ప్రభుత్వాలు నడిచేది ప్రజలు కట్టే పన్నులతోనే అందులో సందేహమే లేదు. కానీ వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వాలు కూడా ప్రజల పై ఎక్కువ భారం మోపకుండా, అవసరమైన చోట, అవసరమైన మేర పన్నులు వసూలు చేస్తూ, పన్నులు పెంచుతూ వెళ్తాయి. ఇక ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, లేదా పరిశ్రమలు ఇతర వర్గాల నుంచి వచ్చిన పన్నులతోనే, ప్రభుత్వాలు వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. అయితే ఈ పన్నుల భారం పేద మధ్య తరగతి పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక వింత పరిస్థితి ఉందనే చెప్పాలి. ఒక పక్క మాది సంక్షేమ ప్రభుత్వం అంటూ, అధికార పార్టీ హంగామా చేస్తూ వస్తుంది. పేద ప్రజలకు మేలు చేయటమే మా ధ్యేయం అంటూ, ఆ పధకం ఈ పధకం అంటూ హడావిడి చేస్తున్నారు. అవి నిజంగా ప్రజలకు అందుతున్నాయా, నిజమైన లబ్దిదారులు తీసుకుంటున్నారా అనేది వేరే చర్చ. అయితే ఇలా సంక్షేమం పాట పడుతున్న ప్రభుత్వం, పన్నుల రూపంలో వసూళ్ళు మాత్రం అధికంగా చేస్తుంది. అది కూడా చాలా తెలివిగా చేస్తుంది. ఇప్పటికే బస్ చార్జీలు పెంచారు, పెట్రోల్, డీజల్ ధరల పై వ్యాట్ రెండు సార్లు పెంచారు, ఒకసారి సెజ్ విధించారు, కరెంట్ చార్జీలు పెరిగాయి.

taxzes 20112020 2

ఇలా ఒకదారి తరువాత ఒకటి పెంచుకుంటూ వస్తున్న ప్రభుత్వం, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియని ఒక కొత్త బాదుడుతో ముందుకు వచ్చింది. అదే రోడ్డు టోల్ టాక్స్. ఇప్పటి వరకు మనం కడుతున్న టోల్ టాక్స్ లు వేరు. అవి నేషనల్ హైవేల మీద ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర రహదారుల్లో వెళ్ళినా టోల్ టాక్స్ కట్టాలి. రాష్ట్రంలోని రహదారాలుకు ఈ టోల్ టాక్స్ వసూలు చేస్తారు. ప్రతి 60-90 కిలోమీటర్లకు టోల్ బాదుడు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని స్టేట్ రహదారులకు ఇవి ఉంటాయి. చిన్న వాహనాలకు కిలోమీటర్ కు 90 పైసలు, పెద్ద వాహనాలకు 1.80 రూపాయలు, బస్సు, ట్రక్కు వంటి వాటికి కిలోమీటర్ కు 3.55 రూపాయల, అలాగే మల్టీ యాక్సిల్ వెహికల్స్ కి 8.99 రూపాయలు వసూలు చేస్తారు. ఈ డబ్బులు అన్నీ రహదారుల అబివృద్దికి ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ రేట్లు పెరిగితే, దీని ఇంపాక్ట్ రవాణా రంగం పై పడుతుంది. అన్ని రకాల వస్తువుల రేట్లు, అటో బస్సు చార్జీలు కూడా పెరిగిపోతాయి. అయినా ఇప్పటికే లక్షల కోట్లు అప్పు తెచ్చి, భూములు అమ్మి సొమ్ము చేస్తుకుంటున్న ప్రభుత్వానికి, మళ్ళీ ఇలా ప్రజల పై భారం మోపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో. ఇంకా ఇలాంటివి ఎన్ని కొత్త కొత్త పన్నులు చూడాలో.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ రోజు మరోసారి ప్రభుత్వం తీరు పై అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు కూడా హైకోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. కొన్ని నెలల క్రితం పర్మిషన్ తీసుకుని, విశాఖపట్నం పర్యటనకు వెళ్ళిన చంద్రబాబుని, పోలీసులు అడ్డుకున్న కేసు, ఈ సందర్భంగా చంద్రబాబుని ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకోవటం, పోలీసులు నోటీసులు ఇవ్వటం, చంద్రబాబుని అక్కడ నుంచి పంపించటం, వీటి అన్నిటి పై, హైకోర్టులో ఒక కేసు నమోదు అయ్యింది. గతంలో ఇదే కేసులో డీజీపీని కూడా హైకోర్టు, కోర్టుకు పిలిపించి, సెక్షన్ ఏమిటో చదవండి అంటూ, చేసిన ఘటన అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే ఈ కేసు మరోసారి హైకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా, పిటీషనర్ తరుపు న్యాయవాది వేసిన అఫిడవిట్ లో, ప్రభుత్వానికి మతిలేని చర్య అంటూ, పేర్కొన్నారు. అయితే ప్రభుత్వానిది మతిలేని చర్యగా పేర్కొనటం పట్ల, ప్రభుత్వం తరుపు న్యాయవాది ఈ వ్యాఖ్య పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే ఇదే సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, అమరావతి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నిర్మించిన రాజధానిని తరలించటం మతిలేని చర్య కాదా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, ఇప్పుడు రాజధానిని మధ్యలో తరలించటం అనేది, ఏ విధంగా అర్ధం చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

hc 20112020 2

రాజధాని నిర్మాణాలు చూసిన ఎవరికైనా బాధ ఆవేదన కలుగుతుందని, హైకోర్టు ధర్మసానం వ్యాఖ్యానించింది. దీంతో పాటుగా, రాజధానికి సంబంధించి, ఇవి మీ డబ్బులు, మా డబ్బులు కావు, ఇవి ప్రజల డబ్బులు అనేవి గుర్తు పెట్టుకోవాలని, ఏ అధికారంతో రాజధానిని తరలిస్తున్నారో తెలుసుకొండి అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వం తరుపు న్యాయవాది, ఇక్కడ ఎక్కువ ఖర్చు, అక్కడ తక్కువ ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసు ఇప్పటికే విచారణలో ఉంది కాబట్టి, దీని పై ఇక్కడ మాట్లాడవద్దు అని ప్రభుత్వం తరుపు న్యాయవాది సూచించారు. ఈ నేపధ్యంలోనే, రాజధాని ఇక్కడే ఉండాలని న్యాయవాది పేర్కొన్నారని, అందువల్లే దీని గురించి తాము వ్యాఖ్యానించామని ధర్మాసనం పేర్కొంది. ఇక దీంతో పాటుగా, రాజకీయాల్లో నేరప్రవృత్తి పెరిగిపోతున్న అంశం పై స్పందిస్తూ, ఇది మంచిది కాదని, వ్యవస్థలను పరిరక్షించుకోవాలన్నా, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా రాజ్యాంగంలో ఉన్న హక్కులు పరిరక్షించుకావాలన్నా, ఈ రాజకీయాల్లో నేర నేరప్రవృత్తిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, ఇది అందరి మీద ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నేర చరిత్ర కలిగిన వారి నుంచి వ్యవస్థలను కాపాడాల్సిన అవసరం ఉందని, నేర చరిత్ర కలిగిన వారు రాజకీయాలకు దూరంగా ఉంటేనే వ్యవస్థలు అన్నీ కూడా సరిగ్గా పని చేస్తాయని, ధర్మాసనం వ్యాఖ్యానించింది

తెలంగాణాలో ఎన్నికలు వస్తున్నాయి అంటే, ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ చేయటం, లేదా ఇక్కడ రాజకీయ నాయకులను బూచిగా చూపెట్టి, రాజకీయం చేయటం చూసాం. అయితే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి, తెలంగాణాలో అధికార పార్టీకి ఆ అవకాసం వచ్చింది. అందులోనూ, ఏపిని ఒక్క మాట అంటే, చంద్రబాబు అధికార స్థానంలో ఉండి ఊరుకునే వారు కాదు. ఆంధ్రప్రదేశ్ ను పరిరక్షించే స్థానంలో, అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఘాటుగా బదులు ఇచ్చే వారు. అయితే దానికి ప్రాంతీయ వాదం జోడించి, అవతల ఉన్న తెలంగాణా పార్టీ, రాజకీయంగా వాడుకుని లబ్ది పొందుతూ ఉండేది. అయితే ఈ సారి తెలంగాణాలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి. కానీ ఈ సారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు లేరు. అలాగే ఆయన తెలంగాణా రాజకీయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా, తెలంగాణా పార్టీ స్థానిక నాయకత్వానికి బాధ్యతలు ఇచ్చేసారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణా రాష్ట్ర అధినేతలను, మిత్రపక్షంగా ఉండే వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ ఎలాగూ హైదరాబాద్ లో పోటీ చేయదు. అక్కడ పార్టీ ఎప్పుడో మూసేసారు. దీంతో, చంద్రబాబు లేకపోవటం, తమ మిత్రపక్షం లాంటి పార్టీ ఉండటంతో, ఈ సారి తెలంగాణా ఎన్నికల్లో ఆంధ్రాను బూచిగా చూపించటం కుదరదు.

kcr 19112020 2

అందుకే, వేరే వ్యూహంతో తెలంగాణా రాజకీయ పార్టీ వచ్చినట్టు ఉంది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎదిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ మనలను తొక్కేస్తుంది అంటూ, చంద్రబాబుని బూచిగా చూపించి చెప్పేవారు. అయితే ఇప్పుడు వ్యూహం మార్చి, ఆంధ్రప్రదేశ్ ను తక్కువ చేసే ప్రయత్నం చేసి, లబ్ది పొందాలని అనుకుంటున్నారు. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ, రాజకీయ ఉపన్యాసం ఇస్తూ, ఇరిగేషన్ రంగంలో తాము అనేక విజయాలు సాధించామని, డంభాచారం కొట్టి, మీరు విడిపోతే మీ పని అయిపోతుంది అంటూ చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడో అట్టడుగుకు తోసేశాం అని, వరి పండించటంలో ఆంధ్రప్రదేశ్ కేలవం 50 లక్షల ఎకరాలు ఉంటే, మనం కోటి ఎకరాలు సాగు చేస్తున్నాం అంటూ, కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ నంబర్స్ లో నిజం ఉందో లేదో తెలియదు కానీ, ఇలా ఒక రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం మాత్రం గర్హనీయం. మరి గతంలో లాగా, ఇప్పటి ఆంధ్రా పాలకులు కేసీఆర్ కు గట్టి సమాధానం చెప్పి, ఇది మేము సాధించిన ప్రగతి, మీ మాటలు తప్పు అని చెప్తారో, లేకపోతే వ్యక్తిగత స్నేహం ముందు, ఆంధ్రప్రదేశ్ ని అట్టడుగుకు తోసేశాం అని చెప్పినా, మౌనంగా ఉంటారో చూడాలి. కేసిఆర్ వ్యాఖ్యల పై కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రాంత వాసులు మాత్రం, సోషల్ మీడియాలో దీటుగా బదులు ఇస్తున్నారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని, నిన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై చేసిన వ్యాఖ్యల పై, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమీషనర్, కొడాలి నాని పై, గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. ఈ రోజు ఉదయం, గవర్నర్ కి, నిమ్మగడ్డ రమేష్ ఒక లేఖ రాసి, కొడాలి నాని పై ఫిర్యాదు చేసారు. ఈ లేఖలో కొడాలి నాని నిన్న చేసిన వ్యాఖ్యలు, పత్రికలో వచ్చిన క్లిప్పింగ్స్, అలాగే టీవీ ఛానల్స్ లో వచ్చిన క్లిప్పింగ్స్ ని కూడా జత చేసి, గవర్నర్ కు పంపించారు. ఇందులో కొడాలి నాని, అసభ్య పదజాలం ఉపయోగించటమే కాకుండా, ఎన్నికల నిర్వహణ పై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని కూడా ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ విధి అని ఆయన లేఖలో పేర్కొంటూ, ఇప్పటికే ఎన్నికల నిర్వహణ పై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగిన విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఉద్యోగులను ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారని, ప్రస్తుతం వైరస్ అధికంగా ఉంటే ఉద్యోగులు ఎలా ఎన్నికలు నిర్వహిస్తారు అంటూ, నిన్న కొడాలి నాని ప్రస్తావించిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఉద్యొగులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, గవర్నర్ కు తెలిపారు.

kodalinani 19112020 2

ఎన్నికల కమిషన్ పై , కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు అని కూడా ఆయన గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ పై కొడాలి నాని ఉపయోగించిన భాష పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వెంటనే కొడాలి నాని పై తగు చర్యలు తీసుకోవాలని కూడా, గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. అయితే ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించటానికి, నిమ్మగడ్డ చీఫ్ సెక్రటరీన కోరగా నిన్న అవకాసం కుదరకపోవటంతో, ఈ రోజు కూడా చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. ఈ రోజు కూడా కుదరకపోవటంతో, ఈ రోజు కూడా సమావేశం రద్దు చేసారు. అయితే ఈ అన్ని అంశాల పై హైకోర్టుని ఆశ్రయించే యోచనలో ఎన్నికల కమిషన్ ఉందని తెలుస్తుంది. ఈ మొత్తం అంశాల పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, కొంత మంది మంత్రులతో సమావేశం అయ్యారు. జరుగుతున్న విషయాల పై చర్చించినట్టు తెలుస్తుంది. మరి ఈ అంశానికి కోర్టు ఒక్కటే సమాధానం చెప్పగలదా ? ప్రభుత్వం ఎవరు చెప్తే వింటుంది ? లేదా నిమ్మగడ్డ ఉండే దాకా, ఎన్నికలు ఉండవా ? చూడాలి మరి ఏమి జరుగుతుందో ?

Advertisements

Latest Articles

Most Read