ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి రాష్ట్ర ఎన్నికల సంఘం పైనే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో, ఎన్నికల కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికల పై ఏమి నిర్ణయం తీసుకుంటుందా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చిన వార్తలు ప్రకారం చూస్తుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో వ్యూహాత్మికంగా వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఎన్నికల కమిషన్ పై విరుచుకు పడుతున్నారు. ఈ నేపధ్యంలో, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. అందుకే ఈ విషయం పై కోర్టు నిర్ణయానికే వదిలేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై, గత ఏడాది వేసిన కేసు విషయంలో, ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే హైకోర్టు, ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికల నిర్వహణ పై అభిప్రాయం చెప్పండి అంటూ, ఎన్నికల కమిషన్ ని కోరింది. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలే జరుగుతున్నాయి కాబట్టి, మీకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది. దీని పై తమకు పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ నేపధ్యంలోనే, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈ విషయం పై కసరత్తు ప్రారంభించింది. ముందుగా, రాష్ట్ర హెల్త్ సెక్రటరీని పిలిపించి, రాష్ట్రంలో పరిస్థితి పై ఆరా తీసింది. ఆ తరువాత రోజు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంది. వైసీపీ పార్టీ తప్ప, అన్ని ప్రముఖ పార్టీలు, ఈ సమావేశానికి వచ్చి, తమ అభిప్రాయం తెలిపాయి.

అయితే నవంబర్ 4న ఈ కేసు మళ్ళీ హైకోర్టులో వాయిదా వస్తుంది. ఆ సమయం లోపే, ఎన్నికల కమిషన్ తరుపున అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్ గా, వ్యూహాత్మికంగా వెళ్ళాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయలు తన అఫిడవిట్ లో చెప్పి, ఆలాగే ప్రభుత్వం ఇచ్చిన నివేదికను కూడా అఫిడవిట్ లో చెప్పి, తాము దేనికైనా సిద్ధం అని, కోర్టు నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటాం అని చెప్పే అవకాసం ఉంది. మెజారిటీ రాజకీయ పార్టీలు ఒప్పుకోవటంతో, కోర్టు ఏమి చెప్తుందో చూడాలి. మరో పక్క స్కూల్స్ కూడా ప్రారంభిస్తున్న ఏపి ప్రభుత్వం, ఎన్నికల నిర్వహణ పై మాత్రం వెనకడుగు వేస్తుంది. తాము ఇప్పుడు ఎన్నికలు జరపలేం అని ఎలక్షన్ కమిషన్ కు తేల్చి చెప్పింది. తమ ఉద్యోగులు వైరస్ బారిన పడతారని అంటుంది. ఈ నేపధ్యంలో కోర్టు ఏమి డైరెక్షన్స్ ఇస్తుంది ? గత ఎన్నికల నోటిఫికేషన్ ఏమి అవుతుంది ? గత ఏకాగ్రీవాలు ఏమి అవుతాయి ? అసలు ఎన్నికలు జరుగుతాయా ? లేక నిమ్మగడ్డ సర్వీస్ అయిపోయేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపదా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందో మరి ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఈ మధ్య కాలంలో అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రతి పనిలోనూ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. 60 మంది సలహాదారులు ఉండి కూడా, ప్రభుత్వ పరువు తీస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తే వచ్చింది. ఈ వార్తా విని అందరూ విస్మయం వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెంచాలి అంటూ, టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా భారీ ధరకు. రూ 8.15 కోట్లు ఖర్చు పెట్టి, కేవలం టైమ్స్ అఫ్ ఇండియా వారు, ఏపి ప్రభుత్వం ప్రతిష్ట పెంచే కధనాలు రాస్తారు అంట. ఈ విషయం పై ఏకంగా జీవో విడుదల అయ్యింది. దీంతో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క డబ్బులు లేవు అంటున్నారు, అన్ని రకాల పేమెంట్ లు ఆగిపోయాయి. అలాగే వివిధ రంగాలకు బడ్జెట్ కుదించారు. ప్రతి నెల అప్పులతో నెట్టుకుని వచ్చే పరిస్థితి. ఇప్పటికే ఈ ఏడాది 44 వేల కోట్ల అప్పు అంచనా చేస్తే, కేవలం ఆరు నెలలకు ఇప్పటికి 55 వేల కోట్లు అప్పు చేసారు. జీతాలకు, పెన్షన్లకు, ఎవరు అప్పు ఇస్తారా అని చూడాల్సిన పరిస్థితి. పెట్టుబడులు లేవు, ఆదాయం లేదు, ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, ఇలా మొత్తం గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో, మా ఇమేజ్ పెంచండి అంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి, అంటే ప్రజల డబ్బులతో, ప్రభుత్వ పెద్దలు ఇమేజ్ పెంచుకోవటం కోసం, కధనాలు రాయండి అంటూ రూ 8.15 కోట్లు ఇవ్వటం ఆశ్చర్యమే కదా ? ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మనం ఆలోచించాలి. టైమ్స్ అఫ్ ఇండియా అనేది, నేషనల్ మీడియా. ఇందులో వేసే కధనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్దగా అర్ధం కావు కూడా. మరి దేశంలో వేరే ప్రాంతాల్లో ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ బిల్డ్ చేసే కార్యక్రమం చేయాలి ? ఈ ప్రశ్నకు సమాధానం లేదనే చెప్పాలి.

అయితే ఉదయం నుంచి ఈ విషయం పై మీడియాలో రచ్చ జరుగుతూ ఉన్న సమయంలో, ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ విషయంలో ప్రస్తావన లేదు. ఇదో కొత్త సంప్రదాయం అని విశ్లేషకులు అంటున్నారు. పేపర్ లో ప్రకటనలు ఇవ్వటం చూసాం కానీ, ఇలా డబ్బులు ఇచ్చి ఇమేజ్ బిల్డ్ చేయాలని చెప్పటం, ఇదే ప్రధమం అని అంటున్నారు. మొన్నటి దాకా, దేశ వ్యాప్తంగా, జగన్ మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన బలమైన నాయకుడిగానే దేశం చూసిందని, న్యాయ వ్యవస్థ పై చేసిన ఆరోపణల నేపధ్యంలో, జగన్ నైజం తెలిసి, అందరు ఏపి గురించి ఆరా తీయటం మొదలు పెట్టిన క్రమంలో, ఏపిలో జరుగుతున్న విషయాలు చూసి, దేశంలో మేధావి వర్గం విమర్శలు చేస్తున్న సమయంలో, ఇమేజ్ బిల్డింగ్ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం, 2024లో ప్రధాని స్థానం మీద జగన్ మోహన్ రెడ్డి కన్ను వేసారని, అందుకే ఇప్పటి నుంచే రాష్ట్రంలో జరుగుతున్న పధకాలు, దేశం మొత్తానికి తెలియచేయటానికి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పనులు సొంత డబ్బులు నుంచి చేసుకోవాలి కానీ, ఇలా ప్రజా ధనం నుంచి చేయటం మాత్రం ఆక్షేపణీయం. ఇప్పటికే సాక్షికి మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారు అంటూ, కేసు కూడా నమోదైన విషయం తెలేసిందే.

ఒక పక్క పోలవరం విషయంలో, రాష్ట్రానికి పెద్ద షాక్ ఇచ్చిన కేంద్రం, దాన్ని నుంచి బయట పడక ముందే, మరో షాక్ ఇచ్చి, జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కేంద్రం జలశక్తి శాఖ ఇచ్చిన షాక్ తో, ఇప్పుడు రాష్ట్రానికి మరో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. కేంద్ర జలశక్తి శాఖ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఇచ్చిన నివేదిక ఆధారంగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రోజు, కీలక తీర్పు ఇచ్చింది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం అంటూ, ఒక కొత్త ఎత్తిపోతల పధకం మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే దీని పై తెలంగాణా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళింది. ఇక్కడ ఈ రోజు, రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కు ఎదురైంది. పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పధకానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ తప్పనిసరని, అది లేకుండా ముందుకు వెళ్ళవద్దు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. గతంలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది పాత ప్రాజెక్ట్ అని, కాబట్టి దానికి కొత్తగా అనుమతులు అవసరం లేదు, పర్యావరణ అనుమతులు అవసరం లేదు, సిడబ్ల్యుసి అనుమతులు అవసరం లేదు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయితే తుది తీర్పు వచ్చేంత వరకు, తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని, అయితే దీనికి సంబందించిన ప్రక్రియకు, ప్రాధమిక పేపర్ వర్క్, టెండర్లకు అనుమతులు ఇవ్వాలి అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని రాష్ట్ర ప్రభుత్వం కోరటంతో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకుంది.

దీంతో టెండర్ లు పిలిచినప్పటికీ, ఫైనల్ చేసినప్పటికీ కూడా, తుది తీర్పు వచ్చే వరకు దీని పై ముందుకు వెళ్ళకూడదు అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపధ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. ఇందులో చాలా స్పష్టంగా, పర్యావరణ అనుమతులు తీసుకోవాలని, ఇది కొత్త ప్రాజెక్ట్ అంటూ, కొత్త కాలువులు, సామర్ధ్యం పెంచారు కాబట్టి, పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని, అలాగే పూర్తీ స్థాయి డీపీఆర్ ఇవ్వకుండా దీనికి అనుమతులు ఇవ్వకూడదు అంటూ సిడబ్ల్యుసి స్పష్టం చేసింది. దీనికి కేంద్రం జలశక్తి శాఖ కూడా దీనికి అంగీకరించింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో, కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టకూడదు, ముందు డీపీఆర్ లు ఇచ్చిన తరువాతే, కొత్త ప్రాజెక్ట్ ల పై నిర్ణయం తీసుకోవాలని, అంగీకరించారు కాబట్టి, ఇప్పుడు ఇది మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ కు వెళ్ళే అవకాసం ఉంది. అప్పుడు కూడా డీపీఆర్ ను కేంద్ర జల శక్తి శాఖ ఆమోదించి, అప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చిన తరువాత, ఈ ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు ఇచ్చే సమయంలో, గతంలో కేంద్ర జల శక్తి శాఖ, ఈ ప్రాజెక్ట్ పై ముందుకు వెళ్ళవద్దు అంటూ రాసిన లేఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రస్తావించింది. దీంతో కేంద్రం ఇచ్చిన లేఖ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వటానికి, బలం చేకుర్చుంది అనే చెప్పవచ్చు.

ఈ రోజు మంత్రి బొత్సా మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో 30 వేల మందికి ఇళ్ళ స్థాలాలు ఇవ్వాల్సి ఉండగా, చంద్రబాబు కోర్టుకు వెళ్లి మొత్తం ఆపేశారు అంటూ, ఎప్పటి లాగే విరుచుకు పడ్డారు. ఈ విషయంలో రకరకాల ఆరోపణలు చేసారు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలతో కౌంటర్ ఇచ్చింది. అసలు తెలుగుదేశం పార్టీకి , ఈ కేసులకు ఏమి సంబంధం అని ప్రశ్నించింది. మొత్తం 38 వేల ఎకరాలు ఇళ్ళ స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించినా, ఒక 2 వేల ఎకరాలు విషయంలో మాత్రమే ప్రైవేటు పార్టీలు, కోర్టులో కేసులు వేశాయని, ఆ కేసులు వేసిన వారిలో వైసీపీ నాయకులు కూడా ఉన్నారని, వారి పేర్లు విడుదల చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ మరింత దూకుడుగా వెళ్లి, ఆ 2 వేల ఎకరాలు వదిలేసి, మిగతా 36 వేల ఎకరాలు పంచాలని, మేము చెప్తున్నాం కదా, మీరు పంచండి అంటూ, వైసీపీకి కౌంటర్ ఇవ్వటంతో, వైసిపీ అవాక్కయింది. నిజానికి అందరి మనసులో ఉంది ఇదే. కోర్టు ఏమి 30 వేల మందికి ఇవ్వవద్దు అని చెప్పలేదు కదా, కేవలం వివాదం ఎక్కడ ఉందొ అక్కడ మాత్రమే ఆగమని చెప్పింది, అవి కాకుండా మిగతావి ఇచ్చేస్తే, దాదాపుగా 95 శాతం మందికి ఇచ్చేయవచ్చు కదా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీని పై టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. "అమరావతిపై నోటికొచ్చిన అబద్ధాలాడి ప్రజాక్షేత్రంలో అభాసుపాలైన అబద్ధాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేటికీ తీరు మార్చుకోక మరో అబద్ధమాడుతున్నారు. సెంటు పట్టా పంపిణీ పేరుతో ఇప్పటికే వైసీపీ నేతలు రూ. 4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుతిన్నారు."

"అవినీతిని కొనసాగించేందుకు ఇళ్ల పట్టాల పంపిణీని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. తమ కుట్రను కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతున్నారు. అనపర్తిలో మాజీ జడ్పీటీసీ కత్తి భగవాన్ రెడ్డి పట్టాల పంపిణీపై కేసు వేసింది వాస్తవం కాదా..? మొత్తం 38 వేల ఎకరాలలో కోర్టు కేసుల కారణంగా పంపిణీ ఆగిపోయింది 2వేల ఎకరాలు మాత్రమే. మిగిలిన 36వేల ఎకరాలు పంచకుండా ఆపడం వెనుక అధికార పార్ట నేతల అవినీతి కొనసాగింపు కోసం కాదా..? టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తైన 2,62,216 టిడ్కో ఇళ్లను డిపాజిట్ దారులైన లబ్ధిదారులకు 17 నెలలైనా ఎందుకు ఇవ్వలేదు..? 50శాతానికి పైగా పనులు పూర్తైన 4,96,572 ఇళ్లకు సంబంధించి మిగిలిన పనులు పూర్తిచేసి లబ్దిదారులకు అందించకపోవడం పేదలకు ద్రోహం చేయడం కాదా..? వైసీపీ నేతల దుర్మార్గపూరిత విధానాల కారణంగా లబ్దిదారులు ఒకవైపు అద్దెలు కట్టుకుంటూ, మరోవైపు వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు 10 లక్షల ఇళ్లను నిర్మించడం జరిగింది. దీంతో పాటు 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో మంజూరై వివిధ దశల్లో నిలిచిపోయిన 4,40,426 ఇళ్లకు అదనంగా రూ.25 నుంచి 50 వేల దాకా ఆర్థిక సాయం అందించి పేదలకు పక్కా ఇళ్లు అందించాం. మరలా తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే.. ఈ పాటికి మరో 10 లక్షల మందికి ఇళ్లు అందేవి. కానీ పేదలకు ఉచితంగా ఇళ్లు అందజేస్తామని, కట్టిన డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి.. 17 నెలల్లో ఒక్క ఇంటినీ నిర్మించకపోగా తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన తాళాలను సైతం వెనక్కు లాక్కున్నారు. ఇది దుర్మార్గం కాదా..? సంక్రాంతి లోపు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అప్పగించకుంటే.. ఇళ్లను స్వాధీనం చేసుకునే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతుంది. " అని కాలువ శ్రీనివాసులు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read