీవితాన్ని సినిమాగా తీస్తున్నారనే ఒకే ఒక కారణంతో దాసరి కిరణ్ కుమార్ కీ టీటీడీ పాలకమండలి పదవి కట్టబెట్టడంపై వైసీపీలోనే తీవ్ర చర్చ నడుస్తోంది.

అనంతపురం జిల్లాలో వైసీపీకి ఇదేం ఖర్మ అని తలలు పట్టుకుంటున్నారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరువాత పార్టీలో అన్నీ తానై నడిపించే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా అంతటా వైసీపీలో అసమ్మతిని చక్కదిద్దేందుకు పెద్దిరెడ్డి రంగంలోకి దిగారని తెలుసుకున్న నేతలు ఎక్కడిక్కడే తమ బలప్రదర్శనకి వేదికగా చేసుకున్నారు. పెనుగొండలో మాజీ మంత్రి శంకరనారాయణ తీరు పట్ల తీవ్ర కోపంగా వున్న వైసీపీ అసమ్మతి నేతలు  పెద్దిరెడ్డి పై చెప్పులు విసరడానికి కూడా వెనుకాడలేదు. పరిస్థితి చక్కదిద్దేందుకు దిగిన పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా స్థానిక వైసీపీ నేతలు నిరసనకి దిగడం అధిష్టానాన్ని షాక్ కి గురిచేసింది. పెద్దిరెడ్డి కాన్వాయ్ కి అడ్డంపడడం తీవ్రంగా పరిగణించినా అసమ్మతి నేతలు లెక్కచేయలేదు. మంత్రి ఉషశ్రీ పై వ్యతిరేకత కూడా పెద్దిరెడ్డిపై ప్రతిబింబించింది. అసమ్మతి చక్కదిద్దేందుకు పెద్దిరెడ్డి హాజరయ్యే ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. కదిరి, హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గాల వైసీపీలోనూ తిరుగుబాట్లు వైసీపీ పెద్దలు పెద్దిరెడ్డికి తలపోటుగా మారాయి.

ఆంధ్రప్రదేశ్ దుస్థితి దా"రుణం"గా వుందని కేంద్రం వెల్లడించింది. పూర్తిగా అప్పుల ఊబిలో ఏపీ కూరుకుపోయిందని పార్లమెంట్ వేదికగా వాస్తవాలను కేంద్రం స్పష్టం చేసింది. ఏటేటా విపరీతంగా పెరుగుతున్న ఏపీ అప్పుల భారం ఏ రేంజ్ లో ఉందో లెక్కలతో కేంద్రం బయటపెట్టింది. లోక్‍సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబుగా  కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరాలు వెల్లడించారు. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2,29,333.8 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.3,60,333.4 కోట్లకు చేరాయి. మరోవైపు ఏటా  అప్పుల శాతం పెరిగిందని గణాంకాలు తేల్చేశాయి. ఆర్థిక మంత్రి బుగ్గన బుకాయింపులు, సలహాదారుల సన్నాయి నొక్కులు కేంద్రం లెక్కల ముందు తేలిపోయాయి.  గతంతో పోలిస్తే 2017-18లో రుణాలు 9.8 శాతం తగ్గితే 2020-21 నాటికి 17.1 శాతం పెరుగుదల నమోదైంది. ఏపీ స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం - పెరుగుతూ వస్తోంది అని మంత్రి తెలిపారు. ఉన్న అప్పులు, బడ్జెట్‍లో చూపిన అప్పుల కంటే బడ్జెటేతర అప్పులను భారీగా ఏపీ ప్రభుత్వం చేస్తోందని కేంద్రం పార్లమెంటులో కుండబద్దలు కొట్టింది.

Advertisements

Latest Articles

Most Read