స్థానిక ఎన్నికల పోరులో అధికార వైసీపీ ఎలా రేచ్చిపోయిందో అందరూ చూసారు. విపక్షాలు అన్నీ, గవర్నర్ కు, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకమిషనర్ రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో పాటు తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరడం సంచలనాన్ని రేకెత్తించింది. ఈ అంశాన్ని అధికార పార్టీ తమకనుకూలంగా మార్చుకునేందుకు బూటకమంటూ ప్రచారానికి తెరతీయగా.. ఇది వాస్తవమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటన వైకాపాకు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తమకనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమవు తూనే, ఏకగ్రీవాలపై న్యాయపోరాటానికి సన్నాహాలు ప్రారంభించింది. గత స్థానిక ఎన్నికల్లో రెండు శాతం మాత్రమే ఉన్న ఏకగ్రీవాలు, ఇప్పుడు 24 శాతానికి చేరడంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఈసీ లేఖను ఉదాహరణగా చూపుతూ న్యాయస్థానాలను ఆశ్రయించింది. మరోవైపు అధికార పక్షం దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాలు చింపివేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఆధారాలను కోర్టులో అందజేసి, ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని పోరాటానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ప్రజాక్షేత్రంలో అధికార పక్షాన్ని దోషిగా నిలబెట్టేందుకు తన వంతు ప్రయత్నాలను సాగిస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న ఆగడాలను, అప్రజాస్వామిక పోకడలపై తెదేపా ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి తనకు భద్రత కల్పించాలని కోరుతూ లేఖ రాయడాన్ని అస్త్రంగా మలుచుకుని ముందుక వెళ్తుంది. ఈసీ లేఖను ఆసరాగా చేసుకున్న తెలుగుదేశం పార్టీ సాక్షాత్తూ ఎన్నికలకమిషనర్ కే రక్షణ లేనప్పుడు విపక్ష పార్టీలు, ప్రజల పరిస్థితేంటని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. అయితే, దీన్ని తిప్పికొట్టేందుకు అధికార వైకాపా అసలు ఎన్నికల కమిషనర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదని, ఇదంతా టీడీపీ పన్నిన కుట్ర అంటూ డీజీపీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఎన్నికల కమిషనర్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, అందుకే ఇలాంటి కుట్రకు తెర తీశారని ఆరోపణలు గుప్పించాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ నీరజ్ కుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు వివరణగా ఈసీనే లేఖ రాశారని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం దీన్ని ఒక బూటకంగా ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేసింది. తాజాగా శుక్రవారం స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఈసీ లేఖ రాసింది వాస్తవమేనని, అందుకే ఆయనకు భద్రత కల్పించడం జరిగిందని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపగా.. అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మరింత దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంశాఖ సహాయ మంత్రి ప్రకటన చేసిన వెంటనే ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అధికార పక్షాన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈసీ రాసిన లేఖను అస్త్రంగా చేసుకుని, ఏకగ్రీవాలపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించడంతోపాటు ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలనే డిమాండ్ తెరపైకి తీసుకువస్తున్నారు.

రాష్ట్రంలో గత మూడు రోజులుగా కలకలం సృష్టించిన ఆ లేఖను రాష్ట్ర ఎన్నికలకమిషన్‌ ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమారే రాశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో లేఖ కలకలానికి తెరపడినప్పటికీ ఏపీ రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా మలుపుతిరిగినట్లయ్యాయి. ఆ లేఖను స్వయం గా ఈసీనే రాశారని కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అధికార వైసీపీ ఇప్పుడేం చేయబో తోంది..? ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ అసెంబ్లీలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అధికారపక్షం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మొదటినుండి ఈసీకి అనుకూలంగా అధికార పార్టీ పై ఎదురుదాడికి దిగుతున్న ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా వ్యూహమేంటి?..అసలు లేఖ తరువాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ఎలా ఉండబోతోంది అనే అంశాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ నేపథ్యంలో ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఈసీ ఈనెల 15వ తేదీ సంచలన నిర్ణయం తీసు కుంది. అయితే, అదే రోజు సాయంత్రం ఈసీ నిర్ణయంపై సీఎం జగన్ ఈసీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కులం ఆపాదించటం, మంత్రులు, స్పీకర్ ఆయన్ను తిట్టటం వంటివి నడుస్తూ ఉండగానే, ఈసీ పేరుతో బుధవారం రాత్రి కేంద్ర హోం శాఖకు 5 పేజీల లేఖ చేరింది. అయితే, మొదట్లో ఆ లేఖ ఎవరు రాశారో స్పష్టంగా అర్థం కానప్పటికీ దేశవ్యాప్తంగా ఆ లేఖ మాత్రం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది.

ఆ లేఖపై ఎట్టకేలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఒక ప్రకటన చేయడంతో లేఖ వివాదానికి తెరపడినట్లయింది. చేద్దాం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది ఈసీనే అని నిర్ధారణ కావడంతో అధికార వైసీపీ కొత్త వ్యూహానికి పదునుపెడుతోంది. నిన్నటి వరకూ ఆ లేఖ తెదేపా కార్యాలయంలో తయారుచేసి ఈసీకి పంపితే ఆయనకేంద్ర హోంశాఖకు పంపారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలని కోరుతూ వైసీపీ ముఖ్య నేతలు డీజీపీ సవాంగ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే, వారు ఫిర్యాదుచేసి 48 గంటలు తిరగకమునుపే ఆ లేఖపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇప్పుడేం చేయాలనే అంశంపై అధికారపార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రత్యేకించి ఈసీ కార్యకలాపాలు కూడా హైదరాబాద్ నుండే నిర్వహించాలని ఆయన ప్రకటించడం రాష్ట్రానికి వచ్చే సందర్భంలో బధ్రతను కూడా పెంచుతా మని, ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాహ్నితో ఫోన్లో మాట్లాడి రక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

అవసరమైతే ఈసీ రక్షణ విషయంలో రాష్ట్రానికి లిఖితపూర్వ కమైన ఆదేశాలు కూడా ఇస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్రం మరింత మద్దతుగా నిలుస్తుందన్నది స్పష్టంగా అధికార పక్షానికి అర్ధమైంది. ఈ నేపథ్యంలో తదుపరి వ్యూహానికి వైసీపీ పదును పెడుతోంది. అందులో భాగంగానే ఈ నెల చివరలో జరగనున్న ఓటన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి తొలగించి ఆ తీర్మాణాన్ని కేంద్రానికి పంపాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ చేసే ప్రతి అప్రజాస్వామిక అంశంలోనూ ప్రధాన ప్రతిపక్షమైన తెదేపాపై ఎదురుదాడి చేస్తూనే ఉంది. ప్రజా వేదిక కూల్చటం, మూడు ముక్కల రాజధాని, తన మాట వినని శాసనమండలి రద్దు చెయ్యటం వంటి వాటి పై పోరాడుతూనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కు నోటిఫికేషన్ విడుదల అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న వివిధ సంఘటనల నేపథ్యంలో ఈసీని వేదిక గా చేసుకుని తెదేపా అధికారపక్షంపై దూకుడు పెంచింది. అందుకు తగ్గట్టుగానే రాజకీయ వాతావరణం వారికి అనుకూలంగా మారడం, ఈసీ కేంద్రానికి లేఖ రాయ డం, ఆ లేఖకు మద్దతుగా కేంద్రం ప్రతిస్పందించడం తెదేపా తనకు అనుకూలంగా మల్చుకుని తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమౌతోంది.

రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం అధికారిక కార్యకలాపాలు అమరావతి నుంచి కాకుండా విశాఖ నుంచే ప్రారంభం కాబోతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో సచివాలయ ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోంది. అయితే ఆదివారం ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆకస్మికంగా ఆరు వారాలు వాయిదా వేయడం తాత్కా లికంగా ఊరట కలిగించే విషయం అయినా తరువాత విశాఖ తప్పదన్న భావనలో ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కీలక సమావేశంలో ఉద్యోగులను అలెర్ట్ చేసారు. ఇదిలా ఉండగా మే నెలలో అమరావతిని వీడి విశాఖకు వెళ్లే విషయంలో ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచిన సచివాలయ ఉద్యోగులు వాటి విషయంలో ప్రభుత్వం నుంచి హామీల మేరకు తుది నిర్ణయం తీసుకునేందుకు ఆలోచనలో ఉన్నారు. విశాఖ ప్రతిపాదన చర్చలు రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో మే నెల తర్వాత విశాఖ వేదికగా పాలన ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.

దీంతో ఈ లోపే ఉద్యోగులను అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగ సంఘాలతో సీఎస్ నీలం సాహ్ని పలుమార్లు భేటీ అయ్యారు. ఇందులో ఉద్యోగుల డిమాండ్లు ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి నుంచి విశాఖ వెళ్ళేందుకు తమ ముందు ఉంచిన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. వీటిని ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిలో ప్రధానంగా విశాఖకు మే నెలలో వెళ్లగానే అక్కడ తాత్కాలికంగా అయిన ప్రభుత్వం వసతి సదుపాయాలు కల్పించాలని, అలాగే విశాఖకు వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇతర ఛార్జీలు చెల్లించాలని ఉద్యోగులు ప్రతిపాదన చేశారు. అదే విదంగా తమపిల్లలకు విశాఖలో విద్యాసంస్థల్లో అడ్మిషన్లు దొరికేలా ప్రభుత్వం సాయం చేయాలని కూడా ఉద్యోగులు అడుగుతున్నారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నప్పటికి ప్రధానంగా వీటిపైనే ఉద్యోగులు పట్టుదలగా ఉన్నారు.

గత వారం భేటీలో నిర్ణయం విశాఖ వెళ్లేందుకు ప్రభుత్వం ముందు తాము ఉంచిన డిమాండ్ల పై ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురు చుస్తున్నారు. కాగా మే నెలలో తరలింపు ప్రారంభించి జూన్ చివరి నాటికి సచివాలయంతో పాటు ఇతర శాఖాధిపతుల కార్యాలయాలను విశాఖకు తరలించాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ ముందు పెట్టిన డిమాండ్లలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను కోరింది. దీంతో వారు ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై చర్చిస్తున్నారు. త్వరలో వారు ఉద్యోగులకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను కమిషనర్ ఆకస్మికంగా వాయిదా వేయడం, కరోనా వైరస్ నేపథ్యంలో అమరావతి నుంచి పరిపాలన విశాఖపట్నంకు మార్చే ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్క ఈ విషయం కోర్టులో ఉండగా, ప్రభుత్వం కనుక ఇలా దూకుడుగా వెళ్తే, కోర్ట్ లో ఇబ్బందులు తప్పవని, ఇప్పటికే కోర్ట్ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆఫీసులు మార్చితే, ఆ ఖర్చులను అధికారుల నుంచే వసూలు చేస్తాం అని కోర్ట్ చెప్పిన విషయం తెలిసిందే. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు అడ్డుకట్ట వేయాలని అధికారపక్షం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషను పనిచేసిన మాజీల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను గవర్నర్‌ను కలిశారు. వీరిలో సీఎస్ నీలం సాహ్ని, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎస్ఈసీ అంశంపై వారు గవర్నర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కూడా వారు గవర్నరుకు వివరించారు. ముఖ్యంగా ఎస్ఈసీ రాసిన లేఖలోని పలు అంశాలను వారు గవర్నర్ వద్ద ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉండి కార్యకలాపాలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయిచండాన్ని అధికార వైసీపీ తీవ్ర పరిణామంగా తీసుకుంటోంది.

అందుకే ఎస్ఈసీ వివాదానికి తెరవేయాలని ఖరాఖండిగా నిర్ణయించింది. ఇందుకోసం రెండుమూడు వ్యూహాలనుసిద్ధం చేస్తోంది. ఇందులో మొదటిగా ఎస్ఈసీని విధుల నుండి తప్పించేందుకు ఎలా వెళ్లాలనే అంశం పై దృష్టిపెడుతోంది. ఈ నెల 28 నుండి 31 వరకూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లోనే ఎఈసీని బాధ్యతలనుండి తొలగించేలా తీర్మానం చేసి దానిని కేంద్రానికి పంపాలని యోచన చేస్తోంది. అయితే, రాష్ట్రం పంపిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తుందా..లేదా..అన్నదానిపై సంశయం నెలకొన్న నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా చేయాల్సిన కార్యక్రమాలపై కూడా దృష్టిపెడుతోంది. ఇందులో భాగంగా ఎస్ఈసీ ఇచ్చిన లేఖ ఎక్కడి నుండి వచ్చిందో సాంకేతికంగా తెలుసుకునేందుకు అన్వేషణ ప్రారంభించింది. దీనిపై ఇప్పటికే ఆ పార్టీ తరపున డీజీపీ సవాంగ్ కు ఫిర్యాదుచేసి వాస్తవాలను బయటపెట్టాలని కోరింది.

ఇక దీంతో పాటు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేనందున ప్రభుత్వం తరపున ఏఏ నిర్ణయాలు తీసుకుంటే ఈ వివాదాన్ని కట్టడి చేయవచ్చనే అంశంపై కూడా దృష్టిపెట్టారు. ఇదే అంశంపై అధికారపక్షం మరోమారు కోర్టును ఆశ్రయించడమా లేక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే మరో అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ తరహాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ లోను ముగ్గురు కమిషనర్లను నియమించాలని భావిస్తున్నారు. వెంటనే ఆర్డినెన్స్‌ తెచ్చి, మరో ఇద్దరు కమిషనర్లను, తమకు అనుకూలమైన వారిని నియమించాలని, తద్వారా రమేష్ కుమార్ కు బ్రేక్ వెయ్యచ్చు అని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ అయ్యే పనులు కాదని, హైకోర్టు న్యాయమూర్తి హోదా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను అభిశంసన ద్వారా తప్ప, వేరే విధంగా తప్పించే అవకాశమే లేదని అంటున్నారు. ఇవన్నీ జరిగితే కేంద్రం చూస్తూ ఊరుకోదని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read