విజయవాడ ఎంపీ కేశినేని నాని గత కొంతకాలంగా వైకాపా నేతలని పొగుడుతూ వారితో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. టిడిపి ఎంపీగా గెలిచినా, టిడిపికి కార్యక్రమాలకు దూరం పాటిస్తూ వస్తున్న కేశినేని నాని అధిష్టానంపై అప్పుడప్పుడు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. టిడిపి పెద్దలు కేశినేని నానిని గౌరవిస్తూనే ఆయన అసహనం వెనుక వ్యూహాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వస్తోంది. ఎన్నికల మూడ్ రాష్ట్రంలో నెలకొన్న వేళ, కేశినేని నాని బయటపడిపోయారు. పూర్తిగా వైకాపా నేతలతో తన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలలో వైకాపా ఎమ్మెల్యేలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, నా రాజకీయం ఇలాగే ఉంటుంది, నచ్చిన వాళ్ళతో కలిసి పని చేస్తానని, రాజకీయం ఎప్పుడూ చేయకూడదని, ఎన్నికల సమయంలోనే చేయాలని చెప్తున్నారు. నాని మాటలతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడుతూ వచ్చిన టిడిపి, ఇప్పుడు కేశినేని నాని మాటలను గమనిస్తుంది. వైసీపీతో విజయవాడ ఎంపీ టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరో పక్క, కేశినేని నాని వైఖరితో ఇప్పటికే ప్రత్యామ్నాయం కోసం టిడిపి ఆయన తమ్ముడు చిన్నిని టచ్‌లో పెట్టుకుందని తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటులో అభివృద్ధి కోసం గొంగళి పురుగుని ముద్దు పెట్టుకుంటానంటూ చెప్తున్న కేశినేని నాని...విజయవాడ మెట్రో రైలుని వైకాపా సర్కారు ఎత్తేస్తే నోరు మెదపకపోవడం వెనుక, విమర్శలు వస్తున్నాయి. టిడిపి విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టలదొరకైనా ఇచ్చుకోవచ్చంటూనే, తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాననడం కేశినేని నాని తన అహంకార ధోరణిని మరోసారి బయట పెట్టారని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. మొన్న మొండితోక, నిన్న వసంతతో కలిసి ప్రెస్ మీట్ లు పెడుతున్న నాని నేడో రేపు ఊహించని నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
news
ముందెన్నడూ లేని ముందస్తు స్పీడులో చంద్రబాబు.. డైలమాలో జగన్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారనే పేరుంది. సీఎంగా ఉన్నా, ప్రతిపక్షనేతగా ఉన్నా నిర్ణయాలు తీసుకోవడంలో నాన్చుడు ధోరణితో పార్టీ నేతలే విసిగిపోయారు. దశాబ్దాల తన తీరుకి భిన్నంగా చంద్రబాబు జెట్ స్పీడుతో తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో కొత్త ఉత్సాహం నింపాయి. మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ప్రకటించి అధికార వైసీపీని అయోమయంలోకి నెట్టేసిన బాబు, టిడిపి కేడర్‌లో జోష్ నింపారు. మరోవైపు పొత్తులు విషయం కూడా తేల్చేశారు. జనసేనతో ఎన్నికలకి వెళ్తారనే సంకేతాలు లీడర్ల నుంచి కేడర్ వరకూ స్పష్టం చేసేశారు. టికెట్ల ఎంపిక విషయంలో సీబీఎన్ స్పీడు మామూలుగా లేదు. గత ఎన్నికలకి తాను సీఎంగా ఉన్నా, ఎన్నికల తేదీలు ప్రకటించినా..అభ్యర్థుల ఎంపిక నామినేషన్లు వేసేవరకూ నాన్చి తీవ్రంగా నష్టపోయారు. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి సీటు కూడా నామినేషన్ వేసే ముందు ప్రకటించడం, ఎన్నికల సన్నాహాలకి కూడా సమయం లేని పరిస్థితి ఎదురైంది. 2024లో జరగాల్సిన ఎన్నికలు ముందస్తుగా వచ్చినా తాము రెడీ అంటూ సంకేతాలిస్తున్నారు బాబు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పొత్తులు ఖరారైపోయాయి. అభ్యర్థులని దాదాపు ప్రతీ కార్యక్రమంలోనూ ప్రకటించేస్తున్నారు. దాదాపు 130 స్థానాలకు అభ్యర్థులని ఖరారు చేసేసి పనిచేసుకోమని బాబు చెప్పేశారని టిడిపిలో చర్చ నడుస్తోంది. తాజాగా సత్తెనపల్లి టిడిపి ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణని ప్రకటించిన బాబు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముందెన్నడూ లేని చంద్రబాబు స్పీడు చూసి టిడిపి నేతలు, కార్యకర్తలు ఉరుకుపరుగులు పెడుతూ పనులు చేస్తున్నారు. రాజమహేంద్రవరం మహానాడులో రాత్రి మేనిఫెస్టో ప్రకటిస్తే, తెల్లారేసరికి చాలా మంది నేతలు ఆ కరపత్రాలు పట్టుకుని ఇంటింటికీ ప్రచారానికి దిగారు. చంద్రబాబు స్పీడు చూసి వైకాపా క్యాంపులో ఉన్న నిస్తేజం కాస్తా డైలమాగా మారింది. వైకాపా నుంచి సీనియర్లే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిస్తున్నారు. మరికొందరిని జగన్ తప్పిస్తారనే టాక్‌తో గందరగోళం నెలకొంది.
చంద్రబాబు మారిపోయాడు అనేదానికి, ఇదే ఉదాహరణ...
చంద్రబాబు వ్యవహార శైలి పై, గతంలో తెలుగుదేశం పార్టీలో అనేక విమర్శలు వస్తూ ఉండేవి. అవి మంచి చేసేవే అయినా, చంద్రబాబు నిర్ణయాలు పార్టీలో చాలా మందికి నచ్చేవి కాదు. ముఖ్యంగా చంద్రబాబు, ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే, ఆయన తీసుకునే సమయం, నాన్చే విధానంతో, టిడిపి శ్రేణులు విసుగెత్తిపోయేవి. ముఖ్యంగా ఏదైనా సమస్య జటిలం అవుతుంటే, దాన్ని మరింత జటిలం చేసేలా చంద్రబాబు వ్యవహార శైలి ఉండేది. అయితే విమర్శలు నుంచి , పాఠాలు నేర్చుకుని, మారే వాడే నాయకుడు. చంద్రబాబు అలాంటి వారు కాబట్టే, ఆయన ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. మొన్నటి మ్యానిఫెస్టో పెద్ద షాక్. ఇంత ప్రిపెరేడ్ గా చంద్రబాబు ఎన్నికలకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక సీట్ల విషయంలో కూడా తేల్చి పడేస్తున్నారు. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరించింది. సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు నియమించారు. టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేసారు. అయితే ఇక్కడ కోడెల శివరాం ఉన్న సంగతి తెలిసిందే. సహజంగా ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాన్చుతూ, చివరి వరకు తేల్చే వారు కాదు. ఎన్నికల పది రోజులు ముందు క్లారిటీ ఇచ్చే వారు. అయితే ఇప్పుడు మాత్రం ఏడాది ముందే తేల్చేసారు. కోడెల శివరాంని ఎలా సముదాయిస్తారు అనేది పక్కన పెడితే, అంబటికి మాత్రం కన్నా సరైన పోటీ అని, అంబటి ఓడిపోవటం ఖాయం అని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి.
జమ్మలమడుగులో లోకేష్ పాదయాత్ర సక్సెస్ దేనికి సంకేతం ?
జమ్మలమడుగులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనసంద్రాన్ని తలపించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జమ్మలమడుగు అంటే వైఎస్ జగన్ రెడ్డి అడ్డా. టిడిపిలోకి వచ్చిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు లేరు. టిడిపిలో చాలా ఏళ్లుగా ఉంటూ వచ్చిన రామసుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీ నేత. జమ్మమడుగులో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ. ఎటుచూసినా ఇక్కడ టిడిపికి పెద్ద దిక్కులేదు. టిడిపిలో చేరింది ఓ యువనేత మాత్రమే. వైసీపీలో మదమెక్కిన అధికారం. ధీటుగా ఢీకొట్టే నేతలు బీజేపీ పంచన ఉన్నారు. టిడిపికి దశాబ్దాలుగా వెన్నంటి ఉన్న నేత వైసీపీలో చేరాడు. సరిగ్గా అటువంటి సంక్షోభ సమయంలో, తెలుగుదేశం మాటే వినిపించని జమ్మలమడుగులో టిడిపి యువనేత నారా లోకేష్ పాదయాత్ర జనసునామీని తలపించింది. జనసంద్రంగా మారిన జమ్మలమడుగులో ఎటుచూసినా జనమే. లోకేష్ ని చూసేందుకు వచ్చిన జనంతో కిలోమీటర్ల మేర డ్రోన్ షూట్‌కి అందనంత జనం పోటెత్తారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేశారు ప్రజలు. జమ్మలమడుగులో పాదయాత్ర విఫలం అవ్వాలని అధికార పార్టీ వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. కుర్రాడైనా, రాజకీయాలకు కొత్తయిన దేవగుడి భూపేష్ రెడ్డి కోఆర్డినేషన్ నభూతో నభవిష్యత్ అన్న చంద్రంగా ఉంది. బెదిరింపులకి దేవగుడి వారబ్బాయి భయపడలేదు. అడ్డంకులు సృష్టిస్తే నారా సింహం వెనకడుగు వేయలేదు. ఇక చివరి అస్త్రంగా జమ్మలమడుగులో కరెంట్ తీసేయించారు. వీధిలైట్లు వెలగకుండా జనం రాకూడదని, కనపడకూడదని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పల్లెల నుంచి జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. టిడిపి కేడర్ ఉరకలెత్తే ఉత్సాహంతో కదం తొక్కింది. టిడిపికి లీడర్, కేడర్‌లేని వైకాపా అడ్డాలో అశేష ప్రజాస్పందన, ప్రభుత్వంపై వ్యతిరేకతే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోకేష్ చరిష్మా, టిడిపి మినీ మేనిఫెస్టో కూడా జమ్మలమడుగు జనసంద్రానికి ముఖ్యకారణాలని అభిప్రాయపడుతున్నారు.